liquor: జగన్‌ హయాంలో 103 మద్యం బ్రాండ్లకు అనుమతి

వైకాపా ప్రభుత్వం 103 రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చిందని, శాసనసభలో చర్చ పెడితే వివరాలను వెల్లడిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated : 25 Mar 2022 05:26 IST

 అయ్యన్నపాత్రుడి పేరుతో ఉన్న డిస్టిలరీని విజయసాయి ఎప్పుడో తీసుకున్నారు

సీఎంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేల ధ్వజం

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం 103 రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చిందని, శాసనసభలో చర్చ పెడితే వివరాలను వెల్లడిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాల ప్రకారం జగన్‌ సీఎం అయ్యాకే కొత్త బ్రాండ్లకు అనుమతులిచ్చారని వివరించారు. మంగళగిరిలో అచ్చెన్నాయుడితోపాటు ఎమ్మెల్యేలు సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు, మంతెన రామరాజు గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘శాసనసభలో సీఎం బుధవారం చదివిన బ్రాండ్లన్నీ మద్యం తయారీ కంపెనీలు చేసుకున్న దరఖాస్తుల్లో ప్రస్తావించిన వాటి పేర్లు. మాకు ఫలానా బ్రాండ్‌, ఫలానా పేరుతో కావాలంటూ మద్యం తయారీ కంపెనీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఇవన్నీ చంద్రబాబు రాష్ట్రంలో అమ్మించేశారన్నట్లుగా సీఎం సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు’ అని వారు మండిపడ్డారు. ‘తెదేపా నాయకులు నడుపుతున్నారని చెబుతున్న డిస్టిలరీలను అధికారంలోకి రాగానే సీఎం లాగేసుకున్నారు. అయ్యన్నపాత్రుడి పేరుతో ఉన్న డిస్టిలరీని విజయసాయిరెడ్డి ఎప్పుడో తీసేసుకున్నారు’ అని వివరించారు.

‘తెదేపా హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం జగన్‌.. తెదేపా నేతలు నడుపుతున్నారని చెబుతున్న మద్యం తయారీ కంపెనీలను ఎందుకు రద్దు చేయలేదు? తెదేపా నాయకుల పేర్లతో ఉన్నాయని చెబుతూ తన మనుషులతో వ్యాపారం చేయిస్తున్నారు. సభలో సీఎం అన్నీ అబద్ధాలే చెప్పారు. తెదేపా నేతలు అయ్యన్న పాత్రుడు, సుధాకర్‌ యాదవ్‌, ఆదికేశవులు నాయుడు పేర్లతో ఇప్పుడు మద్యం కంపెనీలు లేవు. తెదేపా నాయకులను ఇళ్లలో నుంచి బయటకే రానివ్వని సీఎం.. మద్యం అమ్ముకోనిస్తారా?’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

సీఎం బినామీలకు కాకుండా ఇతరులకు ఒక్క డిస్టిలరీయైనా ఉందా?

‘సీఎం బినామీలవి కాకుండా ఇతరులకు చెందిన ఒక్క డిస్టిలరీ అయినా రాష్ట్రంలో ఉందా? వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న జగన్‌రెడ్డి.. తన సంపాదనకే కొత్త మద్యం పాలసీ తెచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికొచ్చిన ఒకటీ రెండు డిస్టిలరీలను ఇప్పుడు జగన్‌రెడ్డి బినామీలే నడుపుతున్నారు. పేదలకిస్తున్న బియ్యాన్ని వైకాపా నేతలే కొని వాటి నుంచే మద్యం తయారు చేస్తున్నారు. మద్యం తయారీ, అమ్మకాలు, సరఫరా, హాలోగ్రామ్‌ లేబుళ్లు అంటించడం సహా అంతా సీఎం మనుషులే చేస్తున్నారు’ అని వెల్లడించారు.

నమ్మకస్థులైన అధికారులతో మద్యం వ్యాపారం

‘తనకు నమ్మకస్థులైన అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి సీఎం రప్పించి మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. వాసుదేవరెడ్డికి అర్హత లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టరును చేశారు. సత్యప్రసాద్‌కు సదరు కార్పొరేషన్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. మద్యం సరఫరా కాంట్రాక్టులన్నీ వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి బంధువులే నిర్వహిస్తున్నారు. అక్రమ మద్యాన్ని నివారించేందుకు చంద్రబాబు తీసుకొచ్చిన హాలోగ్రామ్‌ విధానాన్ని జగన్‌రెడ్డి తొలగించారు. మద్యం దుకాణదారులు, తయారీదారులు, సరఫరాదారులకు విధిగా జె-ట్యాక్స్‌ కట్టాలనే షరతు పెట్టారు. రూ.10, రూ.12కి తయారయ్యే క్వార్టర్‌ మద్యం సీసాను రూ.250 నుంచి రూ.300కు అమ్ముతున్నారు. పేదల ఆకలి తీర్చే రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.20 చొప్పున ప్రభుత్వంలోని వారే మద్యం తయారీ కంపెనీలకు తరలిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా వైకాపావారే పేదలనుంచి రేషన్‌ బియ్యాన్ని కొంటున్నారు’ అని అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ఆరోపించారు.

భర్తలతో తాగించి భార్యకు చేయూతనందిస్తారా?

‘మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతానని ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి ఎందుకు చెప్పలేదు? భర్త తాగితేనే భార్యకు చేయూత, తండ్రి జేబుగుల్ల చేసుకుంటేనే బిడ్డకు అమ్మ ఒడి ఇస్తానని ఎందుకు అనలేదు?’ అని వారు ప్రశ్నించారు.

ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలకు తెగించి సీఎంతో పోరాటం

‘మా ప్రాణాలకు తెగించి మరీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి సీఎంతో పోరాడుతున్నాం. మద్యం అమ్మకాలు, తయారీ, ముఖ్యమంత్రికి అందుతున్న రూ.10వేల కోట్ల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించమంటే మమ్మల్ని బయటకు పంపారు. అవాస్తవాలు అవలీలగా చెప్పడంలో ముఖ్యమంత్రిని మించినవారు భూమ్మీదే ఎవరూ ఉండరు’ అని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.


జగన్‌కు ఐదేళ్లలో రూ.10వేల కోట్ల ఆదాయం

‘మద్యం వ్యాపారంతో జగన్‌రెడ్డి ఒక్కరికే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల ఆదాయం రానుంది. ఇప్పటికే చాలావరకు చేరింది. అదెలాగంటే.. ప్రభుత్వ లెక్కల్లో చూపుతున్న మద్యం అమ్మకాలు కాకుండా వ్యక్తిగత సంపాదనకు తన వారితో అమ్మిస్తున్న మద్యం వేరే ఉంది. రోజుకు ఎన్ని కేసుల మద్యం అమ్మకాలు ప్రభుత్వ లెక్కల్లో చూపుతున్నారో.. ఎన్ని కేసుల మద్యం జగన్‌రెడ్డి ఖజానా నింపేందుకు అమ్ముతున్నారో బయటపెడతాం. మద్యం దుకాణాలు, తయారీ కంపెనీలను సీఎం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అవన్నీ తన చేతిలో ఉంటేనే ఐదేళ్లలో రూ.10వేల కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి లెక్కలేశారు. జాతిపిత పుట్టిన రోజునాడే కొత్త మద్యం పాలసీ తెచ్చిన ఘనత సీఎంది’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని