అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే

రాష్ట్రంలో అభివృద్ధికి బదులు అరాచక పాలన కొనసాగుతోందని.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని తెదేపా అధినేత నారా...

Updated : 21 May 2022 06:50 IST

ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతున్నారు
ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు
అనంతపురం, సత్యసాయి జిల్లాల పర్యటనలో జగన్‌పై చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, రాణినగర్‌: రాష్ట్రంలో అభివృద్ధికి బదులు అరాచక పాలన కొనసాగుతోందని.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేసి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారన్నారు. శుక్రవారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయన పర్యటించారు. అనంతపురంలో తెదేపా శ్రేణులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన వైకాపా పాలనపై విరుచుకుపడ్డారు. సాయంత్రం సోమందేపల్లిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రసంగించారు. ‘వైకాపా మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మూడేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో మరో రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రజలపై రూ.11 లక్షల కోట్ల అప్పు భారం పడనుంది. శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వానికి, ఏపీలో వైకాపా పాలనకు ఏమాత్రం తేడా లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రాలేదు కాని.. స్పెషల్‌ స్టేటస్‌ అనే విస్కీని తీసుకొచ్చారు. కర్నూలులో నేను సోలార్‌ ప్రాజెక్టు తెచ్చినప్పుడు వ్యతిరేకించిన పెద్దమనిషి ఇప్పుడు సిగ్గులేకుండా వెళ్లి శంకుస్థాపన చేశారు...’ అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెంచి జేబులకు నవరంధ్రాలు పెట్టారన్నారు.


నేను ఇక్కడికి వచ్చింది ముఖ్యమంత్రిని అవ్వడానికి కాదు. మీకోసం వచ్చాను. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై పోరాడడానికి... మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయడానికి వచ్చాను.

- శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో  జరిగిన ర్యాలీలో తెదేపా అధినేత చంద్రబాబు


అన్నింటిలో బాదుడే బాదుడు

రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు విద్యుత్తుతో పాలన ప్రారంభించి.. కొన్ని నెలల్లోనే మిగులు విద్యుత్తును సాధించాం. తెదేపా ఐదేళ్ల పాలనలో ఏనాడు ఛార్జీలు పెంచలేదు. జగన్‌ సీఎం అయిన తర్వాత ఏకంగా ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఛార్జీలు రెట్టింపయ్యాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్‌, వంటనూనె ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో రూ.700కు ట్రాక్టరు ఇసుక వచ్చేది. ప్రస్తుతం రూ.5 వేలకు చేరింది. రాబోయే రోజుల్లో ఇంట్లో ఉండే మరుగుదొడ్ల పైనా పన్ను వేయడానికి సిద్ధమవుతున్నారు.

మీటర్లు బిగిస్తే రైతు పరిస్థితి ఏమిటి?

నాడు నందమూరి తారక రామారావు మోటార్లకు మీటర్లను తొలగించారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి బిగిస్తానంటున్నారు. అనంతపురం లాంటి జిల్లాలో వెయ్యి అడుగులు వెళ్తే కాని నీళ్లు రాని పరిస్థితి. అలాంటప్పుడు 20 హెచ్‌పీ మోటార్లు వాడాలి. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే నెలకు రూ.15 వేలు బిల్లు వస్తుంది. వాటిని రైతులు కట్టగలరా? మీటర్లు బిగిస్తే అవి రైతుల పాలిట ఉరితాళ్లు అవుతాయి.మూడేళ్లుగా ఒక్క ఎకరాకైనా బిందు పరికరాలు అందించారా? ఏటా అనంతపురం జిల్లాకే పంట నష్టపరిహారం, పెట్టుబడి రాయితీ పేరుతో రూ.1500 కోట్ల వరకు ఖర్చు చేశాం. కొన్ని సందర్భాల్లో రెండు కలిపి ఇచ్చాం. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చాలనే సంకల్పంతో పెద్ద రైతులకు డ్రిప్‌ అందించాం. అది రైతులపై మాకున్న చిత్తశుద్ధి. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటనలు తప్ప పని చేయడం లేదు.


మళ్లీ మీరే రావాలంటున్నారు

‘పది రోజులుగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పర్యటించా. మూడేళ్ల వైకాపా పాలనలో ఏం నష్టపోయారో యువతకు అర్థమైంది. అన్ని చోట్ల యువత ఎదురై రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అంతా ఇదే కోరుకుంటున్నారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా తెదేపాకు ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘నా చుట్టూ కాదని ప్రజల చుట్టూ నేతలు తిరగాలి. రాబోయే ఎన్నికల్లో యువతకే 40శాతం సీట్లు ఇస్తున్నా. ముందుగానే అభ్యర్థులను తప్పకుండా ఎంపిక చేస్తాం. కష్టపడిన వారికే పార్టీలో పదవులు ఇస్తాం. స్వప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయి మళ్లీ రావాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదు...’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి కార్యకర్తలు సహకరించవద్దని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని