Andhra News: డిస్కంల దగ్గర డబ్బుల్లేవు.. అందుకే విద్యుత్తు కొనడం లేదు

ఆర్థిక ఇబ్బందుల వల్లనే విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్‌ ఎక్స్ఛేంజీల నుంచి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి అధిక ధరకు విద్యుత్తును కొనడం సాధ్యం కావట్లేదని ఇంధన శాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి బి.శ్రీధర్‌

Updated : 11 Apr 2022 08:55 IST

ఇంధనశాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి శ్రీధర్‌

ఈనాడు, అమరావతి: ఆర్థిక ఇబ్బందుల వల్లనే విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్‌ ఎక్స్ఛేంజీల నుంచి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి అధిక ధరకు విద్యుత్తును కొనడం సాధ్యం కావట్లేదని ఇంధన శాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి బి.శ్రీధర్‌ అంగీకరించారు. నిర్వహణ మూలధనం కోసం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం నుంచి విద్యుత్‌ రాయితీలు పూర్తిగా రాకపోవడం, ఇంధన సర్దుబాటు ఛార్జీలను (ట్రూఅప్‌) నిర్దేశిత వ్యవధిలో వసూలుకు అనుమతించకపోవడం వల్లనే డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయని వివరించారు. ఆదివారం విజయవాడలోని ఆర్‌అండ్‌బీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు చెల్లించాల్సిన రాయితీల మొత్తం పేరుకు పోవడం వల్లనే నిర్వహణ మూలధనం కోసం డిస్కంలు అప్పులు చేయాల్సి వచ్చింది. 2014-15లో రూ.30 వేల కోట్లుగా ఉన్న డిస్కంల రుణాలు ప్రస్తుతం రూ.62 వేల కోట్లకు చేరాయి. విద్యుత్‌ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించాల్సి రావడమే.. ప్రస్తుతం విద్యుత్తు కొనలేని పరిస్థితికి కారణం. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు లేకుండా చెల్లిస్తున్నాం. ఇటీవల కూడా రూ.150 కోట్లను మహానది కోల్‌ ఫీల్డ్స్‌కు చెల్లించాం. బొగ్గు కొరత దేశ వ్యాప్తంగా ఉంది. దీనిపై చర్చించడానికి ఈ నెల 12న రాష్ట్ర విద్యుత్‌ సంస్థల అధికారులతో దిల్లీలో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది’ అని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సుమారు 8 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వాటి నుంచి యూనిట్‌ రూ.4.84 వంతున కొనుగోలు చేసేలా ఒప్పందాలను అప్పటి ప్రభుత్వం కుదుర్చుకుంది. దీనివల్ల ఏటా రూ.3 వేల కోట్ల వంతున.. పీపీఏల వ్యవధిలో రూ.35 వేల కోట్ల భారం డిస్కంలపై పడుతుంది’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని