Sharad Pawar: చిన్న రాష్ట్రానికి 3 రాజధానులా?: శరద్‌ పవార్‌

మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయని, వాటిలో ఒకటి విదర్భలో ఉన్నా ఆ ప్రాంతం ఏమీ అభివృద్ధి చెందలేదని.. అలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర కంటే చిన్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మూడు

Updated : 06 Apr 2022 09:26 IST

30,000 ఎకరాల సేకరణ అసామాన్యం

రాజధాని రైతులతో వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయని, వాటిలో ఒకటి విదర్భలో ఉన్నా ఆ ప్రాంతం ఏమీ అభివృద్ధి చెందలేదని.. అలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర కంటే చిన్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులేమిటని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన్ను కలిసిన రైతు ప్రతినిధి బృందం ఈ విషయం పేర్కొంది. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో ఈ బృందం శరద్‌పవార్‌ను కలిసి తమ సమస్యను ఏకరువుపెట్టినప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సుమారు అరగంటకు పైగా రైతులతో మాట్లాడారు.

మూడు రాజధానులంటున్న ముఖ్యమంత్రి జగన్‌ ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు? హైదరాబాద్‌ నుంచా? అని ఆయన  ప్రశ్నించినప్పుడు అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన శాసనసభ, సచివాలయం నుంచే చేస్తున్నారని రైతు ప్రతినిధులు తెలిపారు. ప్రతిపక్షనేతగా రాజధాని అమరావతికి మద్దతు పలికిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులనడమే కాకుండా సీఆర్డీఏ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. 841 రోజులుగా తాము ఉద్యమం చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇందుకు ఆయన స్పందిస్తూ  ఇంత ఉద్యమం సాగుతుంటే ముఖ్యమంత్రి స్పందించడం లేదా అని ప్రశ్నించగా.. సీఎం స్పందించకపోగా.. తమ పార్టీ నేతలతో అసభ్య పదజాలంతో దూషణలు చేయిస్తూ, పోలీసులతో లాఠీఛార్జీ చేయిస్తున్నారని వారు తెలిపారు.

శాసనసభలో ప్రతిపక్షం నిలదీయడం లేదా అని పవార్‌ ప్రశ్నించగా సభలో ప్రతిపక్షాలను నోరెత్తనివ్వడం లేదని వివరించారు. అందుకు స్పందించిన పవార్‌ ‘‘చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం గురించి నాకు వివరించారు. ఆ ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉంది, నూతన రాష్ట్రం మంచి రాజధాని నిర్మించుకుంటోందని మేం సంతోషించాం. 30 వేలకుపైగా ఎకరాల భూమిని సేకరించడం మామూలు విషయం కాదు. అందులో రూ.పది వేల కోట్లతో వివిధ పనులు చేపట్టిన తర్వాత రాజధాని మార్పు చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయి. ఒక రాజధాని విదర్భలో ఉన్నా అక్కడ ఏ అభివృద్ధీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు రైతు బృందంలోని సభ్యులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ప్రస్తావిస్తూ.. ఈ అంశంపై అనేక వార్తలు వస్తున్నాయని.. ఉన్న రాజధానిలోనే పనులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తాము హైకోర్టుకు వెళ్లామని.. కోర్టు సైతం అమరావతే రాజధాని అని, సీఆర్డీఏ ప్రకారం రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చిందని వారు శరద్‌పవార్‌కు వివరించారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి స్పందన ఏమిటని అడగ్గా.. సీఎం పట్టించుకోవడం లేదని చెప్పారు. దానికి ఆయన.. తీర్పును పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. రాజధానిపై భాజపా వైఖరి గురించి అడిగినప్పుడు ఆ పార్టీ నాయకులు అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం సరైన మద్దతు లభించడం లేదని రైతులు ఆయనతో అన్నారు. పార్లమెంట్‌లో అమరావతికి తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు