CM Jagan: తాగునీరు లేక వలస పోతున్నారు

‘‘కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ప్రాంతం నుంచి వలసలు అధికంగా ఉన్నాయి. అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి

Updated : 11 May 2022 05:17 IST

కర్నూలు పశ్చిమ ప్రాంతంలో సమస్య అధికం

అక్కడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి

జల వనరుల శాఖ సమీక్షలో సీఎం

ఈనాడు, అమరావతి: ‘‘కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ప్రాంతం నుంచి వలసలు అధికంగా ఉన్నాయి. అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి. వెనుకబడిన ప్రాంతాల్లో వలసలను నివారించేందుకు అవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించాలి. కుప్పం బ్రాంచి కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలి’’ అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ‘‘పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,559.37 కోట్లను కేంద్రం నుంచి వీలైనంత త్వరగా తిరిగి వచ్చేలా ప్రయత్నించాలి. గొట్టా బ్యారేజి వద్ద ఎత్తిపోతల పంపులు ఏర్పాటు చేసి హిరమండలం జలాశయంలోకి నీటిని ఎత్తిపోసేందుకు అనుమతిస్తున్నాం. దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయాలి. నేరడి బ్యారేజి నిర్మాణంపైనా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి’’ అని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం పోలవరంతోపాటు సాగునీటి ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. వాటి తాజా పరిస్థితులను అధికారులు వివరించగా అవసరమైన ఆదేశాలిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే...

* వంశధార నిర్వాసితుల కోసం అదనపు పరిహారం కింద రూ.226.71 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వెలిగొండ పునరావాస పనులూ త్వరగా పూర్తి చేయాలి. నేరడి బ్యారేజిపైనా దృష్టి సారించాలి.

* గజపతినగరం బ్రాంచి కాలువ, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలి.

* భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్‌ కాలువ, జీఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశ (కోడూరు వరకు), గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు ఎత్తిపోతల, రాజోలి, జలదరాశి జలాశయాల నిర్మాణం, రాజోలి మళ్లింపు పథకం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం వద్ద అయిదు ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్య ప్రాజెక్టులుగా చేర్చి త్వరగా పూర్తి చేయాలి.

అధికారులు ఏమన్నారంటే...
* పోలవరం దిగువ కాఫర్‌డ్యాం పనులు జులై 31కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 68% పూర్తయ్యాయి.

* దిగువ కాఫర్‌డ్యాంలో కోత పడిన ప్రాంతాన్ని ఇసుకతో నింపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే 76% జియోబ్యాగులను నింపాం.

* దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ నిర్మాణ డిజైన్లపై పరిశోధన పూర్తయింది. నెలాఖరుకు స్పష్టత వస్తుంది.

* అవుకు టన్నెల్‌ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం.

* వెలిగొండ ప్రాజెక్టులో 2014-19 మధ్య అప్పటి ప్రభుత్వ హయాంలో మొదటి టన్నెల్‌ పనులు 4.33 కిలోమీటర్లు జరిగాయి. అంటే అప్పట్లో రోజుకు 2.14 మీటర్ల పని మాత్రమే జరిగింది. 2019-22 మధ్య ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2.8 కిలోమీటర్ల పని చేశాం. రోజుకు 4.12 మీటర్ల టన్నెల్‌ పనులు జరిగాయి.

* రెండో టన్నెల్‌కు సంబంధించి పాత ప్రభుత్వ హయాంలో రోజుకు 1.31 మీటర్ల పనిచేయగా ఈ ప్రభుత్వంలో రోజుకు 2.46 మీటర్ల పని చేస్తున్నాం.

* వెలిగొండలో ప్రస్తుతం నెలకు 500 మీటర్ల పని చేస్తున్నాం. సెప్టెంబరులో మొదటి టన్నెల్‌ నుంచి, 2023 జూన్‌ నాటికి రెండో టన్నెల్‌ నుంచి నీళ్లు విడుదల చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని