పాలకులుగా బలహీనవర్గాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తిగా ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’లో తమ ప్రభుత్వ విధానాన్ని, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలన, పార్టీ అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకెళతామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన

Updated : 27 May 2022 07:18 IST

అదే వైకాపా లక్ష్యం

మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

శ్రీకాకుళం నుంచి సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభం

పాల్గొన్న 16 మంది మంత్రులు

పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్‌  మళ్లింపుతో ప్రజలకు ఇబ్బందులు

విజయనగరంలో భారీ వర్షంతో సభ రద్దు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, అరసవల్లి, లావేరు గ్రామీణం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తిగా ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’లో తమ ప్రభుత్వ విధానాన్ని, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలన, పార్టీ అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకెళతామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా నుంచి గురువారం ప్రారంభమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. బలహీనవర్గాల   ప్రజలు పాలకులుగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. యాత్రలో మొత్తం 16 మంది మంత్రులు పాల్గొన్నారు. వారిలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్‌, సీదిరి అప్పలరాజు, కె.నారాయణస్వామి, తానేటి వనిత, అంజాద్‌ బాషా, బి.రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌, విడదల రజిని, ఉషశ్రీ చరణ్‌ ఉన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌ రాలేదు. తొలుత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రులు దర్శించుకున్నారు. ఏడు రోడ్ల కూడలిలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయనతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున ప్రసంగించారు. 

సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది: ధర్మాన

రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి వాలంటీర్‌ నుంచి రాజ్యసభ సభ్యుల వరకు ఎక్కడ చూసినా, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది అని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలకు రూ.1.22 లక్షల కోట్ల విలువైన పథకాలు చేరవేశామని, ఇవి తమకు అందలేదని అర్హులైనా వారిలో ఏ ఒక్కరు చెప్పినా వారికి పారితోషికం ఇస్తానన్నారు. పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ కేబినెట్‌ కూర్పు నుంచి చిన్న చిన్న పదవుల వరకూ వెనుకబడినవర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ పనిచేస్తున్నారన్నారు. బస్సు యాత్రను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 17 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కులాలకు చెందిన వారిని మంత్రులను చేయడం మునుపెన్నడు జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు తగలపెట్టాలని చూస్తున్నారని, ఆయనతో పాటు తెదేపా నాయకులను మన పల్లెలకు రానీయవద్దన్నారు. తమ మధ్య గొడవలు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

మహిళలు అండగా నిలవాలి

చిలకపాలెం కూడలి, రణస్థలం వద్ద జాతీయ రహదారిపై మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్‌, ఆదిమూలపు సురేశ్‌, విడదల రజిని ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో అత్యధిక మంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని, మహిళలు వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్ల పాటు కొనసాగుతారని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ బస్సుయాత్ర జాతీయ రహదారిలో చిలకపాలెం, రణస్థలం, పైడి భీమవరం, నాతవలస మీదుగా సాయంత్రానికి విజయనగరం చేరుకుంది.

ఆంక్షలతో జనాలకు చుక్కలు

బస్సు యాత్ర నేపథ్యంలో శ్రీకాకుళం నగరంతో పాటు 16వ నంబరు జాతీయ రహదారిపై పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపులతో జనాలకు చుక్కలు కనిపించాయి. శ్రీకాకుళంలో సన్‌రైజ్‌ హోటల్‌ నుంచి ఏడురోడ్ల కూడలికి వచ్చే కళింగరోడ్డులో ఉదయం నుంచే గంటల తరబడి భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మంత్రులు తానేటి వనిత, విడదల రజిని వాహనాలూ చిక్కుకుపోవడంతో ఏడురోడ్ల కూడలి వరకూ వారు నడుచుకుంటూ వెళ్లారు. ఈ మార్గంలో దుకాణాలనూ పోలీసులు మూయించేశారు. రణస్థలం చేరుకున్న తరువాత అక్కడ సుమారు రెండు గంటల పాటు దాదాపు అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిపివేశారు. అంబులెన్సులూ మధ్యలో ఉండిపోయాయి. వాహనాలు, బస్సుల్లో ప్రయాణించే వారంతా పిల్లాపాపలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అధికార పార్టీ నాయకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీల తరలింపు

షెడ్యూల్‌ ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకే ఏడురోడ్ల కూడలికి మంత్రుల బృందం చేరుకోవాల్సి ఉంది. అప్పటికి అనుకున్న స్థాయిలో జనాలు రాకపోవడంతో ఆలస్యం చేశారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలను ఆటోలు, ట్రాక్టర్లు బస్సుల్లో తరలించారు. హాజరైతే ఉపాధి పనికి వచ్చినట్లు మస్టర్లు వేస్తామని క్షేత్రస్థాయి సహాయకులు చెప్పినట్లు పలువురు కూలీలు పేర్కొన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని వారు వాపోయారు. దుకాణాలు మూసివేయించడంతో బయట కూడా కొనుగోలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతతో ఓ పక్క మంత్రులు ప్రసంగిస్తుండగా సభ ప్రారంభమైన పది నిమిషాలకే సగం మంది వెనుదిరిగారు.

విజయనగరంలో భారీ వర్షంతో రద్దయిన సభ

ఈనాడు, విజయనగరం: వైకాపా చేపట్టిన సామాజిక న్యాయభేరి బహిరంగ సభకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో సభ రద్దయ్యింది. పూసపాటిరేగ మండలం కందివలస వద్ద జిల్లాలోకి ఈ బస్సు యాత్ర అడుగు పెట్టింది. అక్కడ జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్వాగతం పలికారు. జమ్ము వద్ద పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో స్వాగతం పలికాయి. న్యూపూర్ణ థియేటర్‌ ఎదురుగా బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో భారీ వర్షం మొదలైంది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసింది. దాంతో కార్యకర్తలు, నేతలు, సభికులు చెల్లాచెదురయ్యారు. ఆ తర్వాత అరగంటకు అక్కడకు మంత్రుల బస్సు చేరుకొంది. కొంతసేపు వారు వాహనంలోనే వేచి ఉన్నారు. కొద్దిగా వర్షం తెరిపి ఇవ్వడంతో వేదికపైకి వచ్చారు. సభా ప్రాంగణంలో అతి కొద్దిమంది మాత్రమే ఉండడం, మైకులు పని చేయకపోవడంతో వారు వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని