UGC: నాలుగేళ్ల డిగ్రీలో ఎప్పుడైనా బయటకు వెళ్లొచ్చు: యూజీసీ

నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌, క్రెడిట్‌ విధానంపై యూజీసీ (విశ్వవిద్యాలయాల నిధుల సంఘం) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published : 20 Mar 2022 09:53 IST

ఈనాడు, అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌, క్రెడిట్‌ విధానంపై యూజీసీ (విశ్వవిద్యాలయాల నిధుల సంఘం) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. నాలుగేళ్ల డిగ్రీకి 160 క్రెడిట్లు ఉండాలని సూచించింది. నాలుగేళ్లలో విద్యార్థి ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. రెండు సెమిస్టర్లు పూర్తి చేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. రెండేళ్లు చదివితే డిప్లొమా, మూడేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగేళ్లు చదివితే ఆనర్స్‌ డిగ్రీ ఇస్తారు. 15 గంటల బోధన, 30 గంటల ప్రాక్టికల్స్‌, ఫీల్డ్‌వర్క్‌, కమ్యూనిటీ ప్రాజెక్టులకు ఒక్కో క్రెడిట్‌ను ఇవ్వాలని యూజీసీ సూచించింది. ప్రాజెక్టు వర్క్‌, తరగతి బయట చేసే ప్రాజెక్టులు, బోధన, ఇంటర్న్‌షిప్‌, ల్యాబొరేటరీ వర్క్‌ ఇలా ప్రతి దానికి ఎన్నెన్ని క్రెడిట్లు ఇవ్వాలో పేర్కొంది. ఈ ముసాయిదా నిబంధనలపై ఏప్రిల్‌ నాలుగో తేదీ లోపు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.

విద్యాంజలి పథకానికి మార్గదర్శకాలు

విద్యాసంస్థలు, అధ్యాపకులు, విద్యార్థులకు స్వచ్ఛందంగా సహాయం అందించే విద్యాంజలి పథకానికి యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. అభ్యాసకులు, అధ్యాపకులు, సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం, మౌలిక సమస్యలను అధిగమించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొంది. దాతలు అకడమిక్‌, పరిశోధన, ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు, బోధనలాంటి సదుపాయాలను అందించొచ్చు. ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు, కంపెనీల ప్రతినిధులు తమ అనుభవాలను విద్యార్థులకు అందించవచ్చు. ఇందుకోసం విద్యాసంస్థలు ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా సహాయం అందించేందుకు ముందుకొచ్చే వాలంటీర్లు, సంస్థలతో వ్యవహరించాల్సిన తీరు, సేవలు పొందడం, వాటిపై మదింపునకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం యూజీసీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని