పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో..!?

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని పలువురు వక్తలు విమర్శించారు. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు

Published : 22 May 2022 05:45 IST

 కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభలో వక్తలు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని పలువురు వక్తలు విమర్శించారు. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు రావుల వెంకయ్య అధ్యక్షతన విజయవాడ దాసరిభవన్‌లో శనివారం కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ రచించిన ‘పోలవరం ఎన్నటికి సాకారమయ్యేను!’ పుస్తకాన్ని మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవిష్కరించారు. పోలవరం నిధుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని అన్నారు. శ్రీశైలం డ్యాం ముందు ఏర్పడిన 130 అడుగుల లోతు గుంత పూడ్చడానికి ఎందుకు అలక్ష్యం చేస్తున్నారని ఏమైనా జరిగితే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ ‘పోలవరం డయాఫ్రంవాల్‌ పనులకు కేంద్రం డబ్బులు ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయాలా? అనే దానిపై స్పష్టత లేదు...’ అని పేర్కొన్నారు. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్మాణాలకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని కోరారు. పుస్తక రచయిత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి, పోలవరానికి నిధులు సాధించడంలో జగన్‌ సర్కారు విఫలమైందన్నారు. సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం అధ్యక్షుడు కేశవరావు, సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెంకట గోపాలకృష్ణ, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య, అమరావతి రైతు ఐకాస అ్యక్షుడు పువ్వాడ సుధాకర్‌, విజయ డైరీ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని