ఘనంగా ఏర్పాట్లు

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు, తెదేపా నలభై వసంతాల వేడుక సందర్భంగా శుక్రవారం ప్రారంభం కానున్న మహానాడుకు ఒంగోలు మండలంలోని మండువవారిపాలెం ఎన్నో ప్రత్యేకతలతో సర్వాంగ

Published : 27 May 2022 05:46 IST

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు - న్యూస్‌టుడే, ఒంగోలు నగరం: నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు, తెదేపా నలభై వసంతాల వేడుక సందర్భంగా శుక్రవారం ప్రారంభం కానున్న మహానాడుకు ఒంగోలు మండలంలోని మండువవారిపాలెం ఎన్నో ప్రత్యేకతలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన వేదికను 80 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవుతో తీర్చిదిద్దారు. మూడు లక్షలమందికి పైగా వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో ఓ వైపు 40 అడుగుల ఎత్తైన డిజిటల్‌ కటౌట్‌ అమర్చి.. ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు తదితర నాయకుల చిత్రాలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణానికి ఎడమ వైపున కాలువ పక్కగా 53 ఎకరాల సువిశాల స్థలంలో 10,000 వాహనాలు, గ్యాలరీకి వెనుక వైపు వీఐపీల వాహనాలు 2,000 వరకు పార్క్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

వందలమంది వాలంటీర్లు: తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు తదితరుల ఆధ్వర్యంలో దాదాపు 500 మంది వాలంటీర్లు సేవలకు సిద్ధమయ్యారు. అతిథులకు నీళ్లు, మజ్జిగ, అల్పాహారం వంటివి అందజేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి మరో 1500 మంది రానున్నారు.

తెలుగు వంటకాలు: మూడేళ్ల విరామం తరువాత కార్యకర్తల నడుమ నిర్వహిస్తున్న వేడుక కావడంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వంటకాలు సిద్ధం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని