కోనసీమ అల్లర్లకు వైకాపాయే కారణం

కోనసీమలో అల్లర్లకు వైకాపాయే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరులపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇల్లు తగలబడిపోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.

Updated : 27 May 2022 07:03 IST

వారే తమ మనుషుల్ని పెట్టుకుని విధ్వంసం సృష్టించారు

పరిపాలన చేతకాక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు

జగన్‌కు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు

చిలకలూరిపేట వద్ద  తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: కోనసీమలో అల్లర్లకు వైకాపాయే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరులపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇల్లు తగలబడిపోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కోనసీమలో చిచ్చు రేపారన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మహానాడు కోసం మంగళగిరిలోని తెదేపా కార్యాలయం నుంచి ఒంగోలుకు ప్రదర్శనగా వెళ్లిన చంద్రబాబు దారిలో చిలకలూరిపేట సమీపంలో తెదేపా కార్యకర్తలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్‌ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని వివరించారు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ‘క్విట్‌ జగన్‌... సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు.


తాజాగా ఎంపికైనవారితో కలిపి 9మంది వైకాపా రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందినవారే. ముగ్గురు బయటి రాష్ట్రాలవారు. ముగ్గురు సీఎం జగన్‌తో పాటు కేసుల్లో ఉన్నవారు. లాబీయింగ్‌ చేసేవారికి, కేసుల్లో సహ ముద్దాయిలకు పదవులిచ్చారు. ఇదేనా వైకాపా సామాజిక న్యాయం.  

- తెదేపా పొలిట్‌ బ్యూరో


అడ్డంకుల్ని లెక్క చేయొద్దు...ఎలాగైనా తరలిరండి

‘మహానాడు కోసం అద్దె ప్రాతిపదికన బస్సులు అడిగితే ఆర్టీసీ అధికారులు పిచ్చి పిచ్చి కారణాలతో నిరాకరించారు. ప్రైవేటు బస్సులు, విద్యాసంస్థల బస్సులు ఇవ్వడానికి సిద్ధపడ్డవారిపై రవాణా శాఖాధికారులు దాడులు చేస్తున్నారు.

తెదేపా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టుకోనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ రాష్ట్రం ఏమైనా వైకాపా జాగీరా? వారి ఆటలు సాగవు. ఇంతటి చిల్లర ముఖ్యమంత్రిని ఇంతవరకూ చూడలేదు. మహానాడుకు తాము ఎలాంటి ఇబ్బంది కలిగించట్లేదని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు సభ నిర్వహణకు ఒంగోలు మైదానాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఈ అడ్డంకులను తెలుగుదేశం కార్యకర్తలు లెక్క చేయొద్దు. ఏ వాహనం దొరికితే దానిపై మహానాడుకు రండి. అవసరమైతే ఎడ్లబళ్లపైన, కాలినడకైనా సరే తరలిరండి.

లక్షల మంది రోడ్డెక్కితే జగన్‌కు రాజపక్స గతే

చిలకలూరిపేటలో రూ.2కే 20 లీటర్ల తాగునీరు ఇచ్చే ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని ప్రారంభిస్తుంటే మా పార్టీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెడుతున్నారు. ఎంతమందిపై కేసులు పెడతారు? లక్షల మంది ఆగ్రహంతో రోడ్డెక్కితే జగన్‌ మోహన్‌రెడ్డి కూడా శ్రీలంక ప్రధాని మాదిరి పారిపోరా? రాజపక్సకు, అతని మంత్రులకు పట్టిన గతే జగన్‌కు పట్టదా? గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ప్రజలు నిలదీస్తుంటే సామాజిక న్యాయ బస్సుయాత్ర పేరిట మంత్రులు నాటకాలాడుతున్నారు. ఎస్సీల సంక్షేమం కోసం తెదేపా హయంలో ప్రవేశపెట్టిన 25 పథకాల్ని రద్దు చేయటమే సామాజిక న్యాయమా? రాష్ట్రానికి గతంలో నేను తీసుకొచ్చిన పరిశ్రమల్ని వ్యతిరేకించి, వాటితోనే ఇప్పుడు దావోస్‌లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న జగన్‌.. స్టిక్కర్‌ ముఖ్యమంత్రే. పోలీసులూ... మీరు వైకాపా కార్యకర్తల మాదిరి పనిచేయొద్దు. చట్టప్రకారం నడుచుకోవాలి. మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే మూల్యం తప్పదు’ అని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని