AP Cabinet: ఆ 11 మందినే ఎందుకు?

తొలి కేబినెట్‌లో పనిచేసిన బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి,

Updated : 11 Apr 2022 08:47 IST

ఈనాడు, అమరావతి: తొలి కేబినెట్‌లో పనిచేసిన బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌లను ఎందుకు మళ్లీ కొనసాగిస్తున్నారనే అంశం ఇప్పుడు వైకాపా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాజిక సమీకరణల దృష్ట్యా ఒకరిద్దరిని కొనసాగించే అవకాశం ఉందని ముఖ్యమంత్రే స్వయంగా మంత్రివర్గ భేటీలో మంత్రులతో, వైకాపా శాసనసభాక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు చెప్పినా... ఆ సంఖ్య క్రమంగా పెరిగి 11కి చేరడం వెనుక ఆంతర్యమేంటని పదవులు దక్కని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతమందిని కొనసాగించేలా ఉంటే ఇంత కసరత్తు ఎందుకని నిట్టూర్చారు. ఓసీల్లో వైకాపాకు ప్రధాన సామాజికవర్గమైన ఒక వర్గం నుంచి మంత్రి పదవులకు తీవ్ర పోటీ ఉంది. కానీ, ఆ సామాజికవర్గానికి చెందిన ఒకరు మృతిచెందగా మిగిలిన ముగ్గురు మంత్రుల్లో ఇద్దరిని మళ్లీ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఎస్సీ వర్గం నుంచి అయిదుగురు ఉండగా వారిలో నలుగురిని కొనసాగించడంపైనా ఆ వర్గానికి చెందిన ఆశావహులు కినుక వహించారు.

పాత మంత్రుల్లోనూ..

పాత మంత్రివర్గంలో 24 మంది మంత్రులతోనూ రాజీనామా చేయించి.. తిరిగి 11 మందిని తీసుకుంటే మరి తమ పరిస్థితేంటని మిగిలిన 13 మంది అసంతృప్తితో ఉన్నారు. వీరంతా బయట పడకపోయినా అంతర్గతంగా గుర్రుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని