లక్ష్యం.. ఉజ్వల హిందుస్థాన్‌!

‘సహజ సిద్ధమైన ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్‌ను మనసు పెడితే అమెరికాకు మించిన ఆర్థిక సామర్థ్యమున్న దేశంగా మార్చవచ్చు. ఇలాంటి ఉజ్వల హిందుస్థాన్‌ను ఆవిష్కరించేందుకు ఎంతైనా

Published : 27 May 2022 05:36 IST

3 నెలల్లో సంచలన వార్త ప్రకటిస్తాం

దేవేగౌడతో సమావేశానంతరం కేసీఆర్‌ ప్రకటన

ఈనాడు, బెంగళూరు: ‘సహజ సిద్ధమైన ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్‌ను మనసు పెడితే అమెరికాకు మించిన ఆర్థిక సామర్థ్యమున్న దేశంగా మార్చవచ్చు. ఇలాంటి ఉజ్వల హిందుస్థాన్‌ను ఆవిష్కరించేందుకు ఎంతైనా శ్రమిస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ఆయన గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మనుమడు   నిఖిల్‌గౌడలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 3గంటల పాటు వర్తమాన రాజకీయాలు, ఆర్థిక స్థితిగతులపై చర్చించారు. తర్వాత సీఎం కేసీఆర్‌.. కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవేగౌడతో దేశాన్ని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దే దిశగా చర్చలు కొనసాగాయని చెప్పారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్తను వినిపిస్తామని ప్రకటించారు.

అమెరికాను మించిపోతాం..: మనకంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ప్రస్తుతం 16 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక సామర్థ్యాన్ని సాధిస్తే మనం ఐదు ట్రిలియన్‌ డాలర్ల వద్దనే నిలిచిపోయామని కేసీఆర్‌ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో సమర్థమైన యువశక్తి, మానవ వనరులు, వేలాది టీఎంసీల నీటి లభ్యత, సౌర విద్యుత్తు అందుబాటులో ఉన్నా నేటికీ తాగు, సాగునీరు, విద్యుత్తు కోసం ఇబ్బంది పడుతున్నామని విచారం వ్యక్తంచేశారు. ‘పరిశ్రమలు మూతపడ్డాయి, జీడీపీ తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ పడిపోయింది. రైతులు, దళితులు, గిరిజనులతోసహా ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇది భారత్‌కు అవమానకరమైన సందర్భం. మాధ్యమాలు, బుద్ధి జీవులు నవ భారత నిర్మాణంలో చేతులు కలపాలి’ అని పిలుపునిచ్చారు.  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ దసరా సందర్భంగా దేశానికి ఓ శుభవార్త అందిస్తామని ప్రకటించారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కేసీఆర్‌ల చర్చలు దేశానికి సమగ్ర పాలన అందించే దిశగా సాగాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని