ప్రాణభయంతో బాత్రూంలో దాక్కున్నాం

‘మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి నిజంగానే జరిగిందా అని తెలుసుకునేలోపే 400-500 మంది రాళ్లతో మా ఇంటిపై దాడిచేశారు. గాజుపెంకులు తగులుతున్నాయని... నేను, నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూంలో

Published : 27 May 2022 05:36 IST

ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌

ఈనాడు, కాకినాడ: ‘మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి నిజంగానే జరిగిందా అని తెలుసుకునేలోపే 400-500 మంది రాళ్లతో మా ఇంటిపై దాడిచేశారు. గాజుపెంకులు తగులుతున్నాయని... నేను, నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూంలో దాక్కోవాల్సి వచ్చింది. నన్ను, నా భార్యను మంటల్లో నుంచి పోలీసులు కిందకు తీసుకెళ్లారు’ అని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ తెలిపారు. ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటికి గురువారం ఆయన సతీసమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా ‘ఈనాడు- ఈటీవీ’తో మాట్లాడారు. ‘ఎక్కడైనా అల్లర్లు జరిగితే బస్సులు, ప్రభుత్వ ఆస్తులు తగలబెడతారు. ఇలా ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు జరుగుతాయని ఊహించలేదు. ఇదా రాజకీయం..? ఇలా అధికారంలోకి రావాలనుకుంటే భగవంతుడు కూడా క్షమించడు. జిల్లా పేరు మార్పులో మా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు సాకారం కావడానికి విశ్వరూప్‌, నేను కారణమనే ఉద్దేశంతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఆయనను, నన్ను తగులబెట్టేయాలని చూశారు. ఆందోళనలోకి సంఘ విద్రోహశక్తులు ప్రవేశించడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ముందుగా గుర్తించడంలో నిఘా వైఫల్యం ఉంది’ అని ఎమ్మెల్యే సతీష్‌ చెప్పారు. ‘పవన్‌ కల్యాణ్‌ మంచి భావజాలం ఉన్న నాయకుడని ఇన్నాళ్లూ అనుకున్నాను. ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని ఊహించలేదు. మా ఇంట్లో మేముండి... ఇల్లు తగలబెట్టుకుంటామా? మా కుటుంబాలను బలి చేసుకునే రాజకీయాలు చేసే అవసరం మాకు లేదు. అందరినీ తృప్తిపరిచేలా డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అని పేరు ప్రతిపాదించాం. ముందే నిర్ణయం తీసుకుని అంబేడ్కర్‌ జిల్లా అని పేరు పెడితే మాట్లాడేవాడే లేడిక్కడ’ అని ఎమ్మెల్యే సతీష్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని