జగన్‌ పాలనలో అరాచకం.. విధ్వంసమే

జగన్‌ పాలనలో ఏపీలో ఎక్కడ చూసినా అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెంచేశారని.. చివరికి చెత్తపైనా

Updated : 22 May 2022 06:47 IST

 వైకాపాపై అన్ని వర్గాలూ కోపంగా ఉన్నాయి

బోస్టన్‌ మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు వర్చువల్‌ ప్రసంగం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో ఏపీలో ఎక్కడ చూసినా అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెంచేశారని.. చివరికి చెత్తపైనా పన్నులు వేస్తున్నారని విమర్శించారు. ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్‌లో శనివారం ప్రారంభమైన మహానాడును ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా స్వాగతోపన్యాసం చేశారు. ఎన్నారై తెదేపా కన్వీనర్‌ కోమటి జయరాం చంద్రబాబుకు స్వాగతం పలికారు. ‘ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటన సందర్భంగా ప్రజలు వైకాపా నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్న విషయం గుర్తించాను. మాజీమంత్రి వివేకా హత్యపై జగన్‌ చాలా మాటలు మార్చారు. ఎన్నికల ముందువరకు చెల్లెల్ని ఉపయోగించుకొని తర్వాత ఈ కేసులో మాట్లాడటానికి వీల్లేదని చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

జగన్‌ అడుగుపెట్టిన చోటల్లా నాశనమే

‘జగన్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే. అమరావతిని సర్వనాశనం చేశారు. అమరావతి ఉంటే ఇప్పుడు రూ.2-3 లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి సమకూరేది. పోలవరం ప్రాజెక్టును సందిగ్ధంలో పడేశారు. విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. సమస్యలు ఇలాగే పెరిగితే రాష్ట్రంలో భయంకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలకు ఆర్‌.కృష్ణయ్య లాంటివారిని, తనతోపాటు కేసుల్లో ఉన్నవారిని జగన్‌ ఎంపికచేశారు. ఎక్కడో పదోతరగతి తెలుగు పేపర్‌ లీకైందని మాజీ మంత్రి నారాయణను కస్టడీలోకి తీసుకున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు’ అని చంద్రబాబు తెలిపారు.

ఏపీని మరో శ్రీలంక కాకుండా కాపాడాలి

ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకలా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ.8 లక్షలకోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని కాపాడటానికి మీరంతా కృషి చేయాలి. 2500 మందితో అమెరికాలోని బోస్టన్‌లో మహానాడు నిర్వహించడం తెలుగువారి సత్తాకు నిదర్శనం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తెదేపాను అధికారంలోకి తీసుకురావాలి

తెదేపాను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రవాస తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు తమ సొంత ప్రాంతాలకు వచ్చి తెదేపా విజయానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. జూమ్‌ ద్వారా ఏపీ తెదేపా అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైవీ ప్రభాకర్‌ చౌదరి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, నన్నూరి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. మహానాడులో ఏడు తీర్మానాలను ఆమోదించారు.

* బోస్టన్‌ మహానాడులో భాగంగా యువతకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. పార్టీలో మార్పులు, యువత భావనలు, మహిళా నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం, భవిష్యత్తు ప్రణాళిపై ఇందులో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని