చంచల్‌గూడలో ఆడుకునే మీరు మమ్మల్నంటారా?

‘ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు చెందిన కుటుంబసభ్యులతో మాట్లాడితే బాధేసింది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తే.. ప్రకృతి వైపరీత్యాల వల్లనో, గిట్టుబాటు ధర లేక పోవడం వల్లనో ఆర్థికంగా చితికిపోయి వారు బలవన్మరణానికి

Updated : 24 Apr 2022 09:50 IST

సీబీఐ దత్తపుత్రుడి మాటలు పట్టించుకోను

చింతలపూడి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజం

ఆత్మహత్య చేసుకున్న 41 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ‘ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు చెందిన కుటుంబసభ్యులతో మాట్లాడితే బాధేసింది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తే.. ప్రకృతి వైపరీత్యాల వల్లనో, గిట్టుబాటు ధర లేక పోవడం వల్లనో ఆర్థికంగా చితికిపోయి వారు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిసి కడుపు తరుక్కుపోతోంది. పొలానికి వెళ్తున్నానని చెప్పి ఉరేసుకున్న వాళ్లున్నారు. రూ.మూడు లక్షల అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన వారున్నారు.  
యజమాని దూరమై ఆదుకునేవారు లేక ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. పచ్చటి ఉభయగోదావరి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి చూస్తే బాధేస్తోంది’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతమంది కౌలు రైతులు చనిపోతుంటే పట్టించుకోని గ్రామ సచివాలయాలు ఉండి మాత్రం ఎందుకని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున పరిహారమివ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ‘రైతుల పక్షాన మాట్లాడితే నన్ను దత్తపుత్రుడంటారా? సీబీఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటల్ని పెద్దగా పట్టించుకోను. అయినా నాకు సొంతవాళ్లయిన ఇంత మంది ప్రజలుండగా దత్తపుత్రుడిగా వెళ్లాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ విషయం సరిచూసుకోమన్నారు. ఇటీవల ఒక సమావేశంలో మిమ్మల్ని పొరపాటున చర్లపల్లి షటిల్‌ టీమ్‌ అన్నాను. వాస్తవానికి మీది చంచల్‌గూడ కదా. చంచల్‌గూడలో షటిల్‌ ఆడుకుని మమ్మల్నంటారా?’ అని ఎద్దేవా చేశారు.

సినిమాల్లో సంపాదించిందే రైతులకిస్తున్నా..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పవన్‌ కల్యాణ్‌ శనివారం కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఏలూరు జిల్లా పెదవేగి, లింగపాలెం, చింతలపూడి మండలాలకు చెందిన అయిదుగురు కౌలు రైతుల కుటుంబసభ్యులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి, రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 36 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ ‘కౌలురైతుల తరఫున పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు నేనేం చేయగలనని ఆలోచించా. అందుకే నా సొంత డబ్బు రూ.5 కోట్లతో రైతు కుటుంబాలకు కొంతయినా న్యాయం చేయాలనుకున్నా. నాకు సిమెంటు ఫ్యాక్టరీలు లేవు. నా చేతిలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌  లేదు. మీ దగ్గరున్నట్లు రూ.లక్ష కోట్లూ లేవు. సినిమాల్లో సంపాదించిన డబ్బులనే రైతులకిస్తున్నా. సొంత డబ్బివ్వడం ఎంత కష్టమో తెలుసా?’ అని ప్రశ్నించారు. ‘నాపై ప్రజలకు వ్యక్తిగత ఇష్టం ఉన్నప్పటికీ రాజకీయంగా.. వారు మీకు     అవకాశమిచ్చారు. నేనూ ఆహ్వానించా. కానీ ఇంత మంది నమ్మి 150కి పైగా సీట్లిస్తే.. వాళ్ల కన్నీళ్లు  తుడవాలి కదా? రెండుచోట్లా ఓడిపోయినా అవమానంతో ఇంట్లో కూర్చోకుండా మళ్లీ ప్రజల ముందుకొచ్చా. ఓటమిని గెలుపునకు పునాదిగా భావిస్తా. ఈసారి ఓటేస్తే ముఖ్యమంత్రినవుతా. లేకుంటే ప్రజల దాసుణ్నవుతా’ అని పేర్కొన్నారు.

జనసైనికుల జోలికొస్తే సహించం

‘99సార్లు శాంతియుతంగా పోరాడతా. అహంకారానికి పోతే ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. జనసైనికులపై దాడి చేస్తున్నారు. అనవసరంగా వారి జోలికొస్తే ఊరుకునేది లేదు’ అని పవన్‌ హెచ్చరించారు. ‘నవరత్నాలు ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయో గమనించి ప్రజల్లోకి తీసుకెళ్లండి. చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికీ ప్రభుత్వం రూ.7 లక్షలు ఇచ్చి తీరాలి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం గాల్లో ఊపుతూ అందించారు. రూ.50 వేలకు మించి డబ్బు రూపంలో ఇవ్వకూడదని ఆయనకు తెలీదా? అంత సంస్కారహీనంగా ఏదో మీ సొంత సొమ్ము ఇస్తున్నట్లు ఎందుకు అహంకారం ప్రదర్శిస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘నేను ఎమ్మెస్సీ చదువుకోవాలంది ఓ సోదరి. తల్లీ నిన్ను చదివించేందుకు మేమంతా ఉన్నాం. మీ కష్టాలు తీరుస్తాం. మీ బాధను అర్థం చేసుకోగలం. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మరీ మీ పరిహారం ఇప్పిస్తాం’ అని హామీ ఇచ్చారు. నేనొస్తున్నానని తెలిసి కొంత మంది కౌలురైతులకు పరిహారం వేసిన ప్రభుత్వం అందులోనూ కులవివక్ష చూపిందని జనసేన అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు మాత్రం ఏం చేస్తారు?

జనసేన కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెడితే నానా యాగీ చేసే పోలీసులు విజయవాడలో ఓ ఆడబిడ్డ గౌరవాన్ని ముగ్గురు తీసేస్తే  ఏమీ అనట్లేదని పవన్‌ ఆరోపించారు. ‘పోలీసులు మాత్రం ఏం చేస్తారు? వారికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. వారికి డీఏలు రావు. సెలవుల్లేవు. వాళ్లను అసలు మనుషుల్లాగే చూడరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, నాయకుడు నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

చదువుకు సాయం చేస్తాం

అంతకుముందు పెదవేగి మండలంలో రైతు కుటుంబాలను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పిల్లలకు మంచి విద్య అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అది కార్యరూపం దాల్చిన వెంటనే మరింత సాయం అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

రోడ్‌షోకు అంతరాయం

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో రైతు కుటుంబాలను పరామర్శించి పవన్‌ రోడ్‌షో నిర్వహిస్తుండగా ఆయన వాహనం టైర్‌ పంక్చరయింది. దీంతో ఆయన 15 నిమిషాలపాటు వేరే కారులో ఉండి, టైరు మార్చాక తిరిగి రోడ్‌షో ప్రారంభించారు. పవన్‌ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న ద్విచక్రవాహనం పెదవేగి మండలం దుగ్గిరాల వద్ద కారును ఢీకొట్టడంతో ఇద్దరు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి.


వైకాపా మూడేళ్ల పాలనలో 3వేల మంది కౌలురైతుల ఆత్మహత్య

వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైతు ఆత్మహత్యల్లో ఏపీ.. దేశంలో మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో బిందుసేద్యంపై రాయితీలు ఎందుకు రద్దు చేశారు? ధరల స్థిరీకరణ నిధి ఎందుకు ఏర్పాటు చేయలేదు? రైతుభరోసా రూ.13,500 ఇస్తానని చెప్పి రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిపితే మొత్తం రూ.19,500 చొప్పున ప్రతి రైతుకు రావాలి. కానీ అంత ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారు. ఎందుకివ్వట్లేదని రైతులే నిలదీయాలి. వైకాపా ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలను గుర్తించట్లేదు. ఆ మాటకొస్తే అసలు వారిని కౌలురైతులుగానే గుర్తించట్లేదు. ప్రభుత్వం నిజంగా వారికి అండగా ఉంటే మాకీ పనిలేదు’ అని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని నేను గుర్తిస్తున్నా.. అని కౌలు రైతులకు పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని