Chandrababu: రాజకీయ సైకోలను అణచివేస్తాం

‘జగన్‌మోహన్‌రెడ్డి ఊరికో సైకోను, గ్రామానికో రౌడీని తయారు చేశారు. వాళ్ల బారి నుంచి బయట పడాలంటే గ్రామస్థులంతా ఒక్కటి కావాలి.

Updated : 06 May 2022 05:24 IST

జగన్‌రెడ్డిది ఐరన్‌లెగ్‌...

ప్రజా సమస్యలపై పోరాడండి

కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, ఈనాడు,  విశాఖపట్నం, న్యూస్‌టుడే- వన్‌టౌన్‌: ‘జగన్‌మోహన్‌రెడ్డి ఊరికో సైకోను, గ్రామానికో రౌడీని తయారు చేశారు. వాళ్ల బారి నుంచి బయట పడాలంటే గ్రామస్థులంతా ఒక్కటి కావాలి. వారి నుంచి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మన పార్టీకి ఆ శక్తిని ఇచ్చాడు. రాజకీయ సైకోలను పూర్తిగా అణచివేసి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘జగన్‌రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశారు. ఇక్కడి సహజ వనరులు, తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఉంటే మనం చెప్పిన విజన్‌ ప్రకారం 2029కి భారతదేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో రాష్ట్రంలో నిలిచేది. మనం అభివృద్ధిపై ఆలోచిస్తే.. జగన్‌ విధ్వంసంతో ఏం చేయగలరో చేసి చూపించారు. 30 ఏళ్లలో ఎవరూ చేయని విధ్వంసం మూడేళ్లలో చేశారు. దేశంలో ఎక్కడా వేయని రీతిలో పన్నులు ఇక్కడ వేస్తున్నారు. జగన్‌రెడ్డిది ఐరన్‌లెగ్‌. రాష్ట్రానికి ఏదీ రాదు తమ్ముళ్లూ’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘కార్యకర్తలు, నేతలు కలిసి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లండి. కొంతమంది నా చుట్టూ తిరిగితే పదవులు వస్తాయని అనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన వారికే పదవులు. నా చుట్టూ తిరిగితే ఫొటోలే వస్తాయి’ అని చంద్రబాబు అనడంతో సమావేశ మందిరం నవ్వులతో నిండిపోయింది.

జనం గోడు ఆలకించిన చంద్రబాబు
‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా ప్రజల బాధలు తెలుసుకునేందుకు కొందరితో చంద్రబాబు మాట్లాడించారు. అగ్రిగోల్డ్‌ బాధితులు తమ సమస్య పరిష్కారం కాలేదని చెప్పగా.. తెదేపా హయాంలో దాన్ని ఒక కొలిక్కి తీసుకురాగా జగన్‌రెడ్డి దాన్ని తొక్కిపెట్టారని, ఇప్పుడా భూములను కాజేయాలని చూస్తున్నారన్నారు. వర్షం కురుస్తున్నా.. ప్రజలు అక్కడే ఉండి సభలో పాల్గొన్నారు.


బిల్లులు మంజూరు చేయలేదు

2016లో నాకు జలసిరి పథకం మంజూరైంది. ఆ బిల్లులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద చివరి దశలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకూ బిల్లులు ఇవ్వలేదు.

- రామారావు, గొల్లలపాలెం


పింఛను తొలగించారు

నాకు తెదేపా హయాంలో దివ్యాంగుల పింఛను మంజూరైంది. వైకాపాకు ఓటు వేయలేదని ఇప్పుడు నా పింఛను తొలగించారు. నేను ఎవరి సాయం లేకుండా నడవలేను, ఏ పనీ చేసుకోలేను.

- అప్పలరాజు, లక్ష్మీపురం


నాలుగు లారీలే మిగిలాయి

గతంలో నాకు 8 లారీలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు లారీలే మిగిలాయి. ఇష్టానుసారం వేసిన పన్నులతో వ్యాపారాలు సాగక ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో నాలుగు లారీలు తీసుకుపోయారు. నెలకు ప్రభుత్వానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పన్ను కట్టాలి. ఇలా కడితే నేను ఈఎంఐలు ఎలా చెల్లిస్తాను? కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? లారీ ఇసుక ప్రస్తుతం రూ.70వేలు. తెదేపా హయాంలో రూ.16 వేలే అయ్యేది.

- తేజ, లారీ యజమాని, మద్దిలపేట


చంద్రబాబు వాహనశ్రేణి అడ్డగింత

విశాఖలో గురువారం తెదేపా అధినేత చంద్రబాబు వాహనశ్రేణి జాతీయ రహదారి నుంచి రుషికొండవైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ సమీపంలోని పర్యాటక ప్రాజెక్టు పనుల పరిశీలనకు చంద్రబాబు బయల్దేరారు. అయితే, ముందస్తు అనుమతి లేదన్న నెపంతో పోలీసులు ఎండాడ కూడలిలో వాహనాలను అడ్డుకున్నారు. దాంతో జాతీయ రహదారిపై కొన్ని కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. రుషికొండపై ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని హరిత రిసార్ట్స్‌ భవనాలను తొలగించి.. కొండపై తవ్వకాలు చేపడుతున్న ప్రదేశాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్లాల్సి ఉంది. ఆయన వస్తారని తెదేపా నేతలంతా అక్కడకు చేరుకోగా వారందరినీ అదుపులోకి తీసుకుని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. చంద్రబాబు సైతం రుషికొండ వెళ్లకుండా, నేరుగా సమావేశ ప్రాంతమైన రాజుల తాళ్లవలసకు వెళ్లిపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని