మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరికొందరికి ముందస్తు బెయిల్‌

పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ ఆరోపణలతో చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్‌లతోపాటు విద్యా సంస్థకు

Updated : 12 Oct 2022 12:34 IST

వారిపై తొందరపాటు చర్యలొద్దు

పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
వ్యాజ్యంపై ఉత్తర్వు: విచారణ 18కి వాయిదా

ఈనాడు, అమరావతి: పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ ఆరోపణలతో చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్‌లతోపాటు విద్యా సంస్థకు చెందిన మరికొందరికి హైకోర్టులో ఊరట లభించింది. వారు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి విషయంలో తొందరపాటు చర్యలొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు అత్యవసరంగా దాఖలైన హౌస్‌ మోషన్‌ పిటిషన్లపై విచారణ జరిపి ఆదివారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో చిత్తూరు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపరచగా బెయిలు మంజూరైంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తమను అరెస్టు చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, విద్యా సంస్థకు చెందిన డిప్యూటీ జనరల్‌ మేనేజరు జె.కొండలరావు, ఎం.కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌ కుమార్‌, జి.సురేశ్‌ కుమార్‌, ఎం.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎస్‌.ప్రణతి, జి.బసవేశ్వర వారి తరఫున పిటిషన్లు వేశారు. సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... ‘పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిలిచ్చింది. పిటిషనర్లకు మాల్‌ప్రాక్టీస్‌ వ్యవహారంతో సంబంధం లేదు. వాస్తవానికి ఈ కేసులో పిటిషనర్లు నిందితులు కాదు. నారాయణ విద్యా సంస్థల్లో వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయాలి’ అని  కోరారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని, పిటిషనర్లు నిందితులు కానప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసుల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్లు నిందితులు కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడంవల్ల కలిగే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈనెల 18 వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలొద్దంటూ మధ్యంతర బెయిలు మంజూరు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని