CM Jagan: కుళ్లు.. కుతంత్రాలతో మాపై దుష్ప్రచారం

తాము విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిసి ప్రశ్నపత్రాల లీకేజీపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. నాడు చంద్రబాబు హయాంలో

Updated : 06 May 2022 03:54 IST

ప్రశ్నపత్రాల లీకేజీ, అత్యాచారాలు వారి పనే

దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు

తిరుపతి సభలో ముఖ్యమంత్రి జగన్‌

‘విద్యా దీవెన’ కింద 709 కోట్ల జమ

ఈనాడు, తిరుపతి: తాము విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిసి ప్రశ్నపత్రాల లీకేజీపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. నాడు చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన వారి పాఠశాల నుంచే పేపర్లు లీక్‌ చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రెండు నారాయణ, మూడు చైతన్య పాఠశాలల ప్రమేయం ఇందులో ఉందని తెలిపారు. వాళ్ల పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి వ్యవస్థను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో నారాయణ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. జగన్‌ విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నాడని, మంచి పేరు వస్తుందన్న కుళ్లు, కుతంత్రాలతో ఇలా చేస్తున్నారని విమర్శించారు. వాళ్లే నాశనం చేస్తారని, మళ్లీ వాళ్లే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ.. దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో గురువారం విద్యా దీవెన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

తెదేపా నాయకులే చేశారు..
‘అత్యాచారాలు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా అతలాకుతలం అయినట్లు చెబుతున్నారు. మహిళల సంక్షేమం, ఆర్థిక, రాజకీయ సాధికారత, రక్షణ విషయంలో ఏ ప్రభుత్వం చేయనంత చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం.. అక్కాచెల్లెమ్మల మనసుల్లో జగన్‌ నిలిచిపోతాడేమోనని బురదజల్లేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మహిళలపై నేరాలు జరగకుండా చూసేందుకు ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరుగుతున్న సంఘటనలపై దోషులు ఎంతటివారైనా చట్టాన్ని ప్రయోగిస్తున్నాం. వైఫల్యం ఉంటే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడలో అత్యాచారం జరిగిందని యాగీ చేశారు.. గుంటూరులో ఏదో జరిగిందని, విశాఖలో ఏదేదో జరిగిపోతోందని మరో యాగీ. ఈ మూడు ఘటనల్లో అత్యాచారం చేసింది తెదేపా నాయకులే. వీళ్లే చేస్తారు.. వీళ్లే మళ్లీ ప్రత్యారోపణలు చేస్తుంటారు. ఏడుకొండల వాడిని మనం కోరగలిగింది.. రాష్ట్రాన్ని రక్షించాలి అని. సమాజ గతిని మార్చగలిగే గొప్ప విప్లవం చదువే. పేద విద్యార్థులు అనుభవిస్తున్న క్షోభను పాదయాత్ర సమయంలో చూశా. ఆ పరిస్థితుల నివారణ కోసమే మూడేళ్లుగా నూరుశాతం రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫీజులు 10.85 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లోకి రూ. 709 కోట్లు తిరుపతి వేదికగా వేస్తున్నా. జగనన్న విద్యా, వసతి దీవెన రెండు పథకాలకే రూ. 10,994 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో పిల్లల చదువులకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఒక పెట్టుబడిగా భావిస్తున్నా. మన పాలనలో కేవలం విద్యారంగంపై 35 నెలల్లో భారీగా వెచ్చించాం.

మేం నిలబెడుతున్నాం..
వారు గుడులు ధ్వంసం చేస్తే మేం కట్టాం. విగ్రహాలు విరిచేస్తే పెట్టించాం. రథాలను తగలబెడితే నిర్మించాం. రైతులను కుంగదీస్తే నిలబెడుతున్నాం. పిల్లలను, పల్లెలను దెబ్బతీస్తే ప్రతి పల్లెలోనూ సేవలను ప్రజల ముందుకు తెచ్చాం. గడప వద్దకే సుపరిపాలన తీసుకొచ్చి దేశానికే మార్గనిర్దేశం చేశాం. బడులను శిథిలావస్థకు తెస్తే వాటిని నిలబెడుతున్నాం. ఎన్ని ఆటంకాలు కలిగించినా ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చే పోరాటం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

చిన్న పిల్లల ఆసుపత్రికి శంకుస్థాపన.. క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్వీ విశ్వవిద్యాలయ మైదానంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం అనంతరం అలిపిరి వద్ద తితిదే ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బర్డ్‌ ఆసుపత్రిలో గ్రహణమొర్రి, చెవుడు చికిత్సల కోసం ఏర్పాటు చేసిన వార్డులను ప్రారంభించారు. భక్తులు తిరుమల వెళ్లేందుకు శ్రీనివాస సేతు తొలి దశ పనుల్లో భాగంగా శ్రీనివాసం నుంచి వాసవి భవన్‌ వరకు పూర్తయిన వారధిని ప్రారంభించారు. తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ (స్వీకార్‌) ఆసుపత్రిని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని