AP Capitals: సుప్రీంకోర్టుకి వెళ్లినా మొట్టికాయలు తప్పవనే..

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్‌, అధికార పార్టీ నాయకులు గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్యల్ని వివిధ పార్టీల, ప్రజాసంఘాలు, ఇతర సంస్థల ప్రతినిధులు ఖండించారు.

Updated : 25 Mar 2022 06:32 IST

అసెంబ్లీలో ముఖ్యమంత్రి, వైకాపా నాయకుల వ్యాఖ్యలపై వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు ధ్వజం

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్‌, అధికార పార్టీ నాయకులు గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్యల్ని వివిధ పార్టీల, ప్రజాసంఘాలు, ఇతర సంస్థల ప్రతినిధులు ఖండించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లినా మొట్టికాయలు పడటం ఖాయమని తెలియడంతో, ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకే శాసనసభలో చర్చించారని విమర్శించారు. చట్టసభల్లో ఏం మాట్లాడినా కోర్టుధిక్కరణ కిందకు రాదన్న ధైర్యంతోనే అధికారపార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, అది సరికాదని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తన పరిధి దాటింది కాబట్టే... రాజధాని రైతులకు హైకోర్టు రక్షణగా నిలిచిందని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలు ఇవీ..

- ఈనాడు, అమరావతి


దబాయిస్తే వక్రీకరణలు వాస్తవాలు కావు

- సుజనాచౌదరి, భాజపా ఎంపీ

హైకోర్టు తీర్పును వైకాపా నేతలు వక్రీకరించారు. చట్టసభల అధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అసెంబ్లీలో మాట్లాడారు. సంఖ్యాబలం ఉందని దబాయిస్తే వక్రీకరణలు వాస్తవాలు కావు. పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టం ప్రకారమే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వైకాపా కూడా మద్దతిచ్చింది. ఇప్పుడు మళ్లీ రాజధాని మార్చాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదానికి పంపాలి. సీఆర్డీఏకి భూములిచ్చిన రైతులకు మధ్య ఉన్న చట్టబద్ధమైన ఒప్పందాన్ని  ఉల్లంఘించేందుకు, సీఆర్డీఏ చట్టాన్ని రద్దుచేసేందుకు ప్రభుత్వానికి అధికారం లేదు. ఈ రెండు అంశాలనూ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కోర్టుల విశ్వసనీయతను దెబ్బతీయడమే లక్ష్యంగా శాసనసభను వేదికగా చేసుకుని జగన్‌... ఆయన అనుయాయులు అసత్యప్రచారం చేశారు. కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్పారు. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలకు తెరతీస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో జగన్‌ ప్రభుత్వం మళ్లీ తెస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదన న్యాయసమీక్షకు నిలవదు.


జగన్‌పై ఉన్న కేసులన్నీ రద్దయిపోతాయా?

- లంకా దినకర్‌, భాజపా నేత

రాజధాని కేసుల్లో హైకోర్టు తీర్పుతో సీఎం జగన్‌లో అసహనంతో కూడిన ఫ్యాక్షన్‌ భావజాలం బయటకు వచ్చింది. మెజార్టీ సీట్లు గెలిచిన ప్రభుత్వానికి ఇష్టానుసారం వ్యవహరించే వీలుంటే, వైకాపా 151 సీట్లు గెలుచుకున్నందుకు సీఎంపై ఉన్న పాత కేసులన్నీ రద్దయిపోతాయా? శాసనసభ చేసిన చట్టం చెల్లుబాటు అవ్వాలంటే ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదని చెబుతూనే, హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. మూడు రాజధానుల నిర్ణయంతో ఎవరి హక్కులకూ భంగం కలగదని జగన్‌ చెప్పగలరా? మంత్రి పదవి కోసం జగన్‌ను సంతోషపెట్టడానికి సభలో తాపత్రయపడి న్యాయస్థానం పరిధిలోకి చొరబడేందుకు ధర్యాన ప్రయత్నించి అభాసుపాలయ్యారు.


సీఎం కొత్త చిక్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారా?

- పీవీఎన్‌ మాధవ్‌, ఎమ్మెల్సీ, భాజపా నేత

అమరావతిలో రాజధాని లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. రాజధానిపై హైకోర్టు అంత స్పష్టంగా తీర్పు చెప్పాక, అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జగన్‌ కొత్త వివాదాలకు తెరతీస్తున్నారు. కొత్త చిక్కులు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కోర్టుల తీర్పుల్ని అందరూ గౌరవించాలి. రాజధానిపై ప్రజల్ని ఇంకెంతకాలం అయోమయంలో ఉంచుతారు? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. రాష్ట్రాన్ని నలుమూలా అభివృద్ధి చేయడం.


న్యాయవ్యవస్థనే హేళన చేస్తారా?

- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

చట్టాలు, శాసనాలే కాదు... రాజ్యాంగ సవరణలూ న్యాయసమీక్షకు అతీతం కావు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన ప్రతి రాజ్యాంగ సవరణనూ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజధానిపై హైకోర్టు తీర్పునకు సీఎం జగన్‌, వైకాపా నాయకులు తప్పుడు భాష్యం చెప్పారు. కోర్టుల మీద దాడి చేసేలా మాట్లాడటం, తీర్పులకు వక్రభాష్యం చెప్పడం తెలివితక్కువతనం. అమరావతికి ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. అందరూ ఆమోదించారు కాబట్టే రైతులు నమ్మి భూములిచ్చారు. ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటోంది. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి. సాగునీటి ప్రాజెక్టుల్ని త్వరితగతిన పూర్తిచేయాలి. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ అభివృద్ధి చెందదు.


8 ఏళ్లలో అమరావతికి ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.6,629 కోట్లే

- పంచుమర్తి అనురాధ, తెదేపా అధికార ప్రతినిధి

మొన్నటివరకూ భ్రమరావతి, గ్రాఫిక్స్‌ అన్న జగన్‌ ఇప్పుడు అమరావతి నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు కావాలంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. 2019 ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 50 ప్రకారం అమరావతి మొత్తం నిర్మాణవ్యయం రూ.55,343 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లలో ఖర్చుచేసేది రూ.6,629 కోట్లే. వివిధ బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు రూ.37,112 కోట్లు. ఇవన్నీ జీవోలో ఉన్నా సీఎం జగన్‌ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


జగన్‌ అహంకారానికి నిదర్శనం

- శైలజానాథ్‌, పీసీసీ అధ్యక్షుడు

రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడటం సీఎం జగన్‌ అహంకారానికి నిదర్శనం. చట్టంలో రాజధాని ఒకటే ఉందని హైకోర్టు చెప్పాక మళ్లీ పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులపై మాట్లాడటం ఏంటి? గతంలో ఏం లాభం వచ్చిందని అమరావతిని రాజధానిగా అంగీకరించారో, ఇప్పుడు ఎందుకు వ్యతిరేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. అమలు చేయలేని తీర్పులను హైకోర్టు చెబితే అప్పుడు సాధ్యం కాదని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితి లేకపోయినా జగన్‌ అన్యాయంగా మాట్లాడారు. కావాలంటే హైకోర్టు తీర్పును సవాలు చేయొచ్చు. అంతేతప్ప న్యాయవ్యవస్థను తప్పుపడుతూ మాట్లాడటం దేశానికి మంచిది కాదు. మూడు రాజధానులు అనేది అశాస్త్రీయమన్న విషయాన్ని ఇప్పటికైనా జగన్‌ గుర్తెరిగితే మంచిది.


వికేంద్రీకరణ కాదు.. విధ్వంసం

- తులసిరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

జగన్‌ చేయాలనుకుంటున్నది పరిపాలన వికేంద్రీకరణ కాదు.. విధ్వంసం. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలంటే పాలన వికేంద్రీకరణే చేయాలా? దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అలాగే చేస్తున్నారా? రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ పాటికే తగిన ప్రణాళికలు అమలుచేసి అన్ని ప్రాంతాలనూ ప్రగతిబాటలో నడిపించేది. అధికార వికేంద్రీకరణ అంటే స్థానికసంస్థలకు అధికారాలు బదలాయించాలి. ఇలాంటి ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి పరిపాలన, శాసన, న్యాయ రాజధానులను వేర్వేరుచోట్ల పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? హైకోర్టు తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకి వెళ్లొచ్చు. ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోరు? ఇదే ప్రభుత్వం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భాలున్నాయి కదా.


అంత ధైర్యం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చుగా?

- ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది

శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పినట్టుగా అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును వాళ్లు సరిగా చదువుకుంటే అర్థమవుతుంది. వాళ్లకు చదువుకోవడం రాకపోతే ఎవరితోనైనా చదివించుకుని అర్ధం చేసుకోవాలి. పునర్విభజన చట్టంలో ‘ఎ’ కేపిటల్‌ అన్నారని, దాని ప్రకారం రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని హైకోర్టు చెప్పింది. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పింది. రాజ్యాంగంలోని 214వ అధికరణ ప్రకారం హైకోర్టును నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అమరావతిలో హైకోర్టును ఏర్పాటుచేస్తూ రాష్ట్రపతి నోటిఫై చేశారు. అమరావతి నుంచి హైకోర్టును మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కర్నూలులో హైకోర్టు పెడితే అభివృద్ధి జరిగిపోదు. మరో రెండు జిరాక్స్‌ సెంటర్లు, టీ దుకాణాలు వస్తాయేమో అంతే. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఫ్యాక్టరీలు, పెట్టుబడులు రావాలి. న్యాయస్థానాలే లేకపోతే ఈ ప్రభుత్వ నియంతృత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయేది. అధికార పార్టీ నాయకులు న్యాయస్థానాలపైనే దాడులకు దిగే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే... మౌలిక వసతులు కల్పించి, పరిశ్రమలు తెచ్చి, ప్రజలకు బతుకుతెరువు చూపించాలే తప్ప, మూడు రాజధానుల ఏర్పాటు కాదు. మూడు రాజధానులపై మళ్లీ చట్టం తెచ్చినా న్యాయస్థానం ముందు నిలబడదని అధికార పార్టీ నాయకులకు తెలుసు. అభాసు పాలవుతున్నామని గ్రహించి, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడారు. వారికి నిజంగా ధైర్యం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు కదా? అక్కడ కూడా మొట్టికాయ పడుతుందని తెలిసే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.


బీరాలు పలికినంత మాత్రాన కోర్టు తీర్పు నుంచి తప్పించుకోలేరు

- ఉన్నం మురళీధర్‌, హైకోర్టు న్యాయవాది

చట్టసభలో సభ్యులు ఏం మాట్లాడినా రక్షణ ఉంటుంది. దాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి, అధికారపార్టీ సభ్యులు శాసనసభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వారు ఎన్ని బీరాలు పలికినా హైకోర్టు తీర్పు నుంచి తప్పించుకోలేరు. తీర్పును అమలుచేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. తీర్పు అమలుకాకపోతే బలయ్యేది ఆయా ప్రభుత్వ విభాగాలకు సారథ్యం వహించే ఐఏఎస్‌ అధికారులే. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ చేసిన తప్పులకు... ఇప్పటికీ డజను మంది ఐఏఎస్‌ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. హైకోర్టు ధర్మాసనం పూర్తిగా తన రాజ్యాంగపరిధికి లోబడే రాజధాని కేసులపై తీర్పు చెప్పింది. కానీ కోర్టు తన పరిధి దాటినట్టుగా ప్రజల్ని భ్రమింపజేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నించడం హర్షణీయం కాదు.


సత్తా ఉంటే మూడు ముక్కలాటతో ఎన్నికలకు వెళ్లాలి

- బాలకోటయ్య, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు

అమరావతిపై హైకోర్టు విస్పష్ట తీర్పు కూడా తర్వాత మళ్లీ మూడు రాజధానులపై సభలో చర్చించడం అంటే రాజ్యాంగాన్ని అవమానపర్చడమే. అంతగా మాట మీద నిలబడే వ్యక్తే అయితే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? అలా చేయకుండా విభజన మంటల కోసం శాసనసభను వేదికగా చేసుకోవడం దుర్మార్గం. ప్రజల్ని మభ్యపెట్టడం మాని నిజంగా అంత సత్తా ఉంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి మూడు ముక్కలాటతో ఎన్నికలు వెళ్లాలి.


జగన్‌కు బెయిల్‌ ఇచ్చిందీ కోర్టే కదా

- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు వితండవాదం చేశారు. శాసనసభ చట్టాలు చేయకూడదని కోర్టు ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక చట్టాలు చేసినప్పుడు నిరోధించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. జగన్‌ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి... ఎవర్నో చంపేస్తామని, ఎవరి ఆస్తులైనా అక్రమంగా తీసేసుకుంటామని చట్టం తెస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా? అక్రమార్జన కేసుల్లో కోర్టు బెయిల్‌ ఇవ్వడం వల్లే జగన్‌ బయట తిరుగుతున్నారు కదా? విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని సూచించడానికి కేంద్రం ఒక కమిటీని వేసింది. అదే విభజన చట్టానికి లోబడి రాష్ట్రప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం చేసింది. దాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టే కోర్టు జోక్యం చేసుకుంది.


ముఖ్యమంత్రిది విడ్డూరపు వాదన

- జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇంకా విడ్డూరపు వాదనలు చేస్తున్నారు. రైతులతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘనపై హైకోర్టు తీర్పులో చెప్పిన అంశమే కీలకం. ముఖ్యమంత్రి ఈ విషయం ప్రస్తావించకుండా, రైతుల క్షోభకు సమాధానం చెప్పకుండా అసెంబ్లీని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి తాను ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని చెబుతున్నారు తప్ప, అమరావతికి భూములిచ్చిన రైతులు ఇక్కడ ఇళ్లు కట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి నిర్ణయాలవల్ల ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్‌.. ఇప్పటికీ అభివృద్ధి నిరోధక వాదనలే వినిపిస్తున్నారు. ఇకనైనా హైకోర్టు తీర్పును గౌరవించాలి. రాజధాని రైతులకు న్యాయం చేసేవరకు జనసేన అండగా ఉంటుంది’  


శాసనసభ వేదికగా సీఎం అబద్ధాలు

- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

శాసనసభ వేదికగా సీఎం జగన్‌ అబద్ధాల వాణి వినిపించారు. పార్లమెంటు, న్యాయస్థానాల గురించి సభలో మాట్లాడి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పే జగన్‌ ప్రజలకు తానిచ్చిన హామీలను పక్కనబెట్టేందుకు చట్టసభనే వేదిక చేసుకోవడం దారుణం. రాజధాని విషయంలో కేంద్రం నిబంధనల గురించే చెబుతోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని భాజపా కోరిందే తప్ప, రాజధాని మార్చాలని అడగలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులేంటో వెల్లడించాలి. అమరావతిలోనే రాజధాని ఉండాలన్నది మా విధానం.


న్యాయ వ్యవస్థను ధిక్కరించడమే

- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రాజధాని అంశంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చపెట్టి మళ్లీ మూడు రాజధానుల చట్టం చేయాలని ప్రయత్నించడం న్యాయవ్యవస్థను ధిక్కరించడమే. అమరావతి విషయంలో వివాదం సృష్టించి మూడేళ్లపాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలని, 40 ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిన విధానంలో రాజధాని నిర్మాణం చేయాలని మేం అనట్లేదు. పరిమిత వ్యయంతో అమరావతి నిర్మాణం చేయొచ్చుగదా


హైకోర్టు తీర్పు అమలు చేయాలి

- శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

న్యాయస్థానాలపై గౌరవం ఉందన్న సీఎం జగన్‌.. హైకోర్టు తీర్పును అమలు చేసి, వివాదాలకు స్వస్తిపలకాలి. దానికి భిన్నంగా శాసనసభలో సీఎం జగన్‌, పాలకపక్ష నేతలు వివాదాన్ని కొనసాగించే రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. పరిపాలన, శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించాలి. కర్నూలులో హైకోర్టు పెట్టవచ్చన్నది సీపీఎం అభిప్రాయం. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి నిధులు సాధించేలా ఒత్తిడి తేవాలి. అమరావతి అభివృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పూనుకోవాలి.


పార్లమెంటులో ఆమోదించాకే అమరావతి నిర్ణయం

- లోకేశ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

రాజధాని అమరావతి విషయంలో కేంద్రం చేెసిన చట్టాన్ని కాదని, జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానులంటూ ముందుకెళ్లినందునే న్యాయస్థానం తప్పుపట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని కాదని ఏపీ ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రులంతా పదో తరగతి ఫెయిలైన వారు. సీఎం ఏం చదివారో ఎవరికీ తెలియదు కాబట్టే ఇలాంటి పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ అనేది యాక్ట్‌ ఆఫ్‌ పార్లమెంట్‌. ఈ వాస్తవం తెలియని వారు చట్టాలుచేసే స్థానాల్లో ఉండడం ప్రజల కర్మ. ఏపీ రాజధాని అమరావతి అని నాడు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదించాకే నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు.


అమరావతిలో ఇల్లు కట్టుకుని రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు?

- మల్లీశ్వరి, మహిళా రైతు, మందడం

అభివృద్ధి వికేంద్రీకరణకు అమరావతి రైతులు వ్యతిరేకం కాదు. పాలన వికేంద్రీకరణకే వ్యతిరేకం. అమరావతిలో ఉన్నది కేవలం మూడు మండలాలే అంటున్నారు. వీటిపై 13 జిల్లాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రతి విషయాన్నీ వక్రీకరించి మాట్లాడటం ముఖ్యమంత్రికి పరిపాటిగా మారింది. మాట్లాడితే చాలు అమరావతిలో ఇల్లు కట్టుకున్నానంటున్నారు... ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుంటే రాష్ట్రానికి ఏం ఒరిగింది?


ఇంకో సీఎం వచ్చి ఇల్లే రాజధాని అంటే చెల్లుబాటవుతుందా?

- వరలక్ష్మి, మహిళా రైతు, వెలగపూడి

151 మంది ఎమ్మెల్యేలుంటే ఇష్టానుసారం చేయొచ్చా? ఇదేమన్నా ప్రభుత్వమా? ప్రైవేటు కంపెనీనా? ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఇంటినే రాజధానిగా చేస్తానంటే చెల్లుబాటవుతుందా? ఖర్చు కూడా తగ్గుతుందని సభలో చట్టం చేస్తే సరిపోతుందా? అధికారముందని ఇష్టానుసారం వ్యవహరిస్తారా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని