Raghurama: ఏపీ ప్రభుత్వంతో బ్యాంకుల కుమ్మక్కు: రఘురామ

ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులు, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కుమ్మక్కై తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని నరసాపురం ఎంపీ

Updated : 20 May 2022 09:34 IST

అవి తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయి

చర్యలు కోరుతూ ఆర్‌బీఐ గవర్నర్‌కు ఎంపీ రఘురామ లేఖ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులు, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కుమ్మక్కై తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆర్‌బీఐకి ఫిర్యాదు చేశారు. ఆయన గురువారం ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌కు ఆరు పేజీల లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శక్తి సామర్థ్యాలను చూడకుండా దాని ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీలకు బడ్జెటేతర రుణాలిస్తూ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నాయని, దీనికి బాధ్యులైన బ్యాంకులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిగూఢ కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలు అందించేలా బ్యాంకులను ప్రలోభ పెడుతోంది. ఇప్పటికే రూ.7.88 లక్షల కోట్ల రుణ భారం ఉంది. దాని ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న రూ.2.25 లక్షల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిశీలించకుండా, ఎందుకోసం ఉపయోగిస్తున్నారన్నది పరిశీలించకుండా ఇష్టానుసారంగా రుణాలు అందిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలు రుణాలు తీసుకొని ఆ మొత్తాన్ని ప్రభుత్వ వ్యయం కోసం సమకూర్చకూడదు. ఇక్కడ అదే జరుగుతోంది. అవి రుణాలు తీసుకొని ఆ డబ్బును ప్రభుత్వ ఖర్చుల కోసం అందిస్తున్నాయి. తద్వారా రాష్ట్రాన్ని గతంలో ఎన్నడూలేని అప్పుల ఊబిలోకి తోస్తున్నాయి. బ్యాంకులు బహిరంగంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై తక్షణం దృష్టి సారించి ఆయా బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి’ అని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని