
పోలీసుల వాదనపై అనుమానాలెన్నో?
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఎస్పీ వెల్లడించిన వివరాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు కుదరని పొంతన
ఈనాడు, అమరావతి: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) పాత్రకు సంబంధించి పోలీసులు వినిపించిన వాదన పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు వాంగ్మూలంలో చెప్పిన విషయాల్నే ఎస్పీ ప్రెస్‌మీట్‌లో వివరించారే తప్ప.. తమ దర్యాప్తులో ఏం తేలిందనే దానిపై స్పష్టమైన ఆధారాలతో వివరాలు చెప్పలేదన్న విమర్శలొస్తున్నాయి. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు పొంతన కుదరట్లేదు.
ఎస్పీ చెప్పింది ఇదీ: ఈ నెల 19న రాత్రి 8.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం ఆయన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకొచ్చారు. కొండయ్యపాలెంలోని నవభారత్ స్కూల్ ప్రాంగణంలో రాత్రి 10.15 వరకూ మద్యం తాగారు. ఆ సమయంలో కారులో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చూసి తనతోపాటు వాహనంలో తీసుకెళ్లారు.
అనుమానం ఇదీ: ఎస్పీ వాదనకు పూర్తి భిన్నంగా మృతుడి భార్య అపర్ణ వాదన ఉంది. ‘ఎమ్మెల్సీ అనంతబాబు పుట్టినరోజు నాలుగు నెలల కిందటే అయిపోయింది. అయినా తన పుట్టినరోజని చెప్పి 19న నా భర్తను ఇంటి నుంచి అనంతబాబు తీసుకెళ్లారు. ఆయన రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి నా భర్తకు తెలుసు. అందుకే చంపేసి శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు’ అని వాపోయారు. పోలీసులు ఆ వాదనను పట్టించుకోలేదు. పోలీసులు చెబుతున్నదే నిజమనుకున్నా... సుబ్రహ్మణ్యం ఉన్న వైపే అనంతబాబు కారు వెళ్లటం, అతన్ని చూడటం కాకతాళీయమా? పథకం ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలున్నాయి.
ఎస్పీ చెప్పింది: సుబ్రహ్మణ్యం తన పెళ్లికి అనంతబాబు నుంచి కొంత అప్పు తీసుకున్నారు. అందులో రూ.20వేలు ఇంకా ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం అడుగుతుండగా సుబ్రహ్మణ్యం ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్సీ అహం దెబ్బతిని, క్షణికావేశంలో మెడ పట్టుకుని తోసేయగా సుబ్రహ్మణ్యం తలకు గాయాలయ్యాయి. అతన్ని అనంతబాబు తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దారిలోనే సుబ్రహ్మణ్యం చనిపోయాడు.
అనుమానం: అనంతబాబు ఆర్థికంగా బాగానే ఆర్జించారు. అలాంటి వ్యక్తి కేవలం రూ.20వేల కోసం డ్రైవర్‌తో గొడవ పెట్టుకుంటారా? పోలీసులు చెబుతున్నట్లు అహం దెబ్బతినటం వల్లనో, క్షణికావేశంలో తోసేయటం వల్లనో సుబ్రహ్మణ్యం గాయపడి ఉంటే అప్పుడే ఆ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు?
ఎస్పీ చెప్పింది: సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత ఆందోళనకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. నిర్మానుష్య ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లి కారులో నుంచి దించారు. అక్కడ చుట్టూ నరికేసిన చెట్లు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఓ కర్ర తీసుకుని మృతదేహం తొడలు, చేతులు, భుజం, వీపుపై కొట్టారు. శరీరం అంతటా గాయాలు చేశారు. ఆ తర్వాత అక్కడున్న తాళ్లతో కట్టి మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించారు.
అనుమానం: నిజంగానే చనిపోయిన తర్వాతే మృతదేహంపై గాయాలు చేశారా అనేది అనుమానాస్పదమే. బతికున్నప్పుడు కొట్టడంవల్లే సుబ్రహ్మణ్యం చనిపోయాడనేది మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ. గాయాలవల్లే సుబ్రహ్మణ్యం చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలోనూ వెల్లడైంది. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపారని, ఆ విషయాన్ని తెరమరుగు చేయడానికే ఎస్పీ కొత్త వాదన వినిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?
* పోలీసులు చెబుతున్నట్లు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరే మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించటం, దించటం సాధ్యమేనా? మిగతా వారి ప్రమేయం ఉందా? ఉంటే వారెవరు? వారి గురించి దర్యాప్తులో ఎందుకు తేల్చలేదు?
* ఎమ్మెల్సీతో నిత్యం ఉండాల్సిన గన్‌మన్లు 19వ తేదీన ఏమయ్యారు?
* 19వ తేదీ అర్ధరాత్రి 2.30 నుంచి 3.30 మధ్య ఎమ్మెల్సీ అనంతబాబుకు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన వాదన ఏంటి?
* నిందితుడి వాంగ్మూలమే నిజమని నమ్మి దాని ఆధారంగానే వివరాల్ని ఎస్పీ ప్రెస్‌మీట్‌లో చెప్పడం ఏంటి? సాంకేతిక దర్యాప్తులో తాము గుర్తించిన విషయాల్ని ఆధారాలతో సహా ఎందుకు వెల్లడించలేదు?
* హత్య జరిగినప్పటి నుంచి అరెస్టు చేసేవరకూ అనంతబాబు ఎక్కడెక్కడికి వెళ్లారు.. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలేమైనా జరిగాయా అన్న వివరాలేవీ ఎస్పీ ఎందుకు చెప్పలేదు?
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
North Korea: దక్షిణ కొరియాను మరోసారి ఇబ్బంది పెట్టిన ఉత్తర కొరియా
-
Politics News
Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
-
India News
Mukhtar Abbas Naqvi: కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం?
-
India News
Gold Ornaments: 43 సవర్ల బంగారం తెచ్చి.. ఏటీఎం చెత్తబుట్టలో వేసి..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
APSRTC: అద్దె బస్సులకు ఆహ్వానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!