రాష్ట్ర ప్రభుత్వానిది ఆర్థిక నేరం!

‘కేంద్రం విడుదల చేసిన రూ.7,659.79 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రం మళ్లించడాన్ని తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించాలి. దీనిపై జోక్యం చేసుకొని గ్రామ పంచాయతీలకు నిధులను తిరిగి జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి

Published : 21 May 2022 04:58 IST

రూ.7,659 కోట్ల ఆర్థిక సంఘం  నిధులను మళ్లించింది
పంచాయతీలకు తిరిగి  జమ చేసేలా ఆదేశాలివ్వండి  
గవర్నర్‌కు ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ విన్నపం

ఈనాడు, అమరావతి: ‘కేంద్రం విడుదల చేసిన రూ.7,659.79 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రం మళ్లించడాన్ని తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించాలి. దీనిపై జోక్యం చేసుకొని గ్రామ పంచాయతీలకు నిధులను తిరిగి జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి...’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం కోరింది. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఈ బృందం ప్రతినిధులు కలిశారు. 2018-19, 2019-20, 2020-21, 2021-22లో గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రం మళ్లించిందని ఫిర్యాదు చేశారు. ఈ నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సీఎఫ్‌ఎంఎస్‌లో పెట్టి సర్పంచులకు తెలియకుండానే ఇతర అవసరాలకు వినియోగించుకుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అనైతిక చర్యలతో గ్రామ పంచాయతీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించలేకపోతున్నాయని పేర్కొన్నారు. మొత్తం ఐదు ప్రశ్నలకు సమాధానం రప్పించి వాస్తవ పరిస్థితులేమిటో తెలుసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

గవర్నర్‌కు సూచించిన ప్రశ్నలివే...

2018-19 నుంచి 2021-22 మధ్య 14, 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి నిధులు విడుదల చేసిందా?

ఈ నాలుగేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.7,659 కోట్లను గ్రామ పంచాయతీలకు కేటాయించి ఇందుకు సంబంధించిన ఖాతాలను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌కు అనుసంధానించిన విషయం వాస్తవమేనా?

రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం వాస్తవమైతే సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లోని పంచాయతీ ఖాతాలు జీరో మిగులుగా ఎందుకు చూపిస్తున్నాయి?

రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవడం అవాస్తవమైతే నిధులు ఎక్కడ ఉన్నాయి?

సర్పంచులు బాధ్యతలు చేపట్టిన మొదట్లోనూ పంచాయతీ ఆమోదం, సర్పంచి సంతకం లేకుండా ఒకసారి రూ.345కోట్లు, మరోసారి రూ.969కోట్లను మళ్లించిన విషయం వాస్తవమేనా?


నిధుల మళ్లింపుపై గవర్నర్‌ ఆశ్చర్యం: రాజేంద్రప్రసాద్‌

ర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంపై గవర్నర్‌ హరిచందన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్ని పంచాయతీల నుంచి ఈ విధంగా నిధులు మళ్లించారని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందనే సందేహాన్ని గవర్నర్‌ వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల నుంచి నిధులు మళ్లించడంతో ఖాతాలు జీరో అయ్యాయని వివరించాం...’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో నిధుల కొరత ఏర్పడి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేక సర్పంచులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి అన్నారు. విషయాన్ని అవసరమైతే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి కూడా తీసుకెళతామని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఎ.రామకృష్ణనాయుడు తెలిపారు. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల ప్రతినిధులు వానపల్లి ముత్యాలరావు, మూడే శివశంకర్‌ యాదవ్‌, వల్లూరు కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని