Updated : 21 May 2022 08:07 IST

వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భాజపాను ఒప్పిస్తా

నన్ను ఓడిస్తానన్న వైకాపా సవాల్‌ను స్వీకరిస్తున్నా
తెలంగాణలో 15 స్థానాల్లో విజయం సాధిస్తాం: పవన్‌ కల్యాణ్‌
ఆయన విలేకరులతో మాట్లాడుతుండగా పవర్‌కట్‌
‘అంధకారంలో ఆంధ్రప్రదేశ్‌’ అంటూ వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీని సైతం ఒప్పిస్తా. ఆ పార్టీ హైకమాండ్‌తో ఈ విషయం చర్చిస్తా. రాష్ట్రం బాగుండాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కనీస ఉమ్మడి కార్యక్రమంతో అందరం ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. భాజపా అధినాయకత్వానికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పగలనని అనుకుంటున్నా....’’ అని  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. ‘‘అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలని వారిని ఎలా ఒప్పించానో... పొత్తుల విషయంలో అదేవిధంగా సాధిస్తాననే నమ్మకముంది. నేను ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో వైకాపా నాయకులు ఎలా చెబుతారు? ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో మేం చెబితే వారు వింటారా?’’ అని ప్రశ్నించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన కొద్దిమంది విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. అనేక కీలకాంశాలపై స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, కోడి కత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య, కాపు రిజర్వేషన్లపై వైకాపా వైఖరి, తదితర అంశాలపై ఆయన స్పందించారు. గడప గడపకు ప్రభుత్వం అని వైకాపా, బాదుడే బాదుడు అని తెదేపా ప్రజల ముందుకు వెళ్తున్నాయి కదా...మీరు ప్రజల ముందుకు ఎలా వెళ్లబోతున్నారని ప్రశ్నించగా ‘ప్రజల హృదయాల వద్దకు చేరేలా నా యాత్ర ఉంటుంది...’ అని పవన్‌ పేర్కొన్నారు. తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేసే బలం తమకు ఉందని, 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని చెప్పారు.  

పవన్‌కల్యాణ్‌ ఏమన్నారంటే...

‘వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అన్న నాలుగే నాలుగు పదాలు విని ఆ పార్టీ నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. రాష్ట్రం బలంగా ఉండటమే ముఖ్యం. రాష్ట్రం బలమే జనసేనకు బలం.

ఎక్కడ పోటీ చేసినా పవన్‌కల్యాణ్‌ను ఓడిస్తామంటున్న వైకాపా సవాల్‌ను స్వీకరిస్తున్నా. బళ్లు ఓడలవుతాయి. ఓడలు బళ్లు అవుతాయి. నన్ను విమర్శించిన మాజీ మంత్రులకు ఈ విషయం ఇప్పటికైనా తెలుసుండాలి.

వైకాపా ప్రభుత్వం బ్రిటిష్‌ వలస పాలనలా ఉంది.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉంది. పరిమితులు దాటి అప్పులు చేసిన అంశంపైనా కేంద్ర నాయకులతో మాట్లాడతా. నిజానికి ప్రభుత్వం అడిగినంత అప్పులు కేంద్రం ఇవ్వడం లేదు.

కాపు ఓటర్లు ఏమీ చేయలేరని వైకాపా అభిప్రాయం...

కాపు సామాజిక వర్గం 20% ఓట్లను చాలా తేలిగ్గా చీల్చగలమని వైకాపా భావిస్తోంది. ఈ వర్గం ఓటర్లు రాజకీయంగా తమను ఏమీ చేయలేరనే భావనతో ఉంది. ఈ వర్గాన్ని బలంగా తీసుకోనందునే రిజర్వేషన్లు ఇవ్వబోమని జగన్‌ చెప్పారు.

బీసీలకు మేలు చేయడం అంటే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం. వారు అభివృధ్ధి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం. ఆర్‌ కృష్ణయ్య మంచి బీసీ నేత. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ బీసీలు తెలంగాణ బీసీ నేతల విషయంలో ఎలాంటి దృక్పథంతో ఉంటారో ఇంకా పరిశీలించాలి.

కోడికత్తి కేసును ఎందుకు నిరూపించలేకపోయారు. ఈ విషయంలో వైకాపా తీరుపై సందేహాస్పదంగా ఉంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అధికారంలో ఉండీ ఎందుకు అసలు నిందితులను తేల్చలేకపోయారు. అరాచకం చేసే వారిని కాపాడితే ఇక శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి?


మాట్లాడుతుండగానే విద్యుత్తు కోత

వన్‌కల్యాణ్‌ మీడియతో మాట్లాడుతుండగానే దాదాపు 20 నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెల్‌ ఫోన్‌ లైట్ల వెలుగులోనే ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇదీ. అంధకార ఆంధ్రప్రదేశ్‌’ అని వ్యాఖ్యానించారు.  అనంతరం జనరేటర్‌ సాయంతో లైట్లు వెలిగాయి.


తెలంగాణలోనూ పోటీ చేస్తాం

చౌటుప్పల్‌ గ్రామీణం, కోదాడ, ఆర్కేపురం, న్యూస్‌టుడే: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టతనిచ్చారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో శుక్రవారం ఆయన పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసేన కార్యకర్త యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని లక్కారంలో పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. సైదులు భార్య సుమతికి రూ.5లక్షల బీమా చెక్కును అందజేశారు. అనంతరం పవన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 20 నుంచి 30 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని తీసుకొని ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు.  ఏపీ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని పవన్‌ వాఖ్యానించారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని