Updated : 15 May 2022 06:35 IST

Amit Shah: ఇంత అవినీతి ప్రభుత్వాన్ని, అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు

కేసీఆర్‌ను తరిమితేనే రజాకార్‌ పాలన అంతం
ఒక్క హామీనీ నెరవేర్చకుండానే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే అభివృద్ధి
నిధులు, నీళ్లు నియామకాలు నెరవేరుస్తాం
మైనారిటీ రిజర్వేషన్లు తగ్గిస్తాం
ముందస్తు ఎన్నికల యోచనలో కేసీఆర్‌
అందుకు మేమూ సిద్ధమే
ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్‌ షా


నయా నిజాంను గద్దె దించేద్దాం...

తెలంగాణ నుంచి నయా నిజాం నవాబును వెళ్లగొట్టాలా వద్దా... పాలనలో మార్పు రావాలని కోరుకునేవారంతా చేతులు పైకెత్తి మద్దతు తెలపండి. ప్రజా సంగ్రామ యాత్ర భాజపా అధికారం కోసమో.. ఒకరిని దించి మరొకరిని సీఎంగా చేయడానికో కాదు. దళితులు, ఆదివాసీ, యువత, రైతుల సంక్షేమానికి చేస్తున్న యాత్ర. రాష్ట్రంలో రజాకార్‌ ప్రతినిధి కుటుంబ పాలన సాగుతోంది. ‘‘నా కొడుకు, నా బిడ్డ’’ అంటూ కేసీఆర్‌ సాగిస్తున్న అవినీతి పాలనను అంతమొందించడానికే ఈ యాత్ర. 

- అమిత్‌ షా


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రజాకార్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే కేసీఆర్‌ పూర్తి చేస్తారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఎవరో తాంత్రికుడు చెప్పాడని సీఎం సచివాలయానికి వెళ్లడం లేదన్నారు. కేసీఆర్‌ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆయనను గద్దె దించేందుకు యువత కదిలి రావాలన్నారు. తెలంగాణ ఎవరి జాగీరూ కాదని, అందరికీ సమానహక్కు ఉందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ మరో బెంగాల్‌గా మారుస్తున్నారని, హత్యా రాజకీయాలతో తమ కార్యకర్త సాయిగణేశ్‌ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని జైలుకు పంపుతామన్నారు. తెరాస, మజ్లిస్‌ పార్టీలు అవిభక్త కవలలని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నారని, ఎన్నికలకు తామూ సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్‌ను, మజ్లిస్‌ను గద్దె దించిన నాడే తెలంగాణకు విమోచన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక.. మైనార్టీల రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు కోటా పెంచుతామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారుతోపాటు, తెలంగాణలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పడాలని.. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఉప్పుడు బియ్యం కొంటామని హామీ ఇచ్చారు.

పథకాలకు పేర్లు మార్చి..

‘మోదీ ప్రభుత్వం రాష్ట్రం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్‌ కేంద్ర పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌ కింద కేంద్రం నిధులిస్తే.. మన ఊరు..మనబడి’ పేరుతో మీ కుమారుడి పేరు పెట్టి అమలు చేస్తున్నారు. రూ.18 వేల కోట్లు ఉపాధి హామీ పథకానికిస్తే మీ, మీ కుమారుడి ఫొటోలు పెట్టుకున్నారు. ప్రధాని ఆవాస్‌ యోజన పేరు మార్చినా ఇళ్లు ఇవ్వలేదు. పీఎం అన్న కల్యాణ్‌ యోజన కింద ప్రతి వ్యక్తికి ప్రతి నెలా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంటే మీ ఫొటోలతో పంపిణీ చేస్తున్నారు.

ఆ పథకాల అమలేది?

కేంద్ర పథకాలను తెలంగాణ అమలు చేయడం లేదు. ఆయుష్మాన్‌భారత్‌ కింద పేదలకు రూ.5 లక్షల వరకూ వైద్యం చేస్తామంటే అడ్డుకుంటున్నారు. పంటలబీమా పథకం అమలు చేయడం లేదు. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, రాజోలిబండ వంటి పథకాలకు కేంద్రం నిధులిచ్చినా అమలు చేయడం లేదు. సైన్స్‌ సిటీ పెడతామంటే 25 ఎకరాలు ఇవ్వడం లేదు. వరంగల్‌ జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ పెడతామని 2017 నుంచి కేంద్రం లేఖలు రాస్తున్నా స్పందించలేదు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ సంక్షేమానికి రూ.2,52,202 కోట్లు ఇచ్చారు. రేపు మీడియాలో ఈ జాబితా మొత్తం వస్తే చదువుకోండి. మేం ఏం ఇచ్చామో తెలుస్తుంది. ప్రాంతీయ రింగురోడ్డుకు రూ. 8 వేల కోట్లు, గ్రామీణ సడక్‌ యోజనకు రూ.17 వేల కోట్లు, మిషన్‌ భగీరథ కింద రూ.25 వేల కోట్లు ఇచ్చాం.’

ఎన్నికలకు సిద్ధం

మజ్లిస్‌కు భయపడే 370 ఆర్టికల్‌ రద్దును కేసీఆర్‌ వ్యతిరేకించారు. భాజపా భయపడదు. ఆ రెండు పార్టీలనూ ఒకేసారి పక్కకు నెట్టి అధికారంలోకి వస్తుంది. తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తుంది. తెరాస కారు స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉంది. కేసీఆర్‌ వారసత్వ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి. కుమారుడు, కుమార్తె కోసం కేసీఆర్‌ ఎన్ని స్కాములు చేశారో. శాసనసభలో ఒక్క సీటు గెలిచిన భాజపా ఎంపీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకుంది. బల్దియా ఎన్నికల్లో 40 స్థానాలు గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్‌లలో మేమే గెలిచాం. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మాకూ కావాలి. రేపు ఎన్నికలు పెట్టినా భాజపా సిద్ధంగా ఉంది’ అని అమిత్‌షా స్పష్టం చేశారు.  


కేసీఆర్‌ను దించడానికి బండి సంజయ్‌ ఒక్కరు చాలు

బండి సంజయ్‌ చేపట్టిన యాత్ర గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. యాత్రకు లభిస్తున్న ప్రజాదరణ గురించి వింటున్నా. ఈ సభలో సంజయ్‌ ప్రసంగం విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. కేసీఆర్‌ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరం లేదు. బండి సంజయ్‌ ఒక్కరూ చాలు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో 770 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేశారు. ఈ యాత్ర కొనసాగించడానికి మిస్డ్‌కాల్‌ ఇవ్వండి. అందరూ ఫోన్‌ తీసి పైకి చూపండి. 6359119119 నంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వండి. బండి యాత్రను మీరు సమర్థిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.


హామీలు అటకెక్కాయి...

‘కేసీఆర్‌ ఇచ్చిన హామీలు.. నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరాయా చెప్పండి. భాజపా అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగులకు భృతి వచ్చిందా? రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేశారా? లేదు. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించలేదు. రెండు పడకగదుల ఇళ్లు లేవు. పీఎం ఆవాస్‌ యోజన కింద ఇళ్లు కూడా నిర్మించలేదు. దళితులకు కేటాయించిన రూ.50 వేల కోట్ల బడ్జెట్‌ ఏమైంది? ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఏమైంది? 30 సెంటీమీటర్లు కూడా ఇవ్వలేదు. టీచర్‌ పోస్టుల భర్తీని కేసీఆర్‌ అటకెక్కించారు. హైదరాబాద్‌లో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టలేదు. మీ కుమారుడు, కుమార్తెకు అధికారం ఇచ్చి సర్పంచులు, ఉపసర్పంచులకు అధికారాలివ్వడం మర్చిపోయారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1340 ఉంటే.. మోదీ ప్రధాని అయ్యాక రూ.1940కి పెంచారు. కేంద్రం ధాన్యం కొనడం లేదని కేసీఆర్‌ కాకమ్మ కథలు చెబుతున్నారు. ఉప్పుడు బియ్యం కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మీకు కొనడం చేతకాకపోతే రాజీనామా చేయండి. భాజపా వస్తే ప్రతి కిలో ధాన్యాన్నీ కొంటుంది. ఉప్పుడు బియ్యమైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.’


 

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని