Chandrababu: ప్రజల నెత్తిన గుదిబండ

జగన్‌మోహన్‌రెడ్డి బాదుడుకు కొండలే కరిగిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘ఒక్క అవకాశమని ముద్దులు పెట్టి.. ఇప్పుడు ప్రజల నెత్తిన గుదిబండ మోపారు.

Updated : 06 May 2022 03:57 IST

జగన్‌ బాదుడుకు కొండలే కరిగిపోతున్నాయి

ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపలేని మంత్రులు ఎందుకు?

రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటుతున్నాయి

రాజుల తాళ్లవలస సభలో చంద్రబాబు మండిపాటు

ఈనాడు, విశాఖపట్నం: జగన్‌మోహన్‌రెడ్డి బాదుడుకు కొండలే కరిగిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘ఒక్క అవకాశమని ముద్దులు పెట్టి.. ఇప్పుడు ప్రజల నెత్తిన గుదిబండ మోపారు. నాడు పాదయాత్ర చేస్తే జనం కరిగిపోయారు. అది చేసింది ఖనిజాలు, భూములు ఎక్కడున్నాయో చూడ్డానికని తెలుసుకోలేకపోయారు. విశాఖలోని రుషికొండకు ఎంతో చరిత్ర, గుర్తింపు ఉన్నాయి. భీమిలి- డాల్ఫిన్‌ కొండ మధ్య ఉన్న రుషికొండ జ్ఞాపకాన్ని ఇష్టారీతిన తవ్వకాలతో చెరిపేశారు. ఆయన కన్ను దేనిమీద పడితే అది గోవిందా. నేను రుషికొండకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికే కాదు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తా.. నన్ను ఎవరూ అడ్డుకోలేరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు... విశాఖలోని పార్టీ కార్యాలయంలో విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నాయకులతో గురువారం ఉదయం సమీక్షించారు. నియోజకవర్గాల్లో పరిస్థితి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో నాయకులు ఎలా ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లోని నేతల్లో మార్పు రావాలని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. అనంతరం రోడ్డు మార్గాన భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలస గ్రామానికి చేరుకోగా స్థానిక ప్రజలు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. విద్యుత్తు కోతలకు నిరసనగా విసనకర్రలు పట్టుకొని నడిచారు. ముందుగా ఓ టీ దుకాణం వద్ద ఆగి, అక్కడున్న వారితో ముచ్చటించారు. అనంతరం గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్లి ప్రజలకు అభివాదం చేస్తూ వైకాపా ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాల వివరాలు తెలిపే కరపత్రాలు పంచారు. అనంతరం ‘బాదుడే.. బాదుడు’పై సభలో మాట్లాడారు.

ప్రజల జీవితాలు తారుమారు
చంద్రబాబు సభను ప్రారంభిస్తూ.. జగన్‌రెడ్డికి వినపడేలా ‘బాదుడే.. బాదుడు’ అని గట్టిగా చెప్పాలని మూడుసార్లు అనిపించారు. ‘ప్రజల జీవితాలు తలకిందులయ్యాయా లేదా.. అయితే అందరూ చేతులు పైకి ఎత్తండి’ అని అడిగేసరికి.. అందరూ తాము బాధితులమేనన్నారు. ‘పోలీసులకూ బాదుడే. వారికి సరిగా జీతాలు రావు, సెలవులు లేవు. ప్రజలు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి చేయడం కష్టం. విధ్వంసం సులభం. ఇప్పుడదే ఈ రాష్ట్రంలో జరుగుతోంది. దీనిపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పోరాటం నా కోసమో.. తెదేపా కోసమో కాదు. ప్రజల కోసం. ఇంతటి దరిద్రపు సీఎంను ఎక్కడా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. నూనె ధర ఎంత పెరిగిందో సభకు వచ్చిన మహిళలతో చెప్పించారు. పెంచిన ధరలను తగ్గించాలంటూ ప్రజలతో డిమాండు చేయించారు. రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నా కోపం, బాధ రావడం లేదా అని ప్రశ్నించారు. దేశంలో అత్యధిక పన్నుల భారం మోపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, మనకన్నా ఎక్కువ ధరలు ఎక్కడున్నా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాలు విసిరారు.

జగన్‌ను నమ్మిన వారు జైలుకే..
‘జగన్‌రెడ్డిని నమ్మినవారు జైలుకే పోతున్నారు. వాళ్లకు ఏమోగానీ, నాకు సిగ్గనిపిస్తోంది. అఖిలభారత సర్వీసుల్లో ఉండి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు చెబుతున్నా. రేపు అనేది ఉంది. నేను ఐటీ, ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు వచ్చేలా చేస్తే... ఇప్పుడు 5వేల జీతం వచ్చే వాలంటీరు ఉద్యోగాలిచ్చామని బ్రహ్మాండంగా చెబుతున్నారు. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీలను నియంత్రించలేని మంత్రులు ఈ రాష్ట్రానికి అవసరమా? అయ్యా బొత్స గారూ.. దేనికి మీరు మంత్రి? ఏం చేయడానికి ఉన్నారు? ఇలాంటి మంత్రులు మనకు అవసరమా?’ అని ప్రజలను అడిగారు. ‘విశాఖను ఐటీ, ఫార్మా, పర్యాటక కేంద్రంగా మార్చుదామనుకుంటే ఏ1, ఏ2లు కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. వీళ్లేమో రాజధాని అని మభ్యపెడుతున్నారు. ప్రజలకు రాజధాని కావాలా? అభివృద్ధి కావాలా’ అని ప్రశ్నించారు.

వ్యవస్థలన్నీ పతనం
‘ఏయూలో వీసీగా ఉన్న వ్యక్తి... తప్పుడు పనులు చేయడం సరికాదు. వ్యవస్థలు పతనం అవుతున్నాయి. పరిస్థితులు తీవ్రతరం అనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పోస్టుమార్టంకు ఒక వైద్యుడు లంచం డిమాండు చేశారు. అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే లంచం, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఎవరికీ బాధ అనిపించడం లేదా’ అని సభకు వచ్చినవారిని ప్రశ్నించారు. అనిపిస్తోందని వారంతా గట్టిగా సమాధానం ఇచ్చారు. అందుకు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రతి ఒక్కరూ మరో పదిమంది.. ఆ పదిమంది మరో వెయ్యిమందికి చెప్పి ప్రభుత్వం తీరును ఎండగట్టి చైతన్యం తీసుకురావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని