Nara Lokesh: లోకేశ్‌ బృందంపై రాళ్లదాడి

వైకాపా నాయకులు తుమ్మపూడిలో రణరంగం సృష్టించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా రాళ్లు విసురుతూ రెచ్చిపోయారు. అడుగడుగునా వారిని అడ్డుకుని అలజడి సృష్టించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు.

Updated : 29 Apr 2022 05:48 IST

 బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా నేతలు

తుమ్మపూడిలో తెదేపా నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికారపార్టీ శ్రేణుల వీరంగం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-దుగ్గిరాల, తెనాలి(కొత్తపేట): వైకాపా నాయకులు తుమ్మపూడిలో రణరంగం సృష్టించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా రాళ్లు విసురుతూ రెచ్చిపోయారు. అడుగడుగునా వారిని అడ్డుకుని అలజడి సృష్టించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ఈ ఘర్షణలో పోలీసులకూ గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో దారుణ హత్యకు గురైన వీరంకి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ గురువారం సాయంత్రం ఆ గ్రామానికి వెళ్లారు. మృతదేహం వద్దకు చేరుకునే సమయంలో వైకాపా నాయకుడొకరు అడ్డంగా నిలిచాడు. ఎంతకీ పక్కకు వెళ్లలేదు. అప్పటికే అక్కడకు పెద్దసంఖ్యలో చేరుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌ను మృతదేహం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఇంకోవైపు నుంచి వైకాపా కార్యకర్తలు వారిపైకి దూసుకొచ్చారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో లోకేశ్‌ బృందం, తెదేపా నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ పెద్దరాయి లోకేశ్‌ సమీపంలో పడింది. తృటిలో ఆయన దాన్నుంచి తప్పించుకున్నారు. రాళ్ల దాడిలో హెడ్‌కానిస్టేబుల్‌ మోహన్‌రావు తలకు గాయమైంది. రాయి దూసుకురావడంతో దుగ్గిరాల ఎస్సై శ్రీనివాసరెడ్డి తలపై టోపీ లేచిపోయింది.

పోలీసుల ప్రేక్షకపాత్ర

వైకాపా నాయకులు రాళ్ల దాడితో రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులు ప్రతిఘటించి.. ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో వైకాపా కార్యకర్తలు కొంత వెనక్కి తగ్గారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత లోకేశ్‌ మీడియాతో మాట్లాడబోగా.. వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆయన్ను మరోసారి అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకులు జూపూడి జాన్సన్‌, దాసరి వీరయ్య తదితరులు లోకేశ్‌ ప్రసంగాన్ని వీడియో తీశారు. ఎందుకు తీస్తున్నారని తెదేపా నాయకులు వారిని ప్రశ్నించారు. అయినా వారు లెక్కచేయలేదు. లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతుండగా పదేపదే అడ్డు తగిలారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తెనాలి జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

తెనాలి జీజీహెచ్‌లో బాధితురాలి మృతదేహం ఉండటంతో గురువారం తెదేపా, జనసేన సహా పలు ప్రజాసంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, నాయకులు, బాధితురాలి కుటుంబీకులు, బంధువులు అక్కడ ఆందోళన చేశారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంతలో ఆసుపత్రి వద్దకు లోకేశ్‌ వస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందటంతో వారు హుటాహుటిన మృతదేహాన్ని తుమ్మపూడికి తరలించేందుకు అంబులెన్సులో ఎక్కించారు. తెదేపా నాయకులు దానికి అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు తెదేపా నాయకుల్ని చెదరగొట్టి అంబులెన్సులో మృతదేహాన్ని తుమ్మపూడికి తీసుకెళ్లారు. ఆ అంబులెన్సు వెంటే లోకేశ్‌ కూడా ఆ గ్రామానికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని