పన్ను పోటుపై ప్రజల ప్రశ్నలకు బదులివ్వండి?

పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో భారీగా పెంచిన ఆస్తి పన్నుపై ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అసత్య హామీలు, నిత్య మోసాలపై ప్రజలకు క్షమాపణలైనా చెప్పాలన్నారు.

Updated : 28 Apr 2022 07:03 IST

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు
పన్ను పోటుపై సగటు మనిషి ఆవేదన
వాయిస్‌ రికార్డ్‌ను రీ ట్వీట్‌ చేసిన తెదేపా అధినేత

ఈనాడు, అమరావతి: పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో భారీగా పెంచిన ఆస్తి పన్నుపై ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అసత్య హామీలు, నిత్య మోసాలపై ప్రజలకు క్షమాపణలైనా చెప్పాలన్నారు. ‘మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా...ఇదేం బాదుడు, ఇదేం పాలన?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రభుత్వ పన్ను పోటు పట్ల సగటు మనిషి ఆవేదన’ పేరుతో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ట్వీట్‌ చేసిన వాయిస్‌ రికార్డు మెసేజ్‌ను జత చేస్తూ బుధవారం ఆయన దానిని రీ ట్వీట్‌ చేశారు.

ఆ వాయిస్‌ రికార్డు మెసేజ్‌లో ఏమి ఉందంటే...

50% పన్ను పెంపునకు ప్రాతిపదిక ఏమిటి? ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగనప్పుడు పన్నులు ఎలా పెంచుతారు? అంటూ విజయవాడకు చెందిన ఒక మధ్యతరగతి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేసిన మెసేజ్‌..
అందరికీ నమస్కారం...మధ్యతరగతి వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే...వంద రూపాయల పన్ను కడతావా? రూ.ఐదు డిస్కౌంట్‌ ఇస్తాను తగ్గించి రూ.95 కడతావా అంటే.. తిన్నా, తినకపోయినా ఇతర అవసరాలు ఉన్నా...అవన్నీ పక్కనపెట్టి రూ.95 పన్ను కట్టడానికి మొగ్గు చూపుతారు. విషయం ఏమిటంటే.. ఈ నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని విజయవాడ నగరపాలక సంస్థ ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఒక మధ్యతరగతికి చెందిన ఒక వ్యక్తిగా.. డిమాండ్‌ నోటీసు ఇవ్వకపోయినా...నగరపాలక సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ నోటీసు డౌన్‌లోడ్‌ చేశాను. అందులో రూ.5,700 చెల్లించాలని చూపించింది. గత ఏడాది రూ.3,600 కట్టాను. ఒకేసారి ఇంత ఎందుకు పెరిగిందని అదే సైట్‌లోని డీసీబీ రిపోర్టు చూశాను. అందులో ఏడు హెడ్లు కనిపించాయి.

* మొదటిది జనరల్‌ టాక్స్‌. రెండోది చెత్త పన్ను...మా ఇంటి ముందే పెద్ద చెత్త కుప్ప ఉంది. అంతా వచ్చి అక్కడ చెత్త వేస్తుంటారు. ఇందుకు చెత్త పన్ను వేశారా? శుభ్రం చేసి కదా.. చెత్త పన్ను వసూలు చేయాలి!

* మూడోది డ్రైనేజీ పన్ను. మా ఇంటి ముందు చిన్న కాలువలో నిండా చెత్తే ఉంటుంది. దోమల బెడదతో గత ఏడాది నా భార్యకు డెంగీ జ్వరం వస్తే వారం పాటు ఆసుపత్రిలో వైద్యం చేయించాను.

* నాలుగోది లైటింగ్‌ టాక్స్‌, ఐదోది నీటి పన్ను, ఆరోది అనథరైజ్డ్‌ పెనాల్టీ రూ.1,400 వేశారు. ప్లాను ఉన్నా పెనాల్టీ ఎందుకు వేస్తున్నారు? రూ.250 లైబ్రరీ సెస్సు వేశారు. నాకు దగ్గరలో మద్యం దుకాణాలు తప్పితే లైబ్రరీ కనిపించడంలేదు. టాక్స్‌ ఏరియర్స్‌ కింద రూ.570, దానిపై వడ్డీ రూ.11 ...ఇలా కలిపి మొత్తం రూ.5,700 డిమాండ్‌ నోటీసు జనరేట్‌ చేశారు.

* పన్ను సకాలంలో చెల్లించాక మళ్లీ బకాయిల ప్రస్తావనకు ఎందుకొచ్చింది? ఇదేమిటని సచివాలయం ఉద్యోగి సుబ్బారావుని అడిగితే పన్నులు పెరిగాయని చెప్పారు. మీ జీతాలు పెరిగాయా? అంటే లేదని ఆయన సమాధానమిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల స్థాయి కూడా పెరగలేదు. పన్ను మాత్రం పెరిగింది. దీనికి కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా! 50% పన్ను ఎందుకు పెరిగింది? ఇప్పుడు రూ.5,700 కడతాను... వచ్చే ఏడాది రూ.12 వేలు అవ్వదని గ్యారంటీ ఏమిటి?

* ప్రజలను ఓట్లు అడిగే నాయకులు...పన్నుల పెంపుపై ప్రజల సూచనలు, సలహాలు ఎందుకు అడగరు? ఆయిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయంటే...ఎక్కడో యుద్ధం జరుగుతుందని అనుకోవచ్చు. ఇంటి పన్ను ఎందుకు డబుల్‌ అయ్యింది? కరెంట్‌ బిల్లు, నిత్యావసరాల ధరలు ఎందుకు పెరిగాయి?

* ప్రతి పేదవాడు సినిమా చూడాలని టిక్కెట్ల రేట్లు తగ్గించారే మీరు...పన్ను ఎందుకు తగ్గించరు? ఇంత భారీగా పెంచిన పన్నులు పేదలు కట్టగలరా? సామాన్యుడి బాధను తీర్చనప్పుడు మీరు విఫలమైనట్లా? సఫలమైనట్లా?

* సగటు మానవుడిగా, రాష్ట్ర పౌరుడిగా, విజయవాడ వాసిగా ప్రభుత్వాన్ని ఈ వాయిస్‌ మెసేజ్‌ ద్వారా రిక్వెస్ట్‌ చేస్తున్నా... పన్ను విధానాన్ని మార్చి ప్రజలపై భారం తగ్గించాలి. సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపవద్దని కోరుతున్నా...’ అని ఆయన ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని