Narayana: నారాయణకు బెయిలు

చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన మాజీ మంత్రి నారాయణకు బెయిలు మంజూరైంది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఆయనను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా.. దాదాపు రెండున్నర గంటలకుపైగా

Updated : 12 May 2022 05:53 IST

అర్ధరాత్రి 1.07 గంటలకు చిత్తూరు జిల్లాలో న్యాయమూర్తి ఎదుట హాజరు
రెండున్నర గంటలకుపైగా వాదనలు
తెల్లవారుజామున 3.50కి నిర్ణయం వెల్లడించిన జడ్జి

చిత్తూరు (న్యాయవిభాగం), న్యూస్‌టుడే: చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన మాజీ మంత్రి నారాయణకు బెయిలు మంజూరైంది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఆయనను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా.. దాదాపు రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు జడ్జి బెయిలు మంజూరు చేశారు. పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీసు కేసులో నారాయణను మంగళవారం ఉదయం 10.30కు హైదరాబాద్‌లో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ రాత్రి 1.07 గంటలకు చిత్తూరులోని నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి సులోచనా రాణి ముందు హాజరుపరిచారు. నారాయణ తరఫు న్యాయవాదులు చంద్రశేఖర్‌ నాయుడు, రామకృష్ణ, జ్యోతిరామ్‌ వాదనలను విన్న తర్వాత అభియోగాలు నమ్మశక్యంగా లేవని తోసిపుచ్చి... రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేశారు.

కేసు నేపథ్యం ఇదీ..

చిత్తూరు టాకీస్‌ వాట్సప్‌ గ్రూప్‌లో పదో తరగతి తెలుగు ప్రశ్నప్రతాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేసినట్లు చిత్తూరు డీఈవో పురుషోత్తం ఏప్రిల్‌ 27న చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఎ.గిరిధర్‌రెడ్డి, కె.సుధాకర్‌, మోహన్‌ అలియాస్‌ మోహన్‌బాబు, ఆరిఫ్‌బాషా, సురేష్‌బాబు, పవన్‌కుమార్‌రెడ్డి (ప్రభుత్వ ఉపాధ్యాయుడు), సోములను (ప్రభుత్వ ఉపాధ్యాయుడు) పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరు పరిచాక.. గిరిధర్‌రెడ్డి, సుధాకర్‌, పవన్‌కుమార్‌రెడ్డి, సురేష్‌బాబులను కస్టడీకి తీసుకుని విచారించగా.. మాల్‌ ప్రాక్టీసులో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉందని వారు చెప్పడంతోపాటు.. తమ దర్యాప్తులోనూ అదే విషయం తేలిందని నారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.


409 సెక్షన్‌ ఎలా పెడతారు?

పోలీసులు నారాయణను అరెస్టు చేసి.. మంగళవారం రాత్రి 10.45 గంటలకు చిత్తూరులోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 409, 201, 120బీ, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 65 కేసులు నమోదు చేసి.. రాత్రి 1.07 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నారాయణపై 409 సెక్షన్‌ ఎలా నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. ఆ తర్వాత నారాయణను విచారించగా.. రాజకీయ కక్షతో తనను ఈ కేసులో ఇరికించారని, తనకు 41ఎ నోటీసు ఇవ్వలేదని, ఏమీ చెప్పకుండా అరెస్టు చేశారని వివరించారు. దాంతోపాటు 2014లోనే విద్యాసంస్థల అధినేతగా నారాయణ వైదొలగారని పేర్కొంటూ న్యాయవాదులు అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత.. పోలీసుల నేరారోపణలు నమ్మేలా లేవని జడ్జి అభిప్రాయపడ్డారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించగా.. రాత్రివేళ జామీనుదారులు దొరకడం కష్టమని నారాయణ విన్నవించారు. దాంతో.. రూ.లక్ష సొంత పూచీకత్తుతో బెయిలు మంజూరు చేస్తూ జడ్జి ఆదేశాలు జారీచేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీనుదారుల పూచీకత్తును ఈ నెల 18లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కేసును పోలీసులు తగిన విధంగా విచారించి తేల్చాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 3.50 గంటలకు నారాయణకు బెయిలు మంజూరైందని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. అనంతరం 5.40 గంటలకు నారాయణ చిత్తూరు నుంచి బయల్దేరి హైదరాబాద్‌ వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని