TDP: రైతులు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమే

రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. ‘మీరు ఎక్కడున్నా జన్మభూమి అభివృద్ధికి చేస్తున్న కృషి మరవలేనిది.

Updated : 30 Mar 2022 04:52 IST

వైకాపా పాలనలో రాష్ట్రం ఉనికినే కోల్పోయే పరిస్థితి
వివిధ దేశాల్లోని తెదేపా నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. ‘మీరు ఎక్కడున్నా జన్మభూమి అభివృద్ధికి చేస్తున్న కృషి మరవలేనిది. రాబోయే రోజుల్లోనూ పుట్టిన ప్రాంత అభివృద్ధికి పునరంకింతం కావాలి. తెదేపా బలోపేతానికి సహకారం అందించాలి’ అని వివిధ దేశాల్లోని తెలుగువారికి విజ్ఞప్తి చేశారు. తెదేపా 40 వసంతాల వేడుకలను 40 దేశాల్లోని 200 నగరాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌ను నాలెడ్జి హబ్‌గా తయారు చేసేందుకు విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాం. దీంతో సంపద సృష్టి జరిగింది. రైతులు, పేదల పిల్లలు కూడా ప్రపంచం నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలుగుజాతి పూర్వవైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పనిచేశా. దేశ విదేశాల్లోని ఎంతోమంది చేయూత అందించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతితో పాటు అన్ని రంగాలనూ ధ్వంసం చేసే కార్యక్రమాలు చేపట్టింది. దీంతో రాష్ట్రం ఉనికినే కోల్పోయే పరిస్థితి తలెత్తింది’ అని విమర్శించారు. ‘తెలుగువారు ఎక్కడున్నా మాతృభూమిపై ఉండే ప్రేమ వెలకట్టలేనిది. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు. ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు’ అని ప్రశంసించారు.


జన్మభూమి సేవకు పునరంకితమవుతాం

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు వివిధ దేశాల్లో ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు, అభిమానులు జెండాలు చేతపట్టి ‘కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా’ అనే పాటలతో సందడి చేశారు. అధిక సంఖ్యలో కార్లతో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సమష్టిగా పని చేస్తామని వివిధ దేశాల్లోని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో ప్రజా జీవితం దుర్భరంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని.. వీటన్నింటినీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెదేపాను అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందని, అప్పటివరకూ విశ్రమించబోమని ప్రతిజ్ఞలు చేశారు.

* 40 వసంతాల వేడుకలను అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్‌, బే ఏరియా, బోస్టన్‌, షికాగో, డాలస్‌, డెట్రాయిట్‌, హ్యూస్టన్‌, న్యూజెర్సీ తదితర 40 నగరాల్లో వైభవంగా నిర్వహించారు. తెదేపా సీనియర్‌ నాయకుడు కోమటి జయరాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అభిమానులు హాజరయ్యారు. షికాగోలో బీద రవిచంద్ర, డాలస్‌లో కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, ముళ్లపూడి బాపిరాజు, న్యూజెర్సీలో మన్నవ మోహన్‌కృష్ణ, కలపటపు రామ్‌ప్రసాద్‌, షార్లెట్‌లో ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

* ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం మాత్రమే నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తోందని అమెరికాలోని డెట్రాయిట్‌ తెదేపా కౌన్సిల్‌ సభ్యులు కొనియాడారు.  

* యూకే, యూరోప్‌లోని 40 పైగా నగరాల్లో ఎన్నారై కౌన్సిల్‌ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. హాట్‌ఫీల్డ్‌లో జరిగిన కార్యక్రమంలో తెదేపా ఆవిర్భావం నుంచి వివిధ వర్గాల సంక్షేమానికి చేసిన కృషిని శివరామ్‌ కూరపాటి వివరించారు.

* ఐర్లండ్‌లో మురళి రాపర్ల, జర్మనీలో తిట్టు మద్దిపట్ల, శివ, పారిస్‌లో మహేశ్‌ గొపునూరు, జెనాలో పవన్‌ జాగర్లమూడి, అనుదీప్‌ పచ్చాల, బెల్పాస్ట్‌లో దినేశ్‌ కుదరవల్లి, బ్రసెల్స్‌లో దినేశ్‌వర్మ, పోలండ్‌లో చందు తదితరులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని