AP PRC: పదవీ విరమణ తర్వాతే పీఆర్సీ బకాయిలు

పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ తర్వాతే ఉద్యోగులకు చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 11వ పీఆర్సీలో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను

Updated : 12 May 2022 05:52 IST

ఐఆర్‌ రికవరీ నిలిపివేత
మొత్తం 8 ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక, సాధారణ పరిపాలనశాఖలు
కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలకు పీఆర్సీ వర్తింపు

ఈనాడు, అమరావతి: పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ తర్వాతే ఉద్యోగులకు చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 11వ పీఆర్సీలో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఇప్పటివరకు పీఎఫ్‌, జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తుండగా.. ఈసారి పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని బుధవారం ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన మధ్యంతర భృతి (ఐఆర్‌) రికవరీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు 21 నెలలకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామని పేర్కొంది. పూర్తి వివరాలను విడిగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. పీఆర్సీ అమలుకు సంబంధించి ఆర్థిక, సాధారణ పరిపాలనశాఖలు బుధవారం విడివిడిగా మొత్తం 8 ఉత్తర్వులు జారీ చేశాయి.

పెన్షనర్లకు 4 వాయిదాల్లో..

పెన్షనర్లకు ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు పీఆర్సీ, డీఏ బకాయిలు రావాల్సి ఉంటే వీటిని 2023 జనవరి నుంచి నాలుగు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనున్నారు. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఐఆర్‌ రికవరీ ఉండదు. పీఆర్సీ ఆర్థిక ప్రయోజనం జనవరి 2022 నుంచి ఇస్తారు.

ఐదేళ్లకే పీఆర్సీ

ఉద్యోగులకు పీఆర్సీని ఐదేళ్లకే అమలు చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 17న ఇచ్చిన ఉత్తర్వు నంబరు-1లోని పేరా 15లో ఇచ్చిన సెంట్రల్‌ పే కమిషన్‌కు బదిలీ అంశాన్ని తొలగిస్తున్నట్లు తాజా ఉత్తర్వు-102లో పేర్కొంది. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది.  

మట్టి ఖర్చులు రూ.25వేలు

ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనరు చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చుల మొత్తాన్ని రూ.25వేలకు పెంచింది. ఇది జనవరి 2022 నుంచి వర్తిస్తుంది.

ఇతర విభాగాలకూ సవరించిన పే స్కేళ్లు

కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బందికి 11వ పీఆర్సీ సవరించిన పే స్కేల్స్‌-2022ను వర్తింప చేస్తూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. 2015 సవరించిన పే స్కేల్స్‌ తీసుకుంటున్న వారందరికీ ఇది వర్తిస్తుంది.  

ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లు

పీఆర్సీలో గరిష్ఠంగా పే స్కేల్‌కు చేరుకున్న ఉద్యోగులకు ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. పీఆర్సీ సిఫార్సు ప్రకారం ఉద్యోగులకు గ్రేడ్‌ల వారీగా డీఏ, వసతి భత్యాలు చెల్లించనున్నారు. లాడ్జింగ్‌ ఛార్జీలను నగరాలు, పట్టణాలను అనుసరించి చెల్లిస్తారు. రాష్ట్రంలో పర్యటిస్తే డీఏ గరిష్ఠంగా రూ.600, ఇతర రాష్ట్రాలకు వెళ్తే గరిష్ఠంగా రూ.800 చెల్లించనున్నారు. వాహన సదుపాయం అర్హత కలిగిన వారికి కిలోమీటర్ల లెక్కన మైలేజీ అలవెన్సులు చెల్లిస్తారు. యూనిఫామ్‌ కలిగే ఉండే వారికి యూనిఫామ్‌ అలవెన్సు, కొన్ని విభాగాలకు రిస్క్‌ తదితర అలవెన్స్‌లను ఇవ్వనున్నారు.

బకాయిలను పీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలి: ఏపీటీఎఫ్‌

పీఆర్సీ బకాయిలను గత సంప్రదాయాల ప్రకారం ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, కులశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం పదవీ విరమణ తర్వాత బకాయిలు చెల్లిస్తామని, పూర్తి వివరాలతో మరో ఉత్తర్వు జారీ చేస్తామని పేర్కొనడం ఉద్యోగులకు అభద్రతాభావం కల్పించడమేనని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని