Industries: పరిశ్రమలపై పిడుగు

రాష్ట్రంలో పరిశ్రమలపై పిడుగు పడింది. ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి నుంచి పవర్‌ హాలిడే ప్రకటించింది. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించుకోవాలని.. నిరంతరాయంగా పనిచేసే (24 గంటలూ) పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50% విద్యుత్తు మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మళ్లీ 2014 ముందు నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికుల...

Updated : 08 Apr 2022 03:54 IST

పవర్‌ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం  
వారాంతపు సెలవుతో పాటు మరోరోజు
24 గంటల పరిశ్రమలు 50% వాడాలి
ఏసీల వినియోగం సగం తగ్గించాలి
రాత్రివేళ హోర్డింగులు, సైన్‌బోర్డులు స్విచాఫ్‌  
22 వరకు ఇదే పరిస్థితి
ఈనాడు, అమరావతి; న్యూస్‌టుడే, తిరుపతి, అచ్యుతాపురం (విశాఖపట్నం), కరెన్సీనగర్‌ (విజయవాడ)

రాష్ట్రంలో పరిశ్రమలపై పిడుగు పడింది. ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి నుంచి పవర్‌ హాలిడే ప్రకటించింది. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించుకోవాలని.. నిరంతరాయంగా పనిచేసే (24 గంటలూ) పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50% విద్యుత్తు మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మళ్లీ 2014 ముందు నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికుల ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బతీయనుంది. అసలే పెట్టుబడులు రావడం లేదు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా ప్రస్తుత విద్యుత్తు వాడకంలో 50% మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు పారిశ్రామిరంగం కుదేలైంది. కార్మికులూ ఉపాధి కోల్పోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయనుకునే సమయంలో.. ప్రభుత్వం పవర్‌ హాలిడే ప్రకటించింది. ఉపాధి పోతే పూట గడిచేదెలా? అని కార్మికులు కలవరపడుతున్నారు. నిర్దేశించిన సమయానికి ఉత్పత్తుల్ని సిద్ధం చేయలేకపోతే.. తీవ్రంగా నష్టపోతామని అప్పులు తెచ్చి రూ.కోట్లలో పెట్టుబడి పెట్టిన పరిశ్రమల యజమానులు వణికిపోతున్నారు.

ఫెర్రో కంపెనీలకు పవర్‌ హాలిడే ప్రకటన పెద్ద దెబ్బగా మారనుంది. అచ్యుతాపురం సెజ్‌లో మూడు ఫెర్రో కంపెనీలు ఉండగా అసియాలోనే అతిపెద్ద ఫెర్రో పరిశ్రమ అయిన అభిజీత్‌ ఉత్పత్తులను కొనసాగిస్తోంది. దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 54 ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్తు అవసరం అధికంగా ఉంటుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని 180 పరిశ్రమలతో పాటు, పరవాడ ఫార్మాసిటీలోని 45 పరిశ్రమలపై పవర్‌హాలిడే ప్రభావం పడనుంది. ప్రత్యక్షంగా కంపెనీల్లో పనిచేసే కార్మికులు, పరోక్షంగా అనుబంధ విభాగాలపైనా పడనుంది. ఇప్పటికే కొవిడ్‌తో రెండేళ్లగా ఉత్పత్తులు నిలిచిపోయి తీవ్రంగా నష్టపోయామని పరిశ్రమల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. ఒకవైపు పెరిగిన డీజిల్‌ ధరలు, విద్యుత్తు ఛార్జీల పెంపుతో ఆందోళన చెందుతున్న పరిశ్రమలపై ప్రభుత్వం పవర్‌ హాలిడే ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని 253 నిరంతర ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తమ రోజువారీ విద్యుత్తు వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. 1,696 ఇతర పరిశ్రమలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వారాంతపు సెలవుకు అదనంగా ఒకరోజు పవర్‌ హాలిడే అమలు చేయనున్నారు.

ఎస్పీడీసీఎల్‌ పరిధిలో చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు శుక్రవారం పవర్‌ హాలిడే అమలు చేయనున్నట్లు సీఎండీ హరనాథరావు తెలిపారు. పుత్తూరు మినహాయించి మిగిలిన అన్ని డివిజన్లలోనూ ఇది అమలవుతుందని తెలిపారు.  

40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల కొరత

‘రాష్ట్రంలో రోజుకు 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా సరిపడా విద్యుత్తు అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర అవసరాలకు తగినంత కొనలేకపోతున్నాం. దేశవ్యాప్తంగా పంటల ముగింపు కాలం, వడగాలుల కారణంగా ఎక్స్ఛేంజీలోనూ విద్యుత్తు అందుబాటులో లేదు. పంట కోతలు ముగిసిన తర్వాత వచ్చే 15 రోజుల్లో డిమాండ్‌ తగ్గే అవకాశం ఉంది’ అని ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గృహ, వ్యవసాయ అవసరాలకు సరఫరాలో ఆటంకం లేకుండా చూసేందుకు పరిశ్రమలకు సరఫరాను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.

సర్దుబాటు తప్పడం లేదు..

పది, ఇంటర్‌, ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో గృహావసరాలకు, మరోవైపు వ్యవసాయానికి ఇవ్వాల్సి ఉన్నందున అందుబాటులో ఉన్న విద్యుత్తును సర్దడం తప్ప డిస్కంలకు వేరే మార్గం లేదని సీపీడీసీఎల్‌ ఛైర్మన్‌  అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె.పద్మజనార్దనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్కిల్‌ కార్యాలయ స్థాయిలో ఈఈలు, లోడ్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఎల్‌ఎంసీ)లో సహాయ ఇంజినీర్లు విధులు నిర్వహిస్తూ విద్యుత్తు సరఫరా తీరును పర్యవేక్షిస్తారని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు వివరించారు.

ఇవీ ఆంక్షలు..

పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించాలి.

పగటి పూట సాయంత్రం 6 గంటల లోపు కేవలం ఒక షిఫ్టే కొనసాగించాలి.

అంతరాయం లేకుండా పనిచేసే (24 గంటలు) పరిశ్రమలైతే ఇప్పటి వరకు వినియోగించే విద్యుత్తులో 50% మాత్రమే వినియోగించాలి.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌లో ఏసీల వినియోగాన్ని సగానికి తగ్గించాలి.

వ్యాపార ప్రకటనల హోర్డింగులు, సైన్‌బోర్డులకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్తు ఉపయోగించకూడదు.


మధ్యప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో పవర్‌ హాలిడే వివరాలు
వారం ప్రాంతం, డివిజన్లు

సోమవారం: విజయవాడ గ్రామీణం, గుంటూరు- 1టౌన్‌, మార్కాపురం, చీరాల
మంగళవారం: మచిలీపట్నం, బాపట్ల, అద్దంకి
బుధవారం: విజయవాడ నగరం, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతి
గురువారం: గుడివాడ, నరసరావుపేట, దర్శి
శుక్రవారం: గుంటూరు-2
శనివారం: గుణదల, మాచర్ల, కందుకూరు


తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో పవర్‌ హాలిడే వివరాలు

సోమవారం: శ్రీకాకుళం జిల్లా
మంగళవారం: విజయనగరం, తూర్పు,   పశ్చిమగోదావరి జిల్లాలు
బుధవారం: విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్‌
గురువారం: అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లు
శుక్రవారం: జోన్‌-2 డివిజన్‌
శనివారం: జోన్‌-1, జోన్‌-3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని