సారా మరణాలపై సీఎం అబద్ధాలు

ఇటువంటి ఫేక్‌ ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని జగన్‌ను ఉద్దేశించి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 27 మంది చనిపోతే సాధారణ మరణాలని

Published : 22 Mar 2022 03:42 IST

తెదేపా నేత అచ్చెన్నాయుడు

జంగారెడ్డిగూడెంలో 27 మంది మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పంపిణీ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఇటువంటి ఫేక్‌ ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని జగన్‌ను ఉద్దేశించి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 27 మంది చనిపోతే సాధారణ మరణాలని జగన్‌ అంటున్నారు. అన్ని రాజకీయ పక్షాలు, మీడియా, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, ప్రజలందరూ సారా మరణాలని చెబుతుంటే.. రాష్ట్రానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో సహజ మరణాలన్న ఆయన ముఖ్యమంత్రే కాదు’ అని విమర్శించారు. అచ్చెన్నాయుడితో పాటు 14 మంది తెదేపా ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వచ్చారు. స్థానిక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున 27 కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తెదేపా అధికారంలోకి వచ్చాక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో మద్యం పాలసీపై, జె బ్రాండ్లపై న్యాయ విచారణ చేయాలని డిమాండు చేశారు. మానవ హక్కుల కమిషన్‌ జోక్యం చేసుకొని మరణాలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కోరారు. పాలకులకు ప్రజల ప్రాణాలతో పనిలేదు.. డబ్బులు కావాలి అందుకే బాగా తాగించాలన్న దృక్పథంలో ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని