Andhra News: లీకేజీ దందా!

పదో తరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, ప్రశ్నపత్రాల లీక్‌లను అధికార యంత్రాంగం అరికట్టలేకపోతోంది. మంత్రి, అధికారులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. పరీక్షల నిర్వహణ అపహాస్యంగా మారింది.

Updated : 03 May 2022 05:25 IST

పదోతరగతి గణిత పరీక్షలోనూ బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలు
వరుసగా నాలుగో పరీక్షలోనూ ఇదేతంతు
పలుచోట్ల ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్న వారిని పట్టుకున్న అధికారులు

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, ప్రశ్నపత్రాల లీక్‌లను అధికార యంత్రాంగం అరికట్టలేకపోతోంది. మంత్రి, అధికారులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. పరీక్షల నిర్వహణ అపహాస్యంగా మారింది. ఈ ఏడాది లీక్‌ల పరీక్షలుగా పది పరీక్షలు మిగిలిపోనున్నాయి. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ ప్రశ్నపత్రాల లీక్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన తెలుగు పరీక్ష నుంచి సోమవారం గణితం వరకు ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వచ్చేశాయి. వీటి ఆధారంగా చిట్టీలతో సమాధానాలను కేంద్రాలకు చేరవేస్తున్నారు. దీంతో మాస్‌ కాపీయింగ్‌ పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన గణితం పరీక్షలోనూ మాస్‌ కాపీయింగ్‌ భారీగా కొనసాగింది. ఈ పరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 44 మందిని అరెస్టు చేయగా.. ఇందులో సుమారు 30మందిని సస్పెండు చేశారు.

ఉత్తీర్ణత పెంచడానికేనా?

పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలు బయటకు రావడం, కొన్ని పరీక్ష కేంద్రాల్లో భారీగా మాస్‌ కాపీయింగ్‌ జరగడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల నిఘా పెట్టి, సెల్‌ఫోన్‌లను ముందుగానే స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా.. దీన్ని సరిగా పాటించడం లేదు. వెలుగులోకి వస్తున్న ఘటనలు నామమాత్రమేనని, అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే భారీ అక్రమాలు వెలుగుచూస్తాయని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకే ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల్లో వింత పరిస్థితి..

సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్లను తగ్గించాలని, మెడ తిప్పనివ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్న వారిని తొలగించాలంటూ కొందరు అభ్యర్థులు ఆందోళన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. పరీక్షల్లో చిట్టీలు రాయించేందుకు డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు అది జరగకపోవడంతోనే అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని ఓ అధికారి ఆ వీడియోలో పేర్కొన్నారు.

నిర్వాహకులే సమాధానాలు రాసేశారు..

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన పదోతరగతి గణితం పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం పలుచోట్ల లీకైంది.  రంగంలోకి దిగిన విద్యా, పోలీసు శాఖల అధికారులు పలువురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు సహకరించిన కొందరు ఉపాధ్యాయులను సస్పెండు చేశారు. ఏలూరు సమీపంలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో నిర్వాహకులే తెల్ల కాగితాలపై సమాధానాలను రాసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సత్రంపాడులోని విద్యా వికాస్‌ ఉన్నత పాఠశాలలో (పది పరీక్ష కేంద్రం) మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందంటూ కొందరు డీఈవో కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనరు ఎల్‌.శ్రీకాంత్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యుడితో కలిసి విద్యావికాస్‌ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహించాల్సిన సిబ్బంది రెండు కార్బన్‌ నకళ్లతో సమాధానాలు రాస్తుండటాన్ని గుర్తించారు. దీంతో సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్లను త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. డీవో, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి సస్పెండు చేస్తూ డీఈవో గంగాభవాని ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌పై క్రమశిక్షణ చర్యల కోసం ఆర్జేడీ మధుసూదనరావుకు సిఫార్సు చేశారు.

ఆంగ్ల ప్రశ్నపత్రం లీకేజీలో ఆరుగురి అరెస్టు

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా నందికొట్కూరు బాలికల ఉన్నత పాఠశాల నుంచి గత నెల 29వ తేదీన పదో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు జరిపి ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ శ్రుతి ఆ వివరాలు తెలిపారు.

ప్రకాశం జిల్లా కొమరోలులో అరగంటకే బయటకు...

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి గణిత పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం... సోమవారం పరీక్ష ప్రారంభమైన అరగంటకే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ప్రకాశం జిల్లా కొమరోలులో స్క్వాడ్‌లోని అధికారులే ఈ విషయాన్ని గుర్తించారు. ప్రశ్నపత్రం లీకేజీకి సహకరిస్తున్న 12 మంది ఇంటర్‌ విద్యార్థులను స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు విచారిస్తున్నారు.

సి.ఎస్‌.పురంలో విధుల నుంచి తొలగింపు...

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా సి.ఎస్‌.పురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, రత్నం జూనియర్‌ కళాశాల కేంద్రాలను పాఠశాల విద్య ఉప సంచాలకులు, పరీక్షల జిల్లా పరిశీలకురాలు పార్వతి సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష గదుల వద్ద... ప్రశ్నపత్రం జవాబులు ఉన్న జిరాక్స్‌ కాగితాలను గుర్తించారు. ప్రశ్నల వరుస క్రమంలోనే జవాబులు ఉండడంతో... ప్రశ్నపత్రం బయటకు వెళ్లినట్లు అంచనాకు వచ్చారు. ఈ విషయమై ఆయా కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 16 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు.

ఆలూరులో  పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆలూరులో సోమవారం ఓ యువకుడి చరవాణిలోని వాట్సప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం కనిపించగా... పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నకలు చీటీలు అందించేందుకు వచ్చిన మరో యువకుడిని పోలీసులు పట్టుకోవడంతో  ప్రశ్నపత్రం లీకేజీ విషయం బహిర్గతమైంది.  


కృష్ణా జిల్లాలో ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

ఈనాడు, అమరావతి: పదోతరగతి గణితం ప్రశ్నపత్రం లీకేజీకి కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వేదికగా నిలవడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసు, విద్యాశాఖల అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లీకేజీ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి ఆరుగురు ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్‌ చేశారు.. మండవల్లి నుంచి పసుమర్రికి ప్రశ్నపత్రం వెళుతోందని నిర్ధారించినట్లు తెలిసింది. ఇక్కడ మరో స్కూల్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని