పనిని బట్టే పదవులు

పార్టీ కోసం నిబద్ధత, అంకితభావంతో కష్టపడే నాయకులు, కార్యకర్తలకే నిజమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల రాజకీయ, ఆర్థిక సాధికారికతకు, వారిని ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు ప్రత్యేక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

Published : 22 Apr 2022 03:20 IST

అందరి వివరాలూ డిజిటల్‌ కార్డుల్లో నిక్షిప్తం
పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
కార్యకర్తల ఆరోగ్యానికి న్యూట్రిఫుల్‌ కార్యక్రమం
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: పార్టీ కోసం నిబద్ధత, అంకితభావంతో కష్టపడే నాయకులు, కార్యకర్తలకే నిజమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల రాజకీయ, ఆర్థిక సాధికారికతకు, వారిని ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు ప్రత్యేక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యం కోసం న్యూట్రిఫుల్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని పార్టీ చేపడుతుందన్నారు. పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ ఉండవల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు ఆయనకు సభ్యత్వం ఇచ్చారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వం నమోదు చేసుకున్న చంద్రబాబు, సభ్యత్వ రుసుమును, పార్టీ కోసం రూ.లక్ష విరాళాన్ని      ఆన్‌లైన్‌లోనే చెల్లించారు. ప్రతి కార్యకర్త వివరాల్నీ, పార్టీ కోసం వారు చేసిన సేవలు, ఇచ్చిన విరాళాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు. ‘డిజిటల్‌ సభ్యత్వం నాయకులతో సంబంధం లేకుండా అందర్నీ తెదేపా కుటుంబంలో భాగం చేస్తుంది. వాట్సప్‌, టెలిగ్రాం, మన టీడీపీ యాప్‌ల ద్వారా ఎవరికి వారే ఆన్‌లైన్‌లో సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు’ అని తెలిపారు. సభ్యత్వం నమోదు చేసుకున్నవారు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు వారి కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే వారి సమగ్ర వివరాలు తెలుస్తాయన్నారు. పార్టీకి చేసిన సేవలను బట్టే.. వారికి తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంటాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల వివరాల్ని 360 డిగ్రీల్లో పరిశీలించి, వారి పూర్తి సమాచారాన్ని డిజిటల్‌ కార్డుల్లో నిక్షిప్తం చేస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని నాయకులు,   ప్రజలతో మాట్లాడారు.

సెకనుకు 8,765 మంది ప్రయత్నం
పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించగానే విశేష స్పందన లభించిందని, ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదుకు సెకనుకు 8,765 మంది ప్రయత్నించారని చంద్రబాబు తెలిపారు. దానివల్ల సర్వర్‌ కొంత సేపు మొరాయించిందని, దాన్ని వెంటనే పునరుద్ధరించారని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలు, నాయకుల వివరాలను వాటిలో నిక్షిప్తం చేసే బాధ్యతను నారా లోకేశ్‌, చింతకాయల విజయ్‌, కిలారు రాజేష్‌, మద్దిపాటి వెంకట్రాజులకు అప్పగిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వారి పనితీరును ప్రతి 15 రోజులకు తాను సమీక్షిస్తానన్నారు. ‘నా ఆలోచనలు ఎప్పుడూ మిగతా వారికంటే 10-15 ఏళ్లు ముందుంటాయి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ   తెదేపా ఎప్పుడూ ముందుంటుంది. మన జీవితాల్లో టెక్నాలజీ అనివార్యమైపోయింది. ప్రతి నాయకుడూ దాన్ని వినియోగించుకోవాలి’ అని తెలిపారు.

ఉదారంగా విరాళాలివ్వండి
పార్టీకి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రూ.9,99,999 విరాళమిచ్చిన లోహిత్‌ని ఆయన అభినందించారు. ‘పార్టీకి 60-70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మీ శక్తిని బట్టి విరాళాలు ఇవ్వండి. పార్టీ సభ్యత్వ నమోదుపై ట్రయల్‌ నిర్వహిస్తున్న సమయంలోనే 20వేల మంది సభ్యులుగా చేరారు. సభ్యత్వ రుసుముగా రూ.20 లక్షలు రావాలి. కానీ రూ.48 లక్షలు వచ్చింది. అంటే రూ.28 లక్షలు విరాళంగా వచ్చింది’ అని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో యువతకు 40% టికెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీలోని వివిధ విభాగాలకు సమాంతరంగా ఎన్నికల ప్రక్రియ కోసం క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒకర్ని బాధ్యులుగా నియమిస్తామని తెలిపారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అనుసరించిన ఈ నమూనాను రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. తెదేపా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతి ఇంటికీ నాయకులు వెళ్లాలన్నారు. తానూ ఐదు ప్రాంతాలకు వెళతానన్నారు.

అండమాన్‌-నికోబార్‌ నుంచి తెదేపా నాయకులు మాట్లాడుతూ... ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు కౌన్సిలర్‌ స్థానాల్ని గెలుచుకున్నామని, భాజపాతో కలసి అధికారంలోకి వచ్చామని తెలిపారు. మేయర్‌ పదవిని తలో సగం కాలం పంచుకున్నామన్నారు. అండమాన్‌-నికోబార్‌ విభాగాన్ని అధికారికంగా గుర్తిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని