YSRCP Bus Tour: నేటి నుంచి వైకాపా ‘సామాజిక న్యాయభేరి’

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర గురువారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొననున్నారు.

Updated : 26 May 2022 07:32 IST

సిక్కోలు నుంచి ప్రారంభం కానున్న బస్సుయాత్ర
హాజరు కానున్న 17 మంది రాష్ట్ర మంత్రులు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర గురువారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. గురువారం నుంచి 4 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రోజుకొకటి చొప్పున విజయనగరం, రాజమహేంద్రవరం, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహించి మంత్రులు ప్రసంగించనున్నారు. తొలిరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభిస్తారు. ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా విజయనగరం వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మంత్రులు మాట్లాడతారు. అనంతరం బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. 27న విశాఖలో బయలుదేరి గాజువాక, లంకెలపాలెం కూడలి, అనకాపల్లి జంక్షన్‌, తాళ్లపాలెం జంక్షన్‌, యలమంచిలి వై జంక్షన్‌, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించి రాత్రికి తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడే బస చేస్తారు. 28న నారాయణపురం, ఏలూరు బైపాస్‌, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం, విజయవాడ తూర్పు, మంగళగిరి, గుంటూరు ఆటోనగర్‌, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. నంద్యాలలో రాత్రి బస చేస్తారు. 29న పాణ్యం, కర్నూలు, డోన్‌, వెల్దుర్తి, గుత్తి, పామిడి, గార్లదిన్నె మీదుగా అనంతపురం వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో  ప్రసంగిస్తారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, కె.నారాయణస్వామి, తానేటి వనిత, అంజాద్‌ బాషా, రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, పినిపె విశ్వరూప్‌, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్‌, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌, విడదల రజని, ఉషశ్రీ చరణ్‌ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని