Updated : 30 Apr 2022 05:28 IST

నిత్యం నిర్లక్ష్యపు పరీక్షే

ప్రతి రోజూ సామాజిక మాధ్యమాల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు
పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు  నిరోధించడంలో విఫలం

ఈనాడు, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుల పరంపర కొనసాగుతోంది. ప్రతిరోజూ ఉదయం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రాలు చక్కర్లు కొట్టడం.. కాసేపటి తర్వాత విద్యాశాఖ మంత్రి, అధికార యంత్రాంగం ప్రశ్నపత్రాలు లీక్‌ కాలేదు, మాల్‌ప్రాక్టీస్‌ జరగలేదని ప్రకటించడం.. ఓ తంతుగా మారింది. వీరికి ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? దీన్ని ఎలా నివారించాలనే విషయాలు పక్కనపెట్టి, ఎక్కడా ఏం జరగలేదని ఒక ప్రకటన చేస్తే సరిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజూ ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తుంటే ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతారన్నది అధికార యంత్రాంగానికి పట్టడం లేదు. ఇలాంటి పరీక్షలు నిర్వహించడం ఎందుకని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

బుధ, గురువారాల్లో తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత బయటకు వచ్చాయని, దీన్ని లీక్‌గా భావించలేమని అధికార యంత్రాంగం ప్రకటించింది. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లాలో ఆంగ్ల పరీక్ష మొదలైన 8 నిమిషాల్లోనే ప్రశ్నపత్రం వైకాపా నాయకుల వాట్సప్‌ గ్రూపులో ప్రత్యక్షమైంది. ఇది లీక్‌ కాదా? మాల్‌ప్రాక్టీస్‌కు దారితీయదా? అంటే సమాధానం లేదు. ప్రశ్నపత్రాలను తెరిచే సమయంలోనే సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే పిల్లలకు చేరకముందే బయటకు వచ్చినట్లు కాదా? నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు ప్రచారం సాగింది. ఫొటోలో కనిపిస్తున్న ప్రశ్నపత్రం వెనుకనున్న స్థలం, పరీక్ష కేంద్రం గానీ, ఫొటోలో కనిపిస్తున్న చేతిమీద రాసి ఉన్న ఆషియా అనే పేరుతో పరీక్షా సిబ్బంది, విద్యార్థులు ఎవరూ లేరని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఒకరిద్దరు పోలీసులను పెట్టి ఇన్విజిలేటర్లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్ల ఫోన్లను ముందుగానే తీసుకుంటే ఇలా వాట్సప్‌ ద్వారా ప్రశ్నపత్రం బయటికి వచ్చే అవకాశమే ఉండదు. ప్రశ్నపత్రాలపై పిల్లలతో హాల్‌టికెట్లు నంబర్లు రాయిస్తే అవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

సీబీఎస్‌ఈని చూసి నేర్చుకోలేమా?

రాష్ట్రంలో 30 వేల మందికిపైగా విద్యార్థులు సీబీఎస్‌ఈ పదోతరగతి సెమిస్టర్‌-2 పరీక్షలు రాస్తున్నారు. దాదాపుగా ఈ పరీక్షా కేంద్రాలన్నీ ప్రైవేట్‌ విద్యా సంస్థలవే. ఇన్విజిలేటర్లూ ప్రైవేటు ఉపాధ్యాయులే. కానీ ఎక్కడా లీకేజి లేకుండా పరీక్షలు జరుగుతున్నాయి. మరి ఇంత యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఉన్నా రాష్ట్ర బోర్డు ప్రశ్నపత్రాలు ముందే బయటకు వస్తున్నాయంటే కారణం సీరియస్‌నెస్‌ లేకపోవడమేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.

ఫలితాల్లో లక్ష్యాలు..

పదో తరగతి పరీక్షల్లో అత్యధిక ఫలితాలు రావాలని కలెక్టర్లు లక్ష్యాలు విధిస్తున్నారు. తాను బోధించే సబ్జెక్టులో తక్కువ మంది పాసైతే చర్యలు తీసుకుంటారేమోనన్న ఆందోళన, రెండేళ్ల తర్వాత పరీక్షలు రాస్తున్నందున పిల్లలు ఎక్కడ ఫెయిలవుతారోనన్న భయం చాలామంది ఉపాధ్యాయుల్లో ఉన్నాయి. దీంతో అధిక ఉత్తీర్ణత కోసం కొన్నిచోట్ల మాస్‌కాపీయింగ్‌కు అన్ని స్థాయిల్లోనూ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


పరీక్ష విధానాన్నే దారి తప్పించారు

లక్ష్యాల కోసం ప్రభుత్వం పరీక్ష విధానాన్నే దారి తప్పించింది. ఉత్తీర్ణతలో తమ జిల్లానే ముందుండాలి అనే యంత్రాంగాల అత్యుత్సాహమూ ఇందుకు కారణమే. పరీక్ష జరిగినన్ని రోజులు ఏదో రకంగా నడిపిస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చారు.

- ఐ.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ


సమ్మెటివ్‌ నుంచి ఇదే తంతు

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించే సమ్మెటివ్‌-1 పరీక్ష నుంచి ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా చర్యలు తీసుకోకపోవడం ఈరోజు దాన్ని పదోతరగతి వరకూ తెచ్చింది. ఇటీవల కడప జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థి చిట్టీలు చూసి పరీక్ష రాస్తుండగా ఉపాధ్యాయుడు పట్టుకున్నారు. ప్రశ్నపత్రంలో ఉన్నవాటికి మాత్రమే చిట్టీలు ఎలా తీసుకువచ్చావంటే.. ముందురోజే యూట్యూబ్‌లో పేపర్లు వస్తున్నాయి కదా సర్‌! అని పిల్లవాడు అనడంతో విస్తుపోయారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని