Asani Cyclone: దూసుకొస్తున్న అసని

దిశ మార్చుకున్న అసని తుపాను.. కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ అలజడి సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు

Updated : 11 May 2022 05:18 IST

నేటి ఉదయానికి అమలాపురం సమీపాన తీరాన్ని తాకే అవకాశం

అక్కడి నుంచి సముద్ర తీరం వెంట ఈశాన్యదిశలో ముందుకు

కోస్తాలో భారీ వర్షాలు

గంటకు గరిష్ఠంగా 95 కి.మీ.వేగంతో గాలులు

ఈనాడు, అమరావతి: దిశ మార్చుకున్న అసని తుపాను.. కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ అలజడి సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. అర్ధరాత్రి నుంచి తీవ్రత మరింత పెరగనుంది. బుధవారం ఉదయానికి అమలాపురం-కాట్రేనికోన మధ్య తుపాను తీరాన్ని తాకుతుందని వాతావరణశాఖ అంచనా. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే మెరైన్‌ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధాన బీచ్‌లలో ప్రవేశాలను నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను రక్షిత భవనాలనూ సిద్ధంగా ఉంచారు. కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్‌లో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వివరించారు.

కోస్తా తీరానికి దగ్గరగా వచ్చి..
గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న అసని తీవ్ర తుపాను.. మంగళవారం రాత్రికి కాకినాడకు 190 కి.మీ, విశాఖపట్నానికి 300 కి.మీ, గోపాలపూర్‌కు 530 కి.మీ, పూరీకి 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయవ్యదిశగా ప్రయాణిస్తూ బుధవారం ఉదయానికి కోస్తా తీరానికి దగ్గరగా రానుంది. అమలాపురం- కాట్రేనికోన సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. అక్కడి నుంచి యానాం మీదుగా ఈశాన్య దిశలో కదులుతుంది. తీరాన్ని తాకే సమయంలో తుపానుగా బలహీనపడుతుంది. అనంతరం కాకినాడ, విశాఖపట్నం దిశగా తీరంలో ముందుకు కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరి బలహీనపడుతుంది. గురువారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని