Andhra News: వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు పద్మావతి అపహరణ

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల ప్రజాపరిషత్తు ఎన్నికకు సంబంధించి బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దుగ్గిరాలలో ఉండగానే వైకాపాకు చెందిన ఎంపీటీసీ

Updated : 05 May 2022 07:22 IST

ఎమ్మెల్యే ఆర్కే అనుచరులే కిడ్నాప్‌ చేశారు
కుమారుడు తాడిబోయిన యోగేంద్రనాథ్‌ ఆరోపణ
నేడు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఘటన

ఈనాడు- అమరావతి, దుగ్గిరాల, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల ప్రజాపరిషత్తు ఎన్నికకు సంబంధించి బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దుగ్గిరాలలో ఉండగానే వైకాపాకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తాడిబోయిన పద్మావతిని ఆ పార్టీకి చెందిన వ్యక్తులే అపహరించడంపై కలకలం రేగింది. ఎంపీపీ పదవిని ఆశిస్తున్న ఆమెను కిడ్నాప్‌ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఆమె కుమారుడు తాడిబోయిన యోగేంద్రనాథ్‌ మాట్లాడుతూ... ఒక వేళ పార్టీ నుంచి ఎంపీపీ పదవికి అవకాశం కల్పించకపోతే ఇతరుల మద్దతుతో తిరుగుబాటు అభ్యర్థిగా తన తల్లి పోటీ చేస్తారనే అనుమానంతో అపహరించారని ఆరోపించారు. తన తల్లిని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఇంటివద్ద కిడ్నాప్‌ చేసి కారులో ఎక్కించుకెళ్లారని చెప్పారు. తన తల్లికి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు దుగ్గిరాల ఎస్సై బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా సత్తా చాటిన విషయం విదితమే.

అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను తెలుగుదేశం గెలుచుకున్నా ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవాలని వైకాపా వ్యూహాలు రచించింది. ఇలాంటి తరుణంలో ఆ పదవిని ఆశిస్తున్న పద్మావతికి వైకాపా నుంచి సానుకూలత రాలేదు. దీంతో తిరుగుబాటు చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కిడ్నాప్‌ పరిణామం చోటుచేసుకుందని ఆమె తనయుడు యోగేంద్రనాథ్‌ పేర్కొన్నారు.  ‘ఇటీవల కాలంలో ఐదారుసార్లు పోలీసు స్టేషన్‌ చుట్టూ మమ్మల్ని తిప్పారు. కోర్టులో స్టే తొలగిపోవడంతో మా ఇంటి చుట్టూ జనాలను ఉంచి అసౌకర్యానికి గురి చేశారు. బుధవారం ఎమ్మెల్యే ఆర్కే దుగ్గిరాలకు వచ్చి ఎంపీటీసీ సభ్యులంతా ఒక చోట ఉండాలని చెప్పి నా తల్లిని తీసుకెళ్లిపోయారు. నాకు, నా తల్లికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఏది జరిగినా ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వానిదే బాధ్యత...’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని