Pawan Kalyan: మీరు సీబీఐ దత్తపుత్రులా?

అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రైతు కష్టం తెలుసు కనకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానన్నారు. వైకాపా హయాంలో 3వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క రైతుకూ

Updated : 13 Apr 2022 04:33 IST

 నన్ను సీబీఎన్‌కు దత్తపుత్రుడు అంటే.. మేం మిమ్మల్ని ఆ మాటే అంటాం
మమ్మల్ని తెదేపా బీ టీం అంటే.. వైకాపాను చర్లపల్లి షటిల్‌ టీం అంటాం
16 నెలలు జైలుకు వెళ్లివచ్చిన మీరా.. మాకు నీతులు చెప్పేది?
ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఇవ్వాల్సిందే
కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
ఈనాడు డిజిటల్‌, అనంతపురం


నన్ను సీబీఎన్‌(చంద్రబాబు)కు దత్తపుత్రుడు అంటే.. మేం మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి ఉంటుంది. మమ్మల్ని తెదేపాకు బీ టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్‌ టీం అనాల్సి ఉంటుంది. అక్కడ జైల్లో షటిల్‌ ఆడుకున్నారు. మీరేమైనా సుభాష్‌ చంద్రబోష్‌, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌లా దేశసేవ చేశారా? ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చారు.


అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రైతు కష్టం తెలుసు కనకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానన్నారు. వైకాపా హయాంలో 3వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క రైతుకూ న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కౌలు రైతు భరోసా యాత్రను పవన్‌కల్యాణ్‌ శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో మంగళవారం ప్రారంభించారు. ముందుగా నల్లమాడ మండలం వంకరకుంటకు చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.లక్ష చెక్కును అందజేశారు. అక్కడ్నుంచి ధర్మవరం, బత్తలపల్లి, గొట్లూరు, అనంతపురం జిల్లా పూలకుంటలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం అనంత గ్రామీణ మండలం మన్నీల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండలో 30బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.

ప్రతి జిల్లాకూ సంక్షేమ నిధి
‘జనసేన పార్టీ.. లేని సమస్యను సృష్టించదు. ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. కౌలు రైతు భరోసా వంటి కార్యక్రమం ప్రారంభించకపోతే ప్రభుత్వంలో చలనం రాదు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఇచ్చేవరకూ ప్రభుత్వంపై పోరాడతాం. అలాగేమావంతు సాయం చేస్తాం. బాధిత రైతు కుటుంబాలను ఆదుకునేలా, వారికి ఇబ్బందులు రాకుండా జిల్లాలవారీగా సంక్షేమ నిధి ఏర్పాటుచేసేలా ఆలోచిస్తున్నాం. దానికి నా వంతుగా  సగం సాయం చేస్తాను. మిగిలిన సగం మా నాయకులు ఇస్తారు’ అనిపవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వానికి ఏమైంది?
‘మా పార్టీలో కార్యకర్తలకు ఏదైనా జరిగితే రూ.5లక్షల వరకు బీమా ఇస్తున్నాం. అలాంటిది రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమవుతోంది? ఈ సాయం రాజకీయ లబ్ధి కోసం చేయట్లేదు. రైతుల కష్టాలు నాకు తెలుసు. అందులో కౌలు రైతు జీవితం బాగా తెలుసు. సొంత భూమి లేకపోయినా వ్యవసాయంపై మక్కువతో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఆదరణ లేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులూ ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు అందట్లేదు. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? ఎన్ని వేల కోట్లు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం’ అంటూ నిలదీశారు.
‘ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జనసేన తరఫున పరామర్శిస్తున్నామని తెలిసి ప్రభుత్వంలో చలనం వచ్చింది. మేము రాకముందే హుటాహుటిన కొన్ని బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించింది. ఏడాదిన్నర కిందట చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకూ ఇవాళ బ్యాంకు ఖాతాలో నగదు జమచేశారు. ఈ పని రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడే చేసి ఉంటే బాగుండేది.

రైతు కన్నీరు తుడుస్తాం
నేను మాటల మనిషిని కాదు. మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పం. కానీ రైతు కన్నీరు తుడుస్తాం. నేనూ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. నా సోదరుడు నాగబాబు ధైర్యం చెప్పడంతో విరమించుకున్నా. అన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. చనిపోయినవారి కుటుంబాలకు అండగా నిలబడతానని మాటిస్తున్నా. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు బిడ్డ తనకు ఎస్సై కావాలని ఉన్నట్లు చెప్పింది. మరోబిడ్డ ఇంజినీర్‌ అవ్వాలనుందని చెప్పింది. వారికి నేను అండగా ఉంటాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో  ఆత్మహత్య చేసుకున్న 30 కౌలు రైతు    కుటుంబాలకు సాయం చేశాం. మళ్లీ చేస్తాం.

ప్రభుత్వం వద్ద వివరాలు లేవు
కౌలు రైతుల పరిస్థితి గురించి రైతుస్వరాజ్య వేదిక అనే సంస్థ మాకు వివరించింది. తర్వాత మా పార్టీ తరఫున అధ్యయనం చేశాం. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలు జనసేన వద్ద ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ వివరాలు లేకపోవడం శోచనీయం. వైకాపా ప్రభుత్వం నన్ను అన్ని విధాలుగా భయపెట్టాలని చూస్తోంది. నాకు భయమంటే ఏంటో తెలీదు. దెబ్బ పడేకొద్దీ రాటుదేలుతాను. పోలీసుశాఖను ప్రభుత్వం తమకు అనుకూలంగా వాడుకుంటోంది. అయితే వారికి న్యాయంగా రావాల్సినవి ఇవ్వడం లేదు. పోలీసులకు రావాల్సిన సరెండర్‌ లీవ్స్‌, అదనపు సరెండర్‌ లీవ్స్‌, ట్రావెలింగ్‌ అలవెన్సులు అందజేయాలి’ అని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

పవన్‌కు వైకాపా సర్పంచి కృతజ్ఞతలు
మన్నీల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచి, వైకాపా మద్దతుదారు త్రిలోక్‌నాయుడు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూత అందించిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తాను సర్పంచిగా కాకుండా రైతుగా మాట్లాడుతున్నానని, 15 ఏళ్లుగా వ్యవసాయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు.


వైకాపా అగ్ర నాయకత్వానికి ఒకటే చెబుతున్నా. నేనేమీ విదేశాల్లో చదువుకోలేదు. లండన్‌ రాయల్‌ ఫ్యామిలీ కాదు.. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని. మీరు తిట్టే భాష కంటే చాలా మంచి భాష నాకొచ్చు. ఇంకోసారి చెబుతున్నా. నన్ను సీబీఎన్‌(చంద్రబాబునాయుడు)కు దత్తపుత్రుడు అంటే.. మేం మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి ఉంటుంది. మమ్మల్ని తెదేపాకు బీ టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్‌ టీం అనాల్సి ఉంటుంది. అక్కడ జైల్లో షటిల్‌ ఆడుకున్నారు. మీరేమైనా సుభాష్‌ చంద్రబోష్‌, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌లా దేశసేవ చేశారా? ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చారు. వైకాపాలో చాలామంది నేతలను సీబీఐ దత్తత తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శించే స్థాయి మీకు లేదు. మంచో.. చెడో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. వారి తీర్పునకు కట్టుబడి మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను.’

- అనంతపురం జిల్లా పూలకుంటలోజగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని