Crime News: ఇంట్లోకి చొరబడి మహిళపై అత్యాచారం

పిల్లల పోషణకు టీ దుకాణంలో పని చేస్తూ ఒంటరి జీవితం గడుపుతున్న మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు ఆమెపై దాడి చేయడమే కాకుండా పిల్లల

Updated : 04 May 2022 04:19 IST

పిల్లల ఎదుటే అకృత్యం

నిందితుడు హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు

విజయనగరంలో ఘటన

ఈనాడు, విజయనగరం, విజయనగరం రింగురోడ్డు, న్యూస్‌టుడే: పిల్లల పోషణకు టీ దుకాణంలో పని చేస్తూ ఒంటరి జీవితం గడుపుతున్న మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు ఆమెపై దాడి చేయడమే కాకుండా పిల్లల కళ్లెదుటే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. భయంతో సోదరి ఇంట్లో తలదాచుకున్న బాధితురాలిపై మళ్లీ అత్యాచారం చేశాడు. నిందితుడు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు అని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన మహిళ (25) భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటున్నారు. పొట్టకూటి కోసం విజయనగరానికి వచ్చి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలోని ఓ టీ దుకాణంలో పని చేస్తున్నారు. వుడా కాలనీలో నివాసముంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన బంధువు విశాఖలో చికిత్స పొందుతుండటంతో వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి సోమవారం ద్విచక్ర వాహనంపై పరామర్శకు వెళ్లారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు విజయనగరం చేరుకున్నారు. సుమారు 11.30 గంటల సమయంలో చెర్రీ (19), మరో ఇద్దరు యువకులు మద్యం తాగి ఆ మహిళ ఇంటికి వచ్చారు. ఇంట్లోకి చొరబడిన చెర్రీ ఆమెతో గొడవ పడి వాహనం తాళం చెవితో ముక్కుపై దాడి చేసి, తలను గోడకేసి బాదాడు. అక్కడే ఉన్న ఆమె సోదరుడిని బయటకు గెంటేసి పిల్లల ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి సోదరి వరుసయ్యే మరో మహిళ వద్దకు సోదరుడు వెళ్లి విషయం చెప్పి ఆమెను తీసుకొచ్చారు. వారిని గమనించి చెర్రీ అక్కడి నుంచి పారిపోయాడు.

మళ్లీ బెదిరించి...

బాధితురాలి సోదరి... ఆమెను, సోదరుడిని పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లారు. చెర్రీ, మిగతా ఇద్దరు యువకులూ అక్కడికీ వచ్చి బెదిరించారు. తన చెల్లిని ఏమీ చేయొద్దని మహిళ వేడుకోగా.. అయితే నువ్వు రావాలని ఒత్తిడి చేశారు. దీంతో భయపడిన ఆ మహిళ పిల్లలు, సోదరుడిని ఇంట్లోని ఓ గదిలో ఉంచి తలుపులు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే అదనుగా ఇద్దరు యువకులు చెర్రీతోపాటు బాధితురాలిని ఇంట్లోనే ఉంచి తలుపులు వేసి బయటకు వెళ్లారు. నిందితుడు మరోసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత బయట ఉన్న యువకుల్లో ఒకరు లోపలికి వచ్చి తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. బాధితురాలు చెర్రీని, ఆ యువకుడిని బయటకు తోసేసి, ఇంటి తలుపులు మూసేశారు. తర్వాత సోదరుడు, పిల్లలున్న గది తలుపులు తీశారు. చెర్రీ బయట నుంచి తలుపులు బాదుతుండగా... ఆమె తాను పని చేస్తున్న టీ దుకాణ యజమానికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. ముగ్గురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణం రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల దాకా సాగింది. బాధితురాలు మంగళవారం ఉదయం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసును దిశ స్టేషన్‌కు అప్పగించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కేంద్రాసుపత్రికి తరలించారు.

జగన్‌ అసమర్థ పాలనవల్లే నేరాలు: తెదేపా

జిల్లా కేంద్రంలో జరిగిన అత్యాచార ఘటనపై తెదేపా విజయనగరం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, నగర అధ్యక్షురాలు పి.సూర్యకుమారి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని, సీఎం జగన్‌ అసమర్థ పాలన వల్లే దారుణాలు జరుగుతున్నాయని విమర్శించారు. దిశ స్టేషన్‌కు వెళ్లి సీఐ శేషుతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.


ఫోరెన్సిక్‌ పరీక్షల తర్వాతే వాస్తవాలు

- దీపిక ఎం.పాటిల్‌, ఎస్పీ, విజయనగరం

ఫిర్యాదు అందిన వెంటనే ఒకటో పట్టణ సీఐ జె.మురళి, రాత్రి గస్తీ తిరిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ఆమె ఆరోపణలకు, పిల్లలు చెబుతున్న విషయాలకు వ్యత్యాసం ఉంది. అక్కడ సేకరించిన వస్తువులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించాం. నివేదిక వచ్చాకే వివరాలు  వెల్లడిస్తాం. ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అతనికి సహకరించిన మిగతా ఇద్దరిపైనా కేసు నమోదు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని