రక్షణ రంగంలో చెట్టపట్టాల్‌

ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేడెక్కిన వేళ ద్వైపాక్షిక రక్షణ సహకార బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని భారత్‌, బ్రిటన్‌ నిర్ణయించుకున్నాయి.

Published : 23 Apr 2022 05:03 IST

పరస్పర సహకారం పెంపునకు భారత్‌, బ్రిటన్‌ తీర్మానం
దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం!
కలిసికట్టుగా కొత్త యుద్ధవిమాన సాంకేతికత అభివృద్ధి
ద్వైపాక్షిక భేటీలో మోదీ, జాన్సన్‌  కీలక నిర్ణయాలు

దిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేడెక్కిన వేళ ద్వైపాక్షిక రక్షణ సహకార బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని భారత్‌, బ్రిటన్‌ నిర్ణయించుకున్నాయి. ఈ ఏడాది దీపావళికల్లా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలనీ తీర్మానించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మధ్య దిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత వైఖరిని గౌరవిస్తున్నట్లు జాన్సన్‌ పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక భేటీ అనంతరం ఇరువురు ప్రధానులు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. జాన్సన్‌ మాట్లాడుతూ.. ‘‘భూతల, సముద్ర, గగనతల, సైబర్‌ రంగాల్లో ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా కృషిచేయాలని మేం నిర్ణయించుకున్నాం. కొత్త యుద్ధవిమాన సాంకేతికత అభివృద్ధి ప్రక్రియలో భారత్‌కు భాగస్వామిగా మారతాం. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలన్న మోదీ లక్ష్యానికి తోడ్పాటునందిస్తాం. ఇరు దేశాల మధ్య సరకు సరఫరాకు పడుతున్న సమయాన్ని తగ్గించేందుకు భారత్‌ కోసం ఓపెన్‌ జనరల్‌ ఎక్స్‌పోర్ట్‌ లైసెన్సు (ఓజీఈఎల్‌)ను రూపొందిస్తాం. బ్రిటన్‌లోని ఉన్నత విద్యార్హతలకు ఇరు దేశాల్లో సమాన గుర్తింపు ఉండేలా చూస్తాం. మా దేశంలో తయారైన వైద్య పరికరాలను భారత్‌కు సులభంగా ఎగుమతి చేసేలా నూతన విధానాలను ప్రకటించనున్నాం’’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరంకుశత్వ పోకడలు పెరుగుతున్నవేళ భారత్‌, బ్రిటన్‌ పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను జాన్సన్‌ నొక్కిచెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మారణహోమాన్ని కొనసాగిస్తుంటే బ్రిటన్‌, దాని మిత్రపక్షాలు చూస్తూ కూర్చోలేవని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకానే తాను తీసుకున్నట్లు చెప్పారు.

బ్రిటన్‌ మద్దతును స్వాగతిస్తున్నాం: మోదీ

జాన్సన్‌తో చర్చలపై మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే ఎఫ్‌టీఏను కుదుర్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘రక్షణ రంగంలో సహకారం పెంపునకూ మేం తీర్మానించుకున్నాం. ఉత్పత్తి, సాంకేతికత, డిజైన్‌, అభివృద్ధిలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు బ్రిటన్‌ మద్దతును స్వాగతిస్తున్నాం. ఉక్రెయిన్‌ విషయంలో మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. యుద్ధాన్ని విరమించాలని, దౌత్యపరమైన చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాం. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించాలి’’ అని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ మహాసముద్రాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్న బ్రిటన్‌ నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు.  
* శుద్ధ-పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకోవడంపైనా మోదీ, జాన్సన్‌ చర్చలు జరిపారు. హరిత హైడ్రోజన్‌ను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలు కల్పించే హైడ్రోజన్‌ సైన్స్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ హబ్‌ను వారు వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కాప్‌-26 సదస్సులో ప్రకటించిన గ్రీన్‌ గ్రిడ్‌ల సాకారానికి అవసరమైన ప్రణాళికలను ఆవిష్కరించారు. అంతకుముందు- జాన్సన్‌కు రాష్ట్రపతి భవన్‌లో మోదీ ఘనస్వాగతం పలికారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి బ్రిటన్‌ ప్రధాని నివాళులర్పించారు.

సచిన్‌, అమితాబ్‌లలా అనిపించింది

భారత పర్యటనలో.. ముఖ్యంగా గుజరాత్‌లో తనకు అపూర్వ స్వాగతం లభించడం పట్ల జాన్సన్‌ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఓ దశలో తనకు తాను దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌లా ఊహించుకున్నానని.. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌లా తాను అందరికీ తెలిసినవాడినేమో అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. విలేకర్ల సమావేశంలో ప్రధాని మోదీ పేరును పలుమార్లు ‘నరేంద్ర’ అంటూ జాన్సన్‌ ఆప్యాయంగా ప్రస్తావించడం వారిద్దరి స్నేహబంధానికి అద్దం పట్టింది. మోదీని తన ప్రత్యేక స్నేహితుడిగా ఆయన అభివర్ణించారు.

జాన్సన్‌ ఇంకా ఏమన్నారంటే..

* భారత్‌ శాంతిని కాంక్షిస్తుంది. ఉక్రెయిన్‌లోని బుచాలో రష్యా దురాగతాలను మోదీ ఖండించిన సంగతిని గుర్తించాలి. రష్యాతో భారత్‌ది చారిత్రక బంధం. దాన్ని ప్రతిఒక్కరూ గౌరవిస్తున్నారు. ఉక్రెయిన్‌ నుంచి రష్యా బలగాలు బయటకు వచ్చేయాలని భారత్‌ కోరుకుంటోంది. దానితో నేను ఏకీభవిస్తున్నా.
* బ్రిటన్‌లో ఉంటూ ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే తీవ్రవాద సంస్థలను మేం ఎట్టిపరిస్థితుల్లోనూ సహింపబోం.
* భారత్‌ గొప్ప ప్రజాస్వామ్య దేశం. దాన్ని రాజ్యాంగం నిరంతరం పరిరక్షిస్తుంటుంది. (భారత్‌లో హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయన్న వార్తలపై స్పందిస్తూ..)

ఉక్రెయిన్‌లో యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందన్న అంచనాపై..

బహుశా వచ్చే ఏడాది చివరివరకు కొనసాగొచ్చు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆయన బలగాలు రష్యా దళాలను ధైర్యంగా నిలువరిస్తున్న తీరు అద్భుతం. పుతిన్‌కు పెద్ద సైన్యం ఉంది. యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా ఆయన ఘోరమైన తప్పు చేశారు. రాజకీయంగా తీవ్ర కష్టాల్లో పడ్డారు.

ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించడంపై..

భారత చట్టాల నుంచి తప్పించుకునేందుకు మా న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవడాన్ని అనుమతించబోం. ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు మేం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. చట్టపరమైన కొన్ని అంశాల కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
(బ్రిటన్‌ నుంచి విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను రప్పించేందుకు భారత్‌ దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని