Fire accident: నిద్రలోనే బుగ్గి అయ్యారు

బతుకుతెరువు కోసం పొట్టచేత పట్టుకుని వచ్చిన 11 మంది వలసకూలీలు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. నిద్రమత్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో బయటపడే దారిలేక విపత్కర పరిస్థితుల్లో అగ్నికీలలకు ఆహుతయ్యారు

Updated : 24 Mar 2022 05:46 IST

తుక్కుగోదాములో అగ్నిప్రమాదం  
 11 మంది సజీవదహనం
 కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్న ఒక వ్యక్తి
సికింద్రాబాద్‌ బోయిగూడలో ఘటన
మృతులంతా బిహార్‌ వలస కార్మికులు
బాధిత కుటుంబాలకు రూ. 9 లక్షల పరిహారం
రాష్ట్రపతి, ప్రధాని, సీఎం సహా పలువురి దిగ్భ్రాంతి

ఈనాడు, న్యూస్‌టుడే బృందం - హైదరాబాద్‌:  బతుకుతెరువు కోసం పొట్టచేత పట్టుకుని వచ్చిన 11 మంది వలసకూలీలు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. నిద్రమత్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో బయటపడే దారిలేక విపత్కర పరిస్థితుల్లో అగ్నికీలలకు ఆహుతయ్యారు. ఒకే ఒక కార్మికుడు పేలుడు శబ్దంతో మేలుకుని కిందకు దూకేయడంతో అతడి ప్రాణాలు దక్కాయి. హృదయవిదారకమైన ఈ దుర్ఘటన సికింద్రాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించింది. ప్రమాదస్థలం సనత్‌నగర్‌ నియోజకవర్గం బన్సీలాల్‌పేట డివిజన్‌ బోయిగూడ ప్రాంతంలో ఉంది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి. మృతదేహాలను మూడు ప్రత్యేక విమానాల్లో గురువారం బిహార్‌ రాష్ట్రానికి తరలించనున్నారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. బోయిగూడలోని కట్టెలమండి ప్రాంతంలో సుధాకర్‌రెడ్డికి చెందిన గోదామును శ్రవణ్‌ స్క్రాప్‌ ట్రేడర్స్‌ పేరిట దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సంపత్‌ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. దాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఒకదాంట్లో చెక్కలను సానపట్టే వర్క్‌షాప్‌, దాని పక్కనే విద్యుత్తు కేబుళ్ల కట్టల నిల్వలు, తర్వాత చిత్తుకాగితాల నిల్వలు, దాని పక్కనే సెంట్రింగ్‌ రాడ్‌ల తయారీ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నారు. చిత్తుకాగితాల గోదాము మిగతా వాటికంటే విశాలంగా ఉంటుంది. అందులోనే ఇనుప మెట్లున్నాయి. వాటిద్వారా పైకి వెళ్తే అక్కడ రెండు గదులున్నాయి. ఇక్కడ పనిచేసే బిహార్‌ కార్మికులు ఈ రెండు గదుల్లో నిద్రించారు. కింద గోదాముల నుంచి మంటలు పైకి వ్యాపించడం, వారు పై నుంచి కిందికి రావడానికి గోదాములోకి ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు ఒకటే తోవ కావడంతో వారు ఎటూ తప్పించుకునే దారిలేక మంటలకు ఆహుతైపోయారు.

ఊపిరాడక.. బయటపడే దారిలేక...
చిత్తుకాగితాల గోదాములో ఇనుప గ్రిల్స్‌తో కూడిన మెట్లు ఎక్కే చోట పవర్‌పాయింట్‌ ఉందని, అగ్నిప్రమాదం అక్కడ గానీ, విద్యుత్‌ కేబుళ్ల గోదాములో గానీ సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తుక్కు అంటుకోవడం వల్ల మంటలతోపాటు దట్టమైన పొగలు  కమ్ముకున్నాయి. గోదాముపైనే కార్మికులు నివసించే రెండు గదులు ఉన్నప్పటికీ, అందులోకి వెళ్లేందుకు చిత్తుకాగితాల గోదాములోని గ్రిల్స్‌ మెట్లు ఒక్కటే దారి. దట్టమైన పొగలు ఒకవైపు, తీవ్రమైన మంట సెగలు ఇంకోవైపు రావడంతో ఆ 11 మందీ నిద్ర నుంచి మేల్కొన్నా, ఊపిరాడక.. బయటపడే మార్గం కానరాక నిస్సహాయంగా ప్రాణాలు వదిలి ఉంటారని భావిస్తున్నారు.

అతడు చెప్పాకే.. 11 మంది సమాచారం వెలుగులోకి
పోలీసులు, అగ్నిమాపకాధికారులు ప్రమాదస్థలికి చేరుకోగానే.. మంటల్ని అదుపు చేయడంపైనే వారు దృష్టి సారించారు. పైనున్న కిటికీలోంచి ఒకరు దూకినట్టు కనిపించిందని స్థానికులు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కింద పడిన ప్రేమ్‌ను గుర్తించాక... లోపల 11 మంది చిక్కుకుపోయారని అతడు చెబితేనే తెలిసింది. కానీ అప్పటికే 11 నిండుప్రాణాలు మంటలకు ఆహుతయ్యాయి. తీవ్రత తగ్గాక సిబ్బంది లోపలికి వెళ్లగా మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడిపోయి బూడిదకుప్పలా కనిపించాయి. బాధితుడు ప్రేమ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు తుక్కుగోదామును నిర్వహిస్తున్న సంపత్‌పై ఐపీసీ 304ఎ, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.

డీఎన్‌ఏ పరీక్షలకు నమూనాల సేకరణ
11 మంది కార్మికుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడి మసైపోవడంతో పరీక్షించడానికి వైద్యులు చాలా శ్రమించాల్సి వచ్చింది. ముందు జాగ్రత్తచర్యగా మృతదేహాల డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు. వీటిని వారి కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోల్చనున్నారు. తమ రాష్ట్రానికి చెందిన వారు చనిపోవడంతో బిహార్‌కు చెందిన వందలాది కార్మికులు గాంధీ ఆసుపత్రికి తరలివచ్చారు. తమ వాళ్లు చనిపోయారని తెలుసుకొని కన్నీరుమున్నీరయ్యారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు ప్రమాదస్థలాన్ని సందర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతులు వీరే
బిహార్‌లోని కతిహార్‌, చాప్రా జిల్లాలకు చెందిన రాజేష్‌ (22), దీపక్‌రామ్‌ (36), బిట్టూ (ఛత్రిలారామ్‌) అలియాస్‌ గోలూ (22), బహుకుమార్‌ (21), సికిందర్‌ రామ్‌కుమార్‌ (30), చింటుకుమార్‌ (25), సత్యేంద్రకుమార్‌రామ్‌ (38), దినేష్‌కుమార్‌ అలియాస్‌ ధవూరాంకుమార్‌ (30), రాజేష్‌కుమార్‌ (30), దామోదర్‌కుమార్‌ (25), అంకజ్‌కుమార్‌ (22), ప్రేమ్‌కుమార్‌ ఇక్కడ పనిచేసే కార్మికులు. చిత్తుకాగితాల గోదాములో పదిమంది, ఎదురుగా ఉన్న గోదాములో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. వారంతా గోదాము పైభాగాన ఉన్న రెండు గదుల్లో నివసిస్తున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి వారంతా ఆ గదుల్లో నిద్రించారు. తెల్లవారుజామున మూడుగంటల సమయంలో తుక్కు గోదాముతోపాటు, విద్యుత్తు కేబుళ్ల కట్టలున్న గోదాములోనూ మంటలు చెలరేగాయి. 12 మందిలో ప్రేమ్‌కుమార్‌ కిటికీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా,  మినహా మిగిలిన 11 మందీ సజీవదహనమయ్యారు. స్థానికులిచ్చిన సమాచారంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని, మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు.


సిలిండర్‌ పేలిన శబ్దంతో మెలకువ వచ్చింది: ప్రేమ్‌

రోజూ మాదిరిగానే.. రాత్రి 10 గంటలకు అందరం భోజనం చేసి పడుకున్నాం. తెల్లవారుజాము మూడు గంటల సమయంలో ఒక్కసారిగి పేలుడు శబ్దం వినిపించడంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే, మేం ఉన్న గదిలోకి పెద్దగా మంటలు, వేడిసెగలు, పొగ వ్యాపించాయి. అందరం లేచి తప్పించుకోవాలనుకున్నాం. నేను కిటికీలోంచి దూకేశా. మిగిలినవారు మంటల తీవ్రత కారణంగా బయటకు రాలేకపోయారు. నేను కిందపడిన తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. పోలీసులు తనను ఆసుపత్రికి తీసుకెళ్లారు’ అని తెలిపాడు ప్రాణాలతో బయటపడిన ప్రేమ్‌కుమార్‌. గాంధీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడితో పోలీసులు మాట్లాడారు. రెండేళ్లుగా తనతోపాటు 11 మంది శ్రవణ్‌ స్క్రాప్‌ ట్రేడర్స్‌లో పనిచేస్తున్నారన్నారు. మంగళవారం రాత్రి తాను, బిట్టు, అంకజ్‌ ఒక గదిలో పడుకోగా... మరో గదిలో తొమ్మిది మంది పడుకున్నారని వివరించాడు. తమ యజమాని సంపత్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రేమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ముఖం, భుజం తదితర ప్రాంతాల్లో 10 శాతం మేర కాలిన గాయాలైనట్లు గుర్తించారు.


గోదాముల్లో సోదాలు: హోంమంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: బోయిగూడ లాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. తుక్కు గోదాములు, కలప డిపోలు, కోత మిల్లులను అధికారులతో సోదాలు చేయిస్తామన్నారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో పోలీసు, అగ్నిమాపక, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జనావాసాల మధ్య కొనసాగుతున్న టింబర్‌డిపోలు, సామిల్లుల వంటి వాటిని నగర శివార్లలోకి తరలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ మఖ్య కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, అగ్నిమాపకశాఖ డీజీ సంజయ్‌జైన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హోంమంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం
బోయిగూడలో అగ్ని ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో హోం మంత్రి మహమూద్‌ అలీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. అక్కడ గోదాములో గది కోసం నిర్మించిన స్లాబులో కొంత భాగం కూలింది. మంత్రి తిరుగుముఖం పట్టిన క్షణాల వ్యవధిలో ఇది జరిగింది. కూలినప్పుడు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకున్నాం: సీఎస్‌
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: అగ్ని ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. గాయపడిన ప్రేమ్‌కుమార్‌కు గాంధీ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తున్నాం. మృతదేహాలను గురువారం ఉదయం మూడు ప్రత్యేక విమానాల్లో బిహార్‌కు తరలించే ఏర్పాటు చేశాం. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని