క్యాన్సర్‌ను వేటాడే వైరస్‌

ముల్లును ముల్లుతోనే తీయాలి! అదేరీతిలో ఒక వ్యాధిని ఎదుర్కోవడానికి.. మరో వ్యాధికారకాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి వైరస్‌ను రంగంలోకి దించారు. ఇది ఆ వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటుంది.

Updated : 24 May 2022 09:21 IST

జన్యుమార్పిడితో రూపొందించిన శాస్త్రవేత్తలు

ముల్లును ముల్లుతోనే తీయాలి! అదేరీతిలో ఒక వ్యాధిని ఎదుర్కోవడానికి.. మరో వ్యాధికారకాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి వైరస్‌ను రంగంలోకి దించారు. ఇది ఆ వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటుంది. దాన్ని నాశనం చేసేలా శరీర రోగనిరోధక వ్యవస్థకు తర్ఫీదు ఇస్తుంది. దీన్ని మానవులపై పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ క్యాన్సర్‌ బాధితుడికి ఈ వైరస్‌తో కూడిన ఔషధాన్ని ఇచ్చారు.


ఏమిటీ వైరస్‌?

సీఎఫ్‌33-హెచ్‌ఎన్‌ఐఎస్‌ (వ్యాక్సీనియా) అనే జన్యుమార్పిడి వైరస్‌తో ఈ మందును తయారుచేశారు. ఇది నిర్దిష్టంగా క్యాన్సర్‌ కణాలకు ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన కణాల జోలికి పోదు. ఇలాంటివాటిని ‘ఆంకోలైటిక్‌ వైరస్‌’లుగా పేర్కొంటారు.


ఎలా పనిచేస్తుంది?

వ్యాక్సీనియా.. క్యాన్సర్‌ కణాల్లోకి ప్రవేశించి, తన సంఖ్యను పెంచుకుంటుంది. ఇలా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన ఈ కణాలు అంతిమంగా విచ్ఛిన్నమవుతాయి. ఈ క్రమంలో వేల సంఖ్యలో కొత్త వైరస్‌ రేణువులు వెలుపలికి వస్తాయి. అవి యాంటిజెన్లలా పనిచేస్తూ.. సమీపంలోని క్యాన్సర్‌ కణాలపై దాడి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఈ తరహా చికిత్సను ‘ఇమ్యూనోథెరపీ’గా పిలుస్తారు.


ప్రయోగాలు ఎలా?

అమెరికా, ఆస్ట్రేలియాల్లో క్యాన్సర్‌ ముదిరిపోయి, ఇతర చికిత్సలతో ఫలితం దక్కని స్థితిలో ఉన్న 100 మందిపైకి వ్యాక్సీనియాను ప్రయోగించనున్నారు. వీరికి ఇంజెక్షన్‌ రూపంలో తక్కువ మోతాదులో వ్యాక్సీనియాను ఇస్తారు.
ఈ ప్రయోగాలకు వాడుతున్న ఔషధంలోని వైరస్‌.. ‘హ్యూమన్‌ సోడియం అయోడైడ్‌ సింపోర్టర్‌’ (హెచ్‌ఎన్‌ఐఎస్‌) అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్‌ కణాల్లో వైరస్‌ తన సంఖ్యను పెంచుకునే తీరును చిత్రీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. రేడియోధార్మిక అయోడిన్‌ను జోడించడం ద్వారా ఆ కణాలకు అదనపు నష్టం కూడా కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


ఏం పరిశీలిస్తారు?

* మనుషులకు ఈ వ్యాక్సీనియా సురక్షితమేనా అన్నది మొదట పరిశీలిస్తారు. ఈ ఔషధాన్ని రోగులు ఎంతమేర తట్టుకోగలరు? దీనివల్ల ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తుతాయా? వంటి అంశాలను గమనిస్తారు. 

* క్యాన్సర్‌ ఇమ్యూనోథెరపీలో ఉపయోగిస్తున్న పెంబ్రోలిజుమాబ్‌ యాంటీబాడీ చికిత్సతో కలిపి ప్రయోగించినప్పుడు వ్యాక్సీనియా ఎలా పనిచేస్తుందన్నది తదుపరి ప్రయోగాల్లో పరిశీలిస్తారు. ఈ యాంటీబాడీ ఔషధం.. క్యాన్సర్‌ కణాలపై పోరాటం సాగించేలా రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.


గత పరీక్షల్లో..

వ్యాక్సీనియా సురక్షితమైనదేని, దాన్ని శరీరం తట్టుకోగలదని జంతువులపై జరిగిన ప్రయోగాల్లో తేలింది. దీనికి పేగు, ఊపిరితిత్తులు, రొమ్ము, అండాశయ, క్లోమ క్యాన్సర్లలో కణితుల పరిమాణాన్ని తగ్గించే సామర్థ్యం ఉందని వెల్లడైంది.

* ఇతర ఇమ్యూనోథెరపీలకు మరింతగా స్పందించేలా రోగ నిరోధక వ్యవస్థను ఇది ప్రేరేపించగలదని తేలింది.

* మానవుల్లోనూ ఈ ఔషధం సత్తా చాటితే క్యాన్సర్‌పై పోరులో కొత్త సాధనం అందుబాటులోకి వచ్చినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఒకవేళ ఈ క్యాన్సర్‌ కణాలు భవిష్యత్‌లో మళ్లీ వృద్ధి చెందడానికి ప్రయత్నిస్తే రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి, చంపేస్తుంది. జంతువులపై చేపట్టిన ప్రయోగాల్లో వ్యాక్సీనియా సత్తా రుజువైంది. ఈ నేపథ్యంలో మానవులపై దీన్ని ప్రయోగిస్తున్నారు.


రూపకర్తలు

అమెరికాలోని ‘సిటీ ఆఫ్‌ హోప్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌’, ఆస్ట్రేలియాలోని ‘ఇమ్యూజీన్‌’ సంస్థ శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.


టి-వెక్‌ అనే ఆంకోలైటిక్‌ వైరస్‌ చికిత్సకు ఇప్పటికే అమెరికాలో ఆమోదం లభించింది. హెర్పెస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ను మార్పిడి చేయడం ద్వారా దీన్ని రూపొందించారు. ఇది మెలనోమా అనే చర్మ క్యాన్సర్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని