AP High Court: రూ.9వేల కోట్ల బడ్జెట్‌ ఏమవుతోంది?

సంక్షేమ వసతిగృహాల నిర్వహణ తీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తమది తొమ్మిది వేల కోట్ల బడ్జెట్‌ అని చెబుతున్న సాంఘిక సంక్షేమశాఖ.. రూ.16 లక్షల ఖర్చుతో ఓ వసతిగృహానికి అదనపు అంతస్తును నిర్మించలేకపోతోందా అని ఆక్షేపించింది.

Updated : 26 Apr 2022 05:44 IST

రూ.16 లక్షలు ఇవ్వలేరా?
వసతిగృహాల నిర్వహణ ఇలాగేనా?
136 మందికి 2 మరుగుదొడ్లు, 3 స్నానపు గదులా?
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

ఈనాడు, అమరావతి: సంక్షేమ వసతిగృహాల నిర్వహణ తీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తమది తొమ్మిది వేల కోట్ల బడ్జెట్‌ అని చెబుతున్న సాంఘిక సంక్షేమశాఖ.. రూ.16 లక్షల ఖర్చుతో ఓ వసతిగృహానికి అదనపు అంతస్తును నిర్మించలేకపోతోందా అని ఆక్షేపించింది. రూ.వేల కోట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయే గదిలో 36 మంది ఉంటున్నారంటే వసతిగృహాలు ఎలాంటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. 136 మంది విద్యార్థినులు కేవలం రెండు మరుగుదొడ్లు, మూడు స్నానపుగదులతో సర్దుకుపోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందని కోర్టు ముందు హాజరైన సంక్షేమశాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ను నిలదీసింది. వివిధ అంశాలపై న్యాయస్థానం లేవనెత్తుతున్న విషయాలను సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంపై దాఖలైన ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో మీ జోక్యమేంటి?: ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేదని, ఆ సొమ్ము చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్‌ కళాశాల కార్యదర్శి షేక్‌ రహీం బాషా హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఫీజు చెల్లించకపోవడంపై వివరణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్‌ సోమవారం హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారం విద్యాశాఖదని.. ఆ విషయంలో నోడల్‌ ఏజెన్సీగా పని చేయాల్సిన అవసరం సంక్షేమ శాఖకు ఎందుకు వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందు మీ శాఖ విధులను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ఇటీవల శ్రీకాకుళంలో ఓ బాలికల సంక్షేమ వసతిగృహాన్ని పరిశీలించానన్నారు. కోర్టు హాలంత విస్తీర్ణం ఉన్న గదిని మూడుగా విభజించి 136 మంది విద్యార్థినులకు వసతి ఇచ్చారన్నారు. అక్కడున్న రెండు మరుగుదొడ్లు, మూడు స్నానాల గదులు అంతమందికి ఎలా సరిపోతాయని నిలదీశారు. 2017లో ప్రారంభించిన వసతిగృహం అదనపు గది నిర్మాణానికి రూ.16 లక్షలు కేటాయించకపోవడం వల్లే విద్యార్థినులు ఇరుకుగదుల్లో నివసిస్తున్నట్లు తెలిసిందన్నారు. అంతమంది విద్యార్థులకు ఒక్కటే వార్తా పత్రిక ఇస్తున్నారన్నారు. విజ్ఞాన సముపార్జనకు, పోటీ పరీక్షలకు సిద్ధపడటానికి వారికి తగినన్ని వార్తాపత్రికలు వేయడం లేదని ఆక్షేపించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని