AP Cabinet: వీరికి ‘వ్యవహారశైలే’ కలిసొచ్చిందా?

నోటి దురుసు.. దూకుడుతనంతో తరచూ వివాదాలకు కేంద్ర బిందువులుగా మారే వారిలో కొందరికి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కడం వైకాపా వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వారి వ్యవహారశైలే

Updated : 10 Aug 2022 11:32 IST

ఈనాడు, అమరావతి: నోటి దురుసు.. దూకుడుతనంతో తరచూ వివాదాలకు కేంద్ర బిందువులుగా మారే వారిలో కొందరికి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కడం వైకాపా వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వారి వ్యవహారశైలే కలిసొచ్చిందేమో అనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. తాజా కూర్పులో భాగంగా ఎంపిక చేసిన కొందరు.. తమ వ్యాఖ్యలు, ప్రవర్తనతో తరచూ వివాదాల్లో నిలిచారు.

‘కొడాలి వారసుడిగా’ జోగి రమేశ్‌

కృష్ణా జిల్లా నుంచి మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) రాజీనామా అనంతరం.. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ను మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో కొడాలి నాని వారసుడిగా.. ఆయన లేని లోటును తీరుస్తారంటూ సొంత పార్టీ నేతలే నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. తన అనుచర బృందంతో కలిసి పట్టపగలే కరకట్టపై కార్లలో ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటికి వెళ్లడం, అసెంబ్లీ సాక్షిగా.. సొంత పార్టీ ఎంపీ పైనే తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడమే కలిసొచ్చిందేమో అని పేర్కొంటున్నారు.

కారుమూరికి ‘పెద్ద బాండు’

పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు మంత్రి పదవి అనే ‘పెద్ద బాండు’ దక్కిందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఇటీవల తణుకు పురపాలక సంఘంలో టీడీఆర్‌ బాండ్ల వ్యవహారంలో ఆరోపణలకు ఆయన కేంద్ర బిందువయ్యారు. తనకేం సంబంధం లేదని చివరకు వివరణ ఇచ్చుకున్నారు.

ధర్మానకు ‘న్యాయం’

శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు ‘న్యాయం’ జరిగిందనే చర్చ వైకాపాలో విన్పిస్తోంది. అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయస్థానాలు, న్యాయమూర్తుల పరిమితులపై ఆయన అసెంబ్లీలో చర్చకు తెరలేపిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలో వైఎస్‌ మంత్రివర్గంలోనూ పనిచేసిన ఆయనకు.. తాజా కూర్పులో ముఖ్యమంత్రి జగన్‌ చోటు కల్పించారు.

‘వాగ్బాణాలే’ వరించాయా?

అసెంబ్లీ లోపల, బయట ఆయన ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుంటారు. వాగ్బాణాలే ఆయనకు పదవీయోగం కల్పించాయనే చర్చ పార్టీలో నడుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని శాసనసభలో మాట్లాడారనే విమర్శలూ ఎదుర్కొన్నారు. దీంతో కౌరవ సభకు తాను హాజరు కానని, ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని చంద్రబాబు ప్రకటించారు. అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆయనపై కోర్టు మెట్లెక్కడమూ గతంలో చర్చనీయాంశం అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని