Andhra News: నేను ఆరాధించినందుకే మంత్రిగా వచ్చాను..

పాత్రికేయులు ఆరా తీయడం మాని... జగన్‌ను ఆరాధిస్తే ఇళ్ల స్థలాలు వాటంతటవే వస్తాయని బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. కానీ పాత్రికేయులు ఆరాధించడం మాని ఆరా తీస్తున్నారన్నారు.

Updated : 13 Apr 2022 07:09 IST

మంత్రి వేణుగోపాలకృష్ణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాత్రికేయులు ఆరా తీయడం మాని... జగన్‌ను ఆరాధిస్తే ఇళ్ల స్థలాలు వాటంతటవే వస్తాయని బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. కానీ పాత్రికేయులు ఆరాధించడం మాని ఆరా తీస్తున్నారన్నారు. తాము ఎవరిని ఆరాధించాలని పాత్రికేయులు ప్రశ్నించగా... ముఖ్యమంత్రి జగన్‌ను, ఆయన చేస్తున్న సేవలను అని మంత్రి బదులిచ్చారు. తాను ఆరాధించడం వల్లే మంత్రిగా ఇక్కడి వరకు వచ్చానని చెప్పారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన మంత్రిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమకు చాలాకాలంగా ఇళ్ల స్థలాలు కలగా ఉన్నాయని, మంత్రిగా మీరేమైనా హామీ ఇస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.... ‘అది కల కదా? నెరవేరిన రోజు మారిపోతుందిలే. చాలామంది ప్రజల పేదరికాన్ని తొలగించి సమాజంలో సమానంగా ఉండొచ్చనేలా జగన్‌ వారిని తీర్చిదిద్దారు. పాత్రికేయులు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించండి... ఆరాధించండి. అప్పుడు మీ కోరికలూ తీరిపోతాయి’ అని మంత్రి సూచించారు. ఇప్పటివరకు ఉన్న మంత్రుల్లా కాకుండా మీరేమైనా అదనంగా కృషి చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. కాలం అన్నింటికీ పరిష్కారం చూపుతుందని, అప్పుడు ఇలాంటి మాటలు ఉండవని సమాధానమిచ్చారు. ‘ప్రకృతి మనకు ఒక వరమిచ్చింది. దేన్ని ఆరాధిస్తే అది మనకు సంకల్పసిద్ధి చేస్తుంది. కానీ మనం ఆరాధించడం మాని ఆరా తీస్తున్నాం. ఆరా తీస్తే సరైన ఫలాలు ఉండవు. మీరు నిజంగా సీఎం జగన్‌ ఇళ్ల స్థలాలివ్వాలని ఆరాధిస్తే వాటంతటవే వస్తాయి’ అని పేర్కొన్నారు.

చిత్రపరిశ్రమను ఆదాయ వనరుగా మారుస్తా
రాష్ట్రంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ‘షూటింగ్‌లకు ఇక్కడ అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తి చేయగలమనే నమ్మకాన్ని నిర్మాతలకు కల్పించి, చిత్ర పరిశ్రమను ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారుస్తా. ప్రజలకు ఉపాధి కల్పన రంగంగా తీర్చిదిద్దుతా. గతంలో పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదుకు ఎలా మారిందో... అలాగే ఇప్పుడు హైదరాబాదు నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు కృషి చేస్తా’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని