PM Modi: భారత్‌లో అవకాశాల్ని వదులుకోవద్దు

భారత దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు హరిత సాంకేతికతలు, శీతల గిడ్డంగులు, షిప్పింగ్‌, పోర్టులు, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని

Updated : 04 May 2022 05:46 IST

డెన్మార్క్‌ వ్యాపారవేత్తలతో మోదీ

హరిత సాంకేతికతలు, శుద్ధ ఇంధనం.. పోర్టుల రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపు

సంప్రదింపులకు సిద్ధం కావాలని రష్యా, ఉక్రెయిన్‌లకు పిలుపు

కోపెన్‌హాగెన్‌: భారత దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు హరిత సాంకేతికతలు, శీతల గిడ్డంగులు, షిప్పింగ్‌, పోర్టులు, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టకుంటే ఈ అవకాశాలను కోల్పోతారని డెన్మార్క్‌ వ్యాపారవేత్తలకు స్పష్టం చేశారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ఇండియా-డెన్మార్క్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం తలపెట్టిన పీఎం-గతిశక్తి పథకం గురించీ వివరించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ‘చేజారుతుందనే భయం’(ఫియర్‌ ఆఫ్‌ మిసింగ్‌ అవుట్‌-ఎఫ్‌ఓఎంఓ) గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలోనూ భారత్‌, డెన్మార్క్‌లు వ్యాపార రంగంలో కలిసి పనిచేశాయని వివరించారు. భారత్‌లోని సరళతర వ్యాపార విధానాలు వాణిజ్య సంస్థలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. రెండు దేశాలకు చెందిన అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు హాజరయ్యారు. డానిష్‌ పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన మరో సమావేశంలో మోదీతో పాటు డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌, యువరాజు ఫెడెరిక్‌ పాల్గొన్నారు.

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు పిలుపు
భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణను పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చర్చలు, దౌత్య మార్గాల్లోనే వివాదాలను పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్‌లకు ఆయన సూచించారు. డెన్మార్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌తో ద్వైపాక్షిక సంప్రదింపుల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దాడులను నిలిపివేసేలా రష్యాను భారత్‌ ఒప్పిస్తుందన్న ఆశాభావాన్ని ఫ్రెడెరిక్సన్‌ వ్యక్తం చేశారు. యుద్ధం నిలిపివేయాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభం కొనసాగుతుండడంపై భారత్‌,డెన్మార్క్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి.

విమానాశ్రయంలో విశేష స్వాగతం
మంగళవారం బెర్లిన్‌ నుంచి కోపెన్‌హాగెన్‌కు చేరుకున్న భారత ప్రధాని మోదీకి డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలకడం విశేషం. అనంతరం తన అధికారిక నివాసం మ్యారియన్‌బోగ్‌లో ఆమె మోదీకి ఆతిథ్యమిచ్చారు. 18వ శతాబ్దానికి చెందిన మ్యారియన్‌బోగ్‌..ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన భవనం. చుట్టూ విశాలమైన పచ్చటి మైదానం, జలాశయాలు, దట్టమైన వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉంది. ఇద్దరు నేతలు కొద్ది సమయంపాటు ఆ పరిసరాల్లో పర్యటించారు. భారత పర్యటనకు వచ్చినప్పడు ప్రధాని మోదీ బహూకరించిన రామ దర్బార్‌ పెయింటింగ్‌ను తన అధికారిక నివాసంలో ఫ్రెడెరిక్సన్‌ ప్రత్యేకంగా అమర్చుకున్నారు. గోడకు వేలాడుతున్న ఆ చిత్తరువును మోదీ గమనించారు. అనంతరం ఇద్దరు నేతలు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రతినిధుల బృందాల సంప్రదింపుల్లోనూ వారు పాల్గొన్నారు. భారత్‌-డెన్మార్క్‌ హరిత వ్యూహ భాగస్వామ్యం పురోగతిని సమీక్షించారు. పునరుత్పాదక ఇంధనం, పవన విద్యుత్తు, గ్రీన్‌ హైడ్రోజన్‌, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, షిప్పింగ్‌, శుద్ధ ఇంధనం తదితర అంశాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల స్నేహ బంధం మరింత బలపడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది.

పర్యావరణ అనుకూల జీవనశైలి
పర్యావరణానికి భారతీయులు కలిగిస్తున్న హాని చాలా స్వల్పమైనదని ప్రధాని మోదీ తెలిపారు. భూమాతకు నష్టం కలిగించడం మన సంస్కృతి కాదని పేర్కొన్నారు. పుడమి సహజ సిద్ధ వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు, 2070నాటికి ‘నెట్‌ జీరో’ ఉద్గారాల స్థాయిని చేరుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వస్తువులను ఒక్కసారి వాడి చెత్తలోకి విసిరేసే ధోరణికి స్వస్తి పలికి, పర్యావరణ అనుకూల జీవనశైలిని అలవరచుకోవాలని ఆయన హితవు పలికారు. డెన్మార్క్‌లో స్థిరపడ్డ భారతీయులు నిర్వహించిన సమావేశానికి మోదీ హాజరై ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని