అధినేతకు అడుగడుగునా నీరాజనం

మంగళహారతులిచ్చి వీరతిలకాలు దిద్ది బ్రహ్మరథం పట్టిన మహిళా లోకం.. పసుపు జెండా కట్టుకున్న వేలాది ద్విచక్రవాహనాలు.. వందలాది కార్లతో భారీ ప్రదర్శనగా తరలిన తెలుగుదేశం సైన్యం.. అడుగడుగునా తెదేపా కార్యకర్తల

Published : 27 May 2022 05:48 IST

తెదేపా అధినేత చంద్రబాబుకు మంగళహారతులతో మహిళల బ్రహ్మరథం

మండుటెండను లెక్కచేయకుండా తరలివచ్చిన జనం

చెన్నై-కోల్‌కతా జాతీయరహదారి పసుపుమయం

ఈనాడు, అమరావతి- మార్టూరు, యద్దనపూడి, న్యూస్‌టుడే: మంగళహారతులిచ్చి వీరతిలకాలు దిద్ది బ్రహ్మరథం పట్టిన మహిళా లోకం.. పసుపు జెండా కట్టుకున్న వేలాది ద్విచక్రవాహనాలు.. వందలాది కార్లతో భారీ ప్రదర్శనగా తరలిన తెలుగుదేశం సైన్యం.. అడుగడుగునా తెదేపా కార్యకర్తల సందడితో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పసుపుమయమైంది. మంగళగిరి మొదలుకుని ఒంగోలు వరకు గురువారం పార్టీ అభిమానులు, శ్రేణుల సందోహం కనిపించింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా దారి పొడవునా ఎక్కడికక్కడ వేలాది మంది అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఒంగోలు వేదికగా శుక్రవారంనుంచి ప్రారంభం కానున్న ‘మహానాడు’లో పాల్గొనేందుకు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంనుంచి 11.30కు భారీ ప్రదర్శనగా బయలుదేరారు. వేలాది కార్యకర్తలు వెంట నడిచారు. ఊరూరా పార్టీ జెండాలు రెపరెపలాడాయి. భారీ జనసందోహం రోడ్లపైకి స్వచ్ఛందంగా తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. శివారునుంచి ఒంగోలు నగరంలోకి ప్రవేశించటానికే చంద్రబాబుకు రెండున్నర గంటలకుపైగా సమయం పట్టింది. అడుగడుగునా రద్దీతో షెడ్యూల్‌కంటే గంటల తరబడి ఆలస్యంగా చంద్రబాబు పర్యటన సాగింది.

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి...

మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు తొలుత నివాళులర్పించారు. అక్కడ తెలుగు మహిళలు ఆయనకు మంగళహారతులిచ్చారు. వారు కూడా ద్విచక్రవాహనాలు, కార్లపై ర్యాలీని అనుసరించారు. చంద్రబాబు భారీ వాహన శ్రేణిపై పూలవర్షం కురిసింది. గుంటూరు ఆటోనగర్‌ వద్ద తులసీదళాలతో కూడిన భారీ గజమాలను క్రేన్‌తో చంద్రబాబు మెడలో వేశారు. ఏటుకూరు బైపాస్‌ రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆయన పూజలు చేశారు. బొప్పూడి వద్ద భారీ గజమాలతో సన్మానించారు. మార్టూరు వద్ద ఒంగోలు గిత్తల బండిపైకి ఎక్కి దాన్ని చంద్రబాబు కొంతదూరం నడిపారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. దారిపొడవునా ‘సీఎం..సీఎం’ అనే నినాదాలు హోరెత్తాయి. విజయసంకేతం చూపిస్తూ చంద్రబాబు కార్యకర్తలు, అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. బొల్లాపల్లి టోల్‌గేట్‌ వద్ద వేలాది కార్యకర్తలు స్వాగతం పలికారు. ర్యాలీ మంగళగిరి, గుంటూరు, ఏటుకూరు, చిలకలూరిపేట, మార్టూరు, ఒంగోలు క్రాస్‌రోడ్ల మీదుగా ఒంగోలుకు చేరింది. అనుకున్న సమయానికంటే అయిదు గంటల ఆలస్యంగా చంద్రబాబు ఒంగోలు చేరారు.

శ్రేణుల్లో నూతనోత్సాహం

బాపట్ల, పల్నాడు జిల్లాల సరిహద్దులోని బొప్పూడి వద్ద పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. త్రోవగుంట వద్ద తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా డ్రోన్‌ను ఏర్పాటుచేసి పూలు వెదజల్లి అభిమానాన్ని చాటారు. బాణసంచా కాల్చారు. మహానాడు వేదికకు సమీపంలో చంద్రబాబు తన కోసం  సిద్ధం చేసిన చైతన్యరథం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. త్రోవగుంట నుంచి చంద్రబాబు మంగమూరు కూడలికి వచ్చేందుకు అరగంటకు పైగా పట్టింది. ఈ సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. పొలిట్‌బ్యూరో సమావేశానికి ఆలస్యమవుతుండటంతో స్థానిక సాయిబాబా ఆలయం వద్ద చంద్రబాబు చైతన్య రథం దిగి కారులో సరోవర్‌ హోటల్‌కు వెళ్లారు.

పనిచేయని ఏసీ

చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ఏసీ పనిచేయలేదు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కారులోకి ఎక్కి కొంతదూరం ప్రయాణించారు. తర్వాత వ్యక్తిగత వాహనం తెప్పించుకుని అందులోకి మారారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు