Ap news:తెదేపా సభ్యుల వినూత్న నిరసన

శాసనసభలో తెదేపా సభ్యులు భజన చేయడం దుమారం రేపింది. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార వైకాపా సభ్యులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తూ మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు తాళాలతో సభలో భజన చేశారు.

Updated : 24 Mar 2022 06:13 IST

మద్య నిషేధంపై తెదేపా వాయిదా  తీర్మానాన్ని తిరస్కరించిన సభాపతి
పోడియం ముందు  విపక్ష సభ్యుల నినాదాలు
సంక్షేమంపై సర్కారును పొగడ్తల్లో  ముంచెత్తిన వైకాపా సభ్యులు..
నిరసనగా తెదేపా ఎమ్మెల్యేల భజన
2 రోజులపాటు ఐదుగురు సభ్యుల సస్పెన్షన్‌

ఈనాడు, అమరావతి: శాసనసభలో తెదేపా సభ్యులు భజన చేయడం దుమారం రేపింది. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార వైకాపా సభ్యులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తూ మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు తాళాలతో సభలో భజన చేశారు. దీంతో సభాపతి, అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెదేపా సభ్యులపై సభాపతి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని మార్షల్స్‌ పోడియం ముందు నుంచి వారి సీట్ల వద్దకు పంపాక.. మళ్లీ భజన చేయడంతో ఐదుగురు తెదేపా సభ్యులను రెండు రోజులపాటు సభాపతి సస్పెండ్‌ చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమయ్యాక మద్య నిషేధంపై తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో తెదేపా సభ్యులు భవాని, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్‌ పోడియం ముందుకు వెళ్లి మద్య నిషేధంపై చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు. సభాపతి ససేమిరా అనడంతో సారా మరణాలపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అప్పటికీ ప్రశ్నోత్తరాలను కొనసాగించడంతో తెదేపా సభ్యులు పోడియాన్ని చేతులతో కొట్టడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియంపైకి రాకుండా తెదేపా సభ్యులకు అడ్దంగా మహిళా మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈలోగా ప్రశ్నోత్తరాల్లో భాగంగా రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణం, ఎరువుల పంపిణీ, కొవిడ్‌ నివారణ చర్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు జి.అమర్‌నాథ్‌, అబ్బయ్య చౌదరి, ఎం.జగన్‌మోహన్‌రావు, జి.శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రులు శ్రీరంగనాథరాజు, కన్నబాబు, ఆళ్ల నాని సమాధానమిచ్చారు. వివిధ రంగాల అభివృద్ధిలో ప్రభుత్వ పనితీరును సభ్యులు ప్రశంసించారు. దీంతో అప్పటికే పోడియం ముందున్న తెదేపా సభ్యులు తాళాలతో భజన చేయడంతో స్పీకర్‌ సహా అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌, మల్లాది విష్ణు, అబ్బయ్యచౌదరి, సుధాకర్‌బాబు మాట్లాడుతూ సభలోకి తాళాలు తెచ్చి భజన చేసిన తెదేపా సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు. 2024 ఎన్నికల తర్వాత తెదేపాకు చిడతలే మిగులుతాయని మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి చేసిన వ్యాఖ్యలపై తెదేపా సభ్యులు స్పందించారు. ప్రజలు ఎవర్ని పక్కన పెడతారో చూద్దురంటూ ప్రతి విమర్శలు చేశారు. ‘సారా మరణాలపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలి... మార్షల్స్‌ని అడ్డుపెట్టుకుని సభ నిర్వహిస్తున్న స్పీకర్‌.. షేమ్‌.. షేమ్‌’ అంటూ తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభాపతి తెదేపా సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు ఇంగితజ్ఞానం ఉందా?’ అంటూ మండిపడ్డారు. అనంతరం ప్రశ్నోత్తరాలను ముగించి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లుగా సభ్యులు భావించాలని రూలింగ్‌ ఇచ్చి శూన్యగంటను ప్రారంభించారు. దాంతో తెదేపా సభ్యులు మరోసారి భజన తాళాలు వాయించడంతో.. ఐదుగురు ఎమ్మెల్యేలను బుధ, గురువారాలు సభనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. సభ్యుల నుంచి తాళాలు స్వాధీనం చేసుకున్నారు.

నిమిషానికి రూ.80,820... రోజుకు 53.29 లక్షల ఖర్చు: సభాపతి

శాసనసభ నిర్వహణకు నిమిషానికి రూ.80,820, రోజుకు రూ.53.29 లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నట్లు సభాపతి సీతారాం వెల్లడించారు. సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తెదేపా సభ్యులు స్పీకర్‌ను సభలో గౌరవిస్తూ... బయటకు వెళ్లాక డౌన్‌ డౌన్‌ అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సభ్యులను సస్పెండ్‌ చేసిన రోజు రాత్రి తనకు నిద్ర పట్టదని, మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని