45 రోజుల్లోనే ఏడంతస్తుల బిల్డింగ్‌.. ఎక్కడంటే..

రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధికి అవసరమైన ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (ఎఫ్‌సీఎస్‌) కేంద్రం కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఏడంతస్తుల్లో రూపుదిద్దుకుంది. బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) ప్రాంగణంలో

Updated : 18 Mar 2022 07:29 IST

ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

నిర్మాణ రంగంలో డీఆర్‌డీవో ఘనత

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధికి అవసరమైన ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (ఎఫ్‌సీఎస్‌) కేంద్రం కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఏడంతస్తుల్లో రూపుదిద్దుకుంది. బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) ప్రాంగణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) విమాన నియంత్రణ, మానవరహిత విమాన వ్యవస్థలకు అవసరమైన పరిశోధన సదుపాయాలున్నాయి. 1.3 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రం పనులు ఫిబ్రవరి 1న ప్రారంభమై గురువారంతో ముగిశాయి. ఇంతవేగంగా నిర్మాణ పనులు పూర్తి కావడం భారతీయ నిర్మాణ రంగంలో మైలురాయి అని డీఆర్‌డీవో అభివర్ణించింది. ఇందుకోసం హైబ్రిడ్‌ కన్‌స్ట్రక్షన్‌ సాంకేతికతను వాడారు. ప్రీఇంజినీరింగ్‌, ప్రీకాస్టింగ్‌, ప్రీఫ్యాబ్రికేట్‌ విధానాలతో శాశ్వత సదుపాయాలను కల్పించారు. స్టాండర్డ్‌ నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ నిబంధనల ప్రకారం వీఆర్‌ఎఫ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, అగ్నిప్రమాద నియంత్రణ, విద్యుత్తు వ్యవస్థలను సమకూర్చారు. ఎల్‌అండ్‌టీ, ఐఐటీ-మద్రాస్‌, రూర్కీ బృందాలు సాంకేతిక సాయాన్ని అందించాయి. హైబ్రిడ్‌ సాంకేతిక విధానం భారతీయ నిర్మాణ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. ఈ సాంకేతికతతోనే రక్షణేతర ప్రాజెక్టులను తక్కువ వ్యయం, తక్కువ శ్రమతో వేగంగా నిర్మించే ప్రణాళికలను డీఆర్‌డీవో సిద్ధం చేసినట్లు తెలిపారు. రికార్డు సమయంలో ఏడంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేయడంలో భాగస్వాములైన డీఆర్‌డీవో బృందాన్ని సంస్థ ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని